కేసీఆర్..డీఎస్..ఇక కలిసే చాన్స్ లేదు

Thu Aug 16 2018 18:48:16 GMT+0530 (IST)

రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్ గా తెరమీదకు వచ్చి...అంతే అనూహ్య రీతిలో చల్లారిన సీనియర్ రాజకీయ వేత్త - రాజ్యసభ సభ్యుడు ధర్మపురి శ్రీనివాస్ రాజకీయ భవిష్యత్ ఎపిసోడ్ విషయంలో ఒకట్రెండు రోజుల్లో పూర్తి స్పష్టత వచ్చేసింది.  పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ నిజామాబాద్ జిల్లాకు చెందిన ఎంపీ - సీఎం కేసీఆర్ తనయ కవిత సహా నిజామాబాద్ జిల్లా ప్రజాప్రతినిధులు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ నాయకురాలు సోనియాగాంధీ సహా ఇతర నేతలను ఢిల్లీలో కలుసుకోవడంతో పాటు త్వరలో ఆ పార్టీలో చేరబోతారన్న వార్తలు రావడం డీఎస్ తనయుడు అరవింద్ బీజేపీలో దూకుడుగా ముందుకు వెళ్లడం వంటివి ఇందుకు కారణాలని ఒక చర్చ ఉంది. డీఎస్‌ను వదిలించుకునేందుకు గులాబీ దళపతి - టీఆర్ ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ డిసైడయ్యారు. తాజాగా జరిగిన పరిణామం ఇందుకు నిదర్శనం అయింది. ఇందుకు గవర్నర్ కార్యాలయం వేదిక అయింది.స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ లోని రాజ్ భవన్ లో గవర్నర్ నరసింహన్ ఎట్ హోం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్ - స్పీకర్ మధుసూదనాచారి - మండలి ఛైర్మన్ స్వామిగౌడ్ - హైకోర్టు చీఫ్ జస్టిస్ రాధాకృష్ణన్ - మంత్రులు - సీఎల్పీ నేత జానారెడ్డి - ఉత్తమ్ - లక్ష్మణ్ తో పాటు ఏపీ ప్రభుత్వం తరపున డిప్యూటీ సీఎం చినరాజప్ప హాజరయ్యారు. ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యుడిగా డీఎస్ కూడా విచ్చేశారు. అయితే వారందరినీ పలకరించిన సీఎం కేసీఆర్...డీఎస్ ను మాత్రం పలకరించలేదు. పైగా అదే సమయంలో ప్రధాన ప్రతిపక్షనేత కె.జానారెడ్డి - టీడీపీ నేతలతో ముచ్చటించారు. కానీ డీఎస్ తో మాట మాత్రం కూడా మాట్లాడలేదు. దీంతో...డీఎస్ పై సస్పెన్షన్ వేటు వేసేందుకు కేసీఆర్ సిద్ధంగా ఉన్నారని అంటున్నారు.

ఇదిలాఉండగా... ఎస్ కుమారుడు సంజయ్ తమను లైంగికంగా వేధిస్తున్నాడంటూ నిజామాబాద్ శాంకరి నర్సింగ్ కాలేజీ విద్యార్థినిలు హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డికి ఫిర్యాదు చేశారు. ఈ మధ్య కాలంలో తమలో ఇద్దరిని సంజయ్ బలవంతంగా తీసుకెళ్లి లైంగిక దాడులు చేయడానికి ప్రయత్నించారని హోంమంత్రికి విద్యార్థినిలు వివరించారు. దీనిపై ఫిర్యాదు చేయడంతో ఆయనపై నిర్భయ కేసు నమోదు చేయడం అనంతరం అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపించడం తెలిసిన సంగతే. బెయిల్ కోరిన సంజయ్ విషయంలో తాజాగా డీఎస్ ఇంప్లీడ్ అయ్యి బెయిల్ మంజూరికి వినతి పెట్టుకున్నారు. దీంతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా డీఎస్ కదులుతున్నారనేందుకు ఇవే తార్కాణాలని చర్చ జరుగుతోంది. మరోవైపు తన తనయ - నిజామాబాద్ ఎంపీ కవిత ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటివరకు కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. డీఎస్ తనంతతానుగా పార్టీకి వ్యతిరేకంగా స్పందిస్తే ఆయనపై వేటు వేసేందుకు కేసీఆర్ చూస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.