Begin typing your search above and press return to search.

నేటి నుంచే కుంభ‌మేళా..ప్రారంభానికి ముందే భారీ అప‌శృతి

By:  Tupaki Desk   |   15 Jan 2019 8:29 AM GMT
నేటి నుంచే కుంభ‌మేళా..ప్రారంభానికి ముందే భారీ అప‌శృతి
X
మన సాంస్కృతిక వారసత్వానికి - సంప్రదాయాలకు అతిపెద్ద ప్రతీక - సనాతన భారతీయ జీవనశైలికి ప్రతీక‌ అయిన కుంభమేళా ప్రారంభం అయింది. మంగళవారం తెల్లవారుజాము నుంచి లాంఛనంగా ప్రారంభం అయిన‌ ఈ మేళాకు ఉత్తరప్రదేశ్‌ లో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆధ్యాతిక - రాజకీయ - పర్యాటక సంగమమైన ఈ మహా ఉత్సవంలో పాల్గొనేందుకు ప్రపంచ నలుమూలల నుంచి భక్తులు భారీ సంఖ్యలో ప్రయాగ్‌ రాజ్‌ కు తరలివస్తున్నారు. త్వరలో లోక్‌ సభ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఈసారి కుంభమేళా మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. ఎనిమిది వారాలు సాగే కుంభమేళాకు దాదాపు 10 లక్షల మంది విదేశీ పర్యాటకులు సహా సుమారు 15 కోట్ల మంది హాజరవుతారని అంచనా. అయితే, ఆదిలోనే స్వ‌ల్ప అప‌శృతి దొర్లింది. భారత ఆధ్యాత్మిక చైతన్యం - సాంస్కృతిక వారసత్వ సమ్మేళనంగా జరిగే కుంభమేళాలో మన ఉన్నత సంప్రదాయాలను ప్రపంచానికి చాటబోతున్నామని కేంద్ర సాంస్కృతికశాఖ మంత్రి మహేశ్ శర్మ తెలిపారు.

విభూతిధారులైన సాధుసన్యాసుల ఆధ్వర్యంలో లక్షలమంది భక్తులు మంగళవారం తెల్లవారుజామున 4 గంటలకు పవిత్ర త్రివేణీ సంగమంలో తొలి పవిత్ర స్నానాలను అచరించడంతో కుంభమేళా మొదలయింది. ఈ వేడుకల ప్రారంభ ఘడియలు సమీపించడంతో సాధువులు భారీగా తమ తాత్కాలిక శిబిరాలకు తరలివస్తున్నారు. పవిత్ర గంగా నది ఒడ్డున ఏర్పాటైన ఈ శిబిరాలు దీపకాంతులతో ధగధగలాడుతున్నాయి. ఇప్పటికే ఎంతోమంది భక్తులు పోటెత్తడంతో కుంభమేళా ప్రాంతంలో వాహనాల రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు. భక్తుల కోసం సంగమం వద్ద తాత్కాలిక వంతెనలు, 600 సామూహిక వంటశాలలను - 10 వేలకుపైగా పోర్టబుల్ టాయిలెట్లను ఏర్పాటు చేశారు. మార్చిలో కుంభమేళా ముగిసేలోపు ప్రధాని నరేంద్రమోదీ, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తదితరులు ఈ మహా ఉత్సవంలో పాల్గొంటారని భావిస్తున్నారు.

కాగా, కుంభమేళా ప్రారంభం కావడానికి ముందే ఆ ప్రదేశంలో ఓ అపశ్రుతి చోటుచేసుకుంది. ఈ మహా సమ్మేళనం జరిగే ప్రదేశంలోని దిగంబర్ అఖారా వద్ద సోమవారం ఓ వంటగ్యాస్ సిలిండర్ పేలడంతో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. దీంతో తక్షణమే నష్టనివారణ చర్యలు చేపట్టాల్సిందిగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అధికారులను ఆదేశించారు. ఆ ప్రాంతంలోని అన్ని గుడారాలను క్షుణ్ణంగా పరిశీలించి తగిన ముందుజాగ్రత్త చర్యలు చేపట్టాలని అగ్నిమాపక విభాగానికి సూచించారు. అయితే ఈ ప్రమాదం వల్ల పెద్ద నష్టమేమీ సంభవించలేదని, ఎవరూ గాయపడలేదని అఖారా పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ భాస్కర్ మిశ్రా వెల్లడించారు. మధ్యాహ్నం దాదాపు 12.45 గంటల సమయంలో ఈ ప్రమాదం సంభవించి అక్కడి తాత్కాలిక నిర్మాణాలకు మంటలు వ్యాపించడంతో అక్కడ ఉంచిన రెండు వాహనాలు, మరికొంత సామగ్రి దగ్ధమైనట్టు అధికారులు తెలిపారు. ఈ సమాచారం తెలిసిన వెంటనే ఆరు అగ్నిమాపక శకటాలు, ఎనిమిది అంబులెన్సులు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. కుంభమేళా పాలనాయంత్రాంగంతోపాటు ఎన్డీఆర్‌ఎఫ్ (నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్), ఎస్డీఆర్‌ఎఫ్ (స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్) సాయంతో అగ్నిమాపక సిబ్బంది కేవలం 10 నిమిషాల వ్యవధిలోనే మంటలను అదుపు చేశారని పోలీసులు వివరించారు. తొలుత పక్కనే ఉన్న ఓ గుడారంలో మంటలు చెలరేగాయని, ఆ తర్వాత అవి తమ శిబిరంలోని వంటశాలకు వ్యాపించాయని దిగంబర్ అఖారా అధిపతి తెలిపారు.

మ‌రోవైపు...ఈ ఏడాది కుంభమేళాలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా చూసేందుకు శ్రమిస్తున్న ఉత్తరప్రదేశ్ పోలీసులు.. సంప్రదాయ, ఆధునిక పోలీసింగ్ పద్ధతులను మేళవించి పటిష్ఠమైన భద్రతా చర్యలు చేపడుతున్నారు. ఈ కుంభమేళాలో అత్యాధునిక భద్రతా పద్ధతులను అవలంబిస్తున్నామని, నిరంతర పర్యవేక్షణకు 1,200 సీసీటీవీ కెమేరాలతో సమగ్ర కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను ఏర్పాటు చేశామని రాష్ట్ర డీజీపీ ఓపీ సింగ్ సోమవారం తెలిపారు. జన సమూహాల నియంత్రణకు రియల్‌ టైమ్ వీడియో ఎనలిటిక్స్ - రియల్ డిటెక్షన్ - అలర్ట్ ఆల్గారిథమ్ పద్ధతుల అమలుతోపాటు ఉగ్రవాదులు - నేరగాళ్లు - అనుమానాస్పద శక్తులపై నిఘాకు త్రినేత్ర యాప్‌ను ఉపయోగిస్తున్నామన్నారు. కుంభమేళా పూర్తయ్యే వరకు సోషల్ మీడియా వెబ్‌ సైట్లను నిరంతరం పర్యవేక్షిస్తామని, ఏదైనా సమస్య ఉత్పన్నమైతే వాటిని నిలిపివేస్తామన్నారు. కుంభమేళా కోసం ప్రయాగ్‌రాజ్, ఆ పొరుగు జిల్లాల్లో మూడంచెల భద్రతను ఏర్పాటు చేశామని, ఈ ప్రాంతాన్ని 9 జోన్లు, 20 సెక్టార్లుగా విభజించి 20 వేలమందికిపైగా పోలీసులు, ఆరువేల మంది హోంగార్డులను, 80 కంపెనీల కేంద్ర బలగాలను, మరో 20 కంపెనీల పీఏసీ బలగాలను మోహరించామన్నారు.