Begin typing your search above and press return to search.

లేటెస్ట్‌: గుజ‌రాత్‌ లో ఏం జ‌రుగుతుందో తెలుసా?

By:  Tupaki Desk   |   26 Aug 2015 9:22 AM GMT
లేటెస్ట్‌: గుజ‌రాత్‌ లో ఏం జ‌రుగుతుందో తెలుసా?
X
గుజ‌రాత్‌లో ఏం జ‌రుగుతుంది? అన్న‌ది ఇప్పుడు పెద్ద అంశంగా మారింది. ఎందుకంటే.. ప‌టేల్‌ వ‌ర్గానికి చెందిన వారిని ఓబీసీ కేట‌గిరిలోకి చేర్చాల‌న్న డిమాండ్ ఇప్పుడు ఆ రాష్ట్రాన్ని అట్టుడికిపోయేలా చేస్తోంది. ప‌టేల్ వ‌ర్గానికి చెందిన వారిని ఓబీసీ కేట‌గిరిలోకి చేర్చాల‌న్న డిమాండ్ గ‌తంలో ఉన్న‌ప్ప‌టికీ.. ఒక డిగ్రీ కుర్రాడు చేప‌ట్టిన ఉద్య‌మం ఇప్పుడు గుజ‌రాత్‌ లో క‌ర్ఫ్యూ పెట్టే స్థాయికి వెళ్లిపోయింది.

అంతేకాదు.. ఇంట‌ర్నెట్ వినియోగం మీదా ఆంక్ష‌లు పెట్టే దుస్థితి గుజ‌రాత్ లో నెల‌కొంది. కేంద్రం హుటాహుటిన 5000 మంది పారా మిల‌ట‌రీ ద‌ళాల్ని గుజ‌రాత్ కు పంపిందంటే అక్క‌డి శాంతిభ‌ద్ర‌త‌ల స‌మ‌స్య ఎంత తీవ్రంగా ఉందో ఇట్టే అర్థం చేసుకోవ‌చ్చు. ప‌టేల్ వ‌ర్గాన్ని ఓబీసీ రిజ‌ర్వేష‌న్ ఇవ్వాల‌ని డిమాండ్ చేయ‌టం.. అందుకు ప్ర‌భుత్వం నిరాక‌రించ‌టం.. మ‌రోవైపు.. ఓబీసీ ప్ర‌యోజ‌నాన్ని పొందుతున్న వ‌ర్గాలు ప‌టేల్ వ‌ర్గం చేస్తున్న పోరాటాన్ని తీవ్రంగా వ్య‌తిరేకించ‌టం లాంటి ప‌రిణామాలతోపాటు.. మంగ‌ళ‌వారం హార్దిక్ ప‌టేల్ ఇచ్చిన ర్యాలీ పిలుపు గుజ‌రాత్ లో శాంతిభ‌ద్ర‌త‌ల స‌మ‌స్య త‌లెత్తే ప‌రిస్థితి తీసుకొచ్చింది.

త‌న ఆవేశ‌పూరిత మాట‌ల‌తో ప‌టేల్ వ‌ర్గాన్ని విప‌రీతంగా క‌దిలిస్తున్న హార్దిక్ ప‌టేల్ ఇచ్చిన పిలుపున‌కు ల‌క్ష‌లాది మంది ప‌టేల్ వ‌ర్గీయులు అహ్మ‌దాబాద్‌ కు పోటెత్త‌టం.. ప‌రిస్థితి ఉద్రిక్తంగా మార‌టం.. ఇదే స‌మ‌యంలో పోలీసులు చేసిన లాఠీ ఛార్జ్ తో ప‌రిస్థితి పూర్తిగా చేయి దాటిపోయింది. ఇక‌.. ర్యాలీ నిర్వ‌హిస్తున్న హ‌ర్థిక్ ప‌టేల్ అనుమ‌తులు తీసుకోలేదంటూ పోలీసులు అత‌న్ని అరెస్ట్ చేయ‌టం.. ఆ వెంట‌నే చోటు చేసుకున్న నిర‌స‌న‌ల‌తో అత‌న్ని గంట వ్య‌వ‌ధిలోనే విడిచిపెట్టారు. ప్ర‌స్తుతం హార్దిక్ ప‌టేల్ ఎక్క‌డ ఉన్న‌ది తెలీన‌ప్ప‌టికీ.. అహ్మాదాబాద్‌ తో స‌హా గుజ‌రాత్ లోని పలు ప్రాంతాల్లో క‌ర్ఫ్యూ విధించారు. అద‌న‌పు బ‌ల‌గాలు గుజ‌రాత్ కు కేంద్రం పంపింది.

ఇక‌.. అహ్మాదాబాద్‌ తో స‌హా.. గుజ‌రాత్ లోని చాలా ప్రాంతాల్లో మొబైల్ ఇంట‌ర్నెట్ మీద ఆంక్ష‌లు విధించారు. ఆఫీసులు.. ఇళ్ల‌ల్లోని నెట్ క‌నెక్ష‌న్లు మాత్ర‌మే ప‌ని చేసేలా జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు. పోలీసుల లాఠీ చార్జ్ కు నిర‌స‌న‌గా బుధ‌వారం గుజ‌రాత్ బంద్‌ కు హార్దిక్ ప‌టేల్ పిలుపునిచ్చారు. బంద్ ప్ర‌శాంతంగా జ‌రగాల‌ని ఆయ‌న ఆకాంక్షించారు. మొత్తంగా చూస్తే గ‌త కొన్నేళ్లుగా అభివృద్ధికి రోల్ మోడ‌ల్ గా చెప్పుకునే గుజరాత్ ఇప్పుడు.. ఆందోళ‌న‌లు.. నిర‌స‌న‌లు.. ఉద్రిక్త‌త‌ల‌తో ఉడికిపోతోంది.