సంచలనాలకే సంచలనం.. సెమీ ఫైనల్ రిజల్ట్

Thu Jul 12 2018 11:32:33 GMT+0530 (IST)

ఏదైనా అంతర్జాతీయ టోర్నీలో సంచలనాలు మామూలే. అయితే.. అందుకు భిన్నంగా సంచలనాల మీద సంచలనాలతో ఉక్కిరిబిక్కిరి చేసేలా రికార్డు సంచలనాల్ని నమోదు చేసిన ఘనత 2018 ఫిపా ఫుట్ బాల్ వరల్డ్ కప్ టోర్నీదేనని చెప్పాలి. ఆరంభం నుంచి ఏదో ఒక సంచలనం నమోదవుతన్న ఈ టోర్నీలో.. మహా.. మహా జట్టులన్నీ మొదటే ఇంటిదారి పట్టాయి.తాజాగా జరిగిన రెండో సెమీఫైనల్ లోనూ అలాంటి ఫలితమే నమోదైంది. ఫుట్ బాల్ గేమ్ తెలిసిన వారు ఎవరైనా.. బరిలో ఇంగ్లండ్.. క్రోయేషియా జట్లు తలపడుతున్నాయంటే తుది పలితం ఇంగ్లండ్ కు అనుకూలంగా రావటమని భావిస్తారు. అయితే.. కలలో కూడా ఊహించని విధంగా ఇంగ్లండ్ జట్టుకు షాకిస్తూ.. ఆ మాటకు వస్తే ఈ టోర్నీలోనే అతి పెద్ద సంచలనాన్ని నమోదు చేసింది క్రోయేషియా జట్టు. టుజ్నికీ స్టేడియంలో గురువారం అర్థరాత్రి తర్వాత వెల్లడైన ఈ ఆట ఫలితం క్రోయేషియాకు అనుకూలంగా ఉంది.

రసవత్తరంగా సాగిన పోరులో ఇంగ్లండ్ పై 2-1 తేడాతో క్రోయేషియా విజయం సాధించి ప్రపంచకప్ లో తొలిసారి ఫైనల్‌కు చేరుకుంది. మరో సెమీఫైనల్ విజయం సాధించిన ఫ్రాన్స్ జట్టు ఆదివారం జరిగే తుది పోరులో ప్రపంచ కప్ తాజా విజేత ఏ జట్టు అన్నది తేలనుంది. 1966 తర్వాత ఫైనల్‌కు చేరాలన్న ఇంగ్లండ్ జట్టు కలను క్రోయేషియా భగ్నం చేసింది.  తొలుత మ్యాచ్ ప్రారంభమైన ఐదు నిమిషాలకు ఇంగ్లండ్ ఆటగాడు కీరన్ గోల్ కొట్టి తమ జట్టును అధిక్యంలో ఉంచారు.

ప్రథమార్థంలో ఒక్క గోలే నమోదైనప్పటికీ.. ద్వితీయార్థంలో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. క్రొయేషియా ఆటగాడు ఇవాన్ పెరిసిక్ 68వ నిమిషంలో గోల్ కొట్టి స్కోర్ ను సమం చేశారు. మ్యాచ్ టై కావటంతో అదనపు సమయంలో మారియో 109వ నిమిషంలో గోల్ కొట్టి  క్రోయేషియాకు సంచలన విజయం దక్కేలా చేశారు. ఈ గెలుపుతో ఫిపా ప్రపంచక ప్ ఫుట్ బాల్ టోర్నీలో భారీ సంచలనం నమోదైంది. మరి.. ఫైనల్ ఎలాంటి ఫలితంతో ముగుస్తుందో తేలాలంటే ఆదివారం వరకూ ఆగాల్సిందే.