నేరస్థులు పరిపాలించకూడదు: కమల్ హాసన్

Mon Nov 20 2017 15:39:51 GMT+0530 (IST)

శశికళ సన్నిహితులు - కుటుంబ సభ్యులకు సంబంధించిన ప్రాంతాల్లో ఆదాయపన్నుశాఖ దాడులు జరిపిన సంగతి తెలిసిందే. మన్నార్ గుడి మాఫియా సుమారు 1430 కోట్ల విలువ గల అక్రమాస్తులు పోగేసుకున్నట్లు వార్తలు వచ్చాయి. దాదాపు 200 ప్రాంతంలో ఐటీ దాడులు నిర్వహించడం దేశంలో ఇదే తొలిసారి కావడం గమనార్హం. శుక్రవారం జయలలిత పోయెస్ గార్డెన్ లో ఐటీ వర్గాలు దాడులు నిర్వహించాయి. ఆమె సెక్రటరీ ఆఫీసు నుంచి ఒక ల్యాప్ ట్యాప్ - కంప్యూటర్ - 6 పెన్ డ్రైవ్ లు స్వాధీనం చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో త్వరలో ప్రత్యక్ష రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలని భావిస్తోన్న విశ్వనటుడు కమల్ హాసన్ ....ఏఐడీఎంకే ప్రభుత్వంపై నర్మగర్భ వ్యాఖ్యలతో ఓ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఆ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది.శశికళ అండ్ కోపై ఐటీ దాడుల నేపథ్యంలో సర్కార్ పై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. నేరస్థులు పరిపాలించకూడదంటూ ప్రభుత్వ తీరును పరోక్షంగా ఎండగడుతూ కమల్ ట్వీట్ చేశారు. కమల్ హాసన్ ప్రభుత్వంపై పరోక్షంగా విరుచుకుపడ్డారు. ‘ప్రభుత్వమే దోచుకోవడం నేరం. ఆ నేరాన్ని గుర్తించిన తరువాత దాన్ని నిరూపించకపోవడం కూడా నేరమే. ఇప్పుడు ఆ విషయమై గంట కొట్టేశారు. నేరస్థులు పరిపాలించకూడదు. ప్రజలంతా సమైక్యంగా న్యాయనిర్ణేతలు అయ్యే తరుణం ఆసన్నమైంది.  ప్రజలు మేలుకొని స్పందించాల్సిన సమయం వచ్చింది.’ అని ట్వీట్ చేశారు. అయితే ఈ ట్వీట్ ఎవర్ని ఉద్దేశించి చేసిందో కమల్ స్పష్టం చేయలేదు. మరో రెండు మూడు రోజులలో పోయెస్ గార్డెన్ లో మరోసారి ఐటీ దాడులు జరిపేందుకు అధికారులు సిద్ధమవుతున్నారని సమాచారం. ఈ నేపథ్యంలో కమల్ వ్యాఖ్యలు ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి.