Begin typing your search above and press return to search.

ఆవును చంపింది మ‌నుషులు కాదంట‌

By:  Tupaki Desk   |   27 July 2016 4:21 PM GMT
ఆవును చంపింది మ‌నుషులు కాదంట‌
X
ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీ సొంత రాష్ట్రం గుజ‌రాత్‌ లో ఇటీవ‌ల జ‌రిగిన ద‌ళితులు వ‌ర్సెస్ అగ్ర‌వ‌ర్ణాల ఆందోళ‌న‌లో ఊహించ‌ని విష‌యం తెర‌మీద‌కు వ‌చ్చింది. గుజ‌రాత్‌ లోని వూనాలో ఆవును దళితులు చంపేశార‌ని పేర్కొంటూ వారిపై దాడులు జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. ఈ దాడులు దేశవ్యాప్తంగా క‌ల‌క‌లం సృష్టించాయి. ప్ర‌స్తుతం పార్లమెంటు స‌మావేశాలు జ‌రుగుతున్న నేప‌థ్యంలో మ‌రింత క‌ల‌కం రేగింది. అయితే ఇందులో ఆవును ద‌ళితులు చంప‌లేద‌ని ద‌ర్యాప్తులో తేలింది.

గుజరాత్ లోని వూనా ఘటనలో కొత్త విషయాలు వెలుగుచూశాయని సీఐడీ అధికారులు చెప్పారు. ఆవును సింహాలు చంపేశాయని త‌మ‌కు ప్ర‌త్య‌క్ష సాక్షి తెలిపార‌ని వివ‌రించారు. సింహాల చేతిలో చనిపోయిన‌ గోవు చర్మాన్ని మాత్రమే దళితులు తీసుకొచ్చుకున్నారని ప్ర‌క‌టించారు. సీఐడీ ప్రధాన అధికారి ఎస్ఎస్ త్రివేది ఈ వివ‌రాల‌ను మీడియాకు వెల్ల‌డించారు. కేసును తాము క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తున్న స‌మ‌యంలో జూలై 10 - 11 తేదీల్లో ఈ ఘ‌ట‌న జ‌రిగిన‌ట్లు తేలింద‌న్నారు. ప‌లుచోట్ల నాలుగు ఆవులపై సింహాలు దాడులు చేసి చంపేశాయని ప్ర‌త‌క్ష్య సాక్షులు వివ‌రించిన‌ట్లు త్రివేది చెప్పారు. వీటిల్లో ఒక చోట చచ్చిపోయిన‌ ఆవు వద్దకు వెళ్లిన దళితులు దాని క‌ళేభ‌రాన్ని తీసుకొచ్చుకున్నారే త‌ప్ప వారే స్వయంగా ఆ గోవును చంపలేదని ప్ర‌త్య‌క్ష సాక్షులు వివ‌రించ‌ట్లు తెలియ‌జేశారు. ఈ రిపోర్టు నేప‌థ్యంలో ప్ర‌తిప‌క్ష పార్టీలు బీజేపీపై విమ‌ర్శ‌లు చేశాయి. ద‌ళితుల ల‌క్ష్యంగా దాడులు జ‌ర‌గ‌డం శోచ‌నీయ‌మ‌ని మండిప‌డ్డాయి.