Begin typing your search above and press return to search.

అదే జరిగితే పదేళ్లలో కాశ్మీర్ చేజారుతుందట

By:  Tupaki Desk   |   2 Dec 2015 4:58 AM GMT
అదే జరిగితే పదేళ్లలో కాశ్మీర్ చేజారుతుందట
X
సుదీర్ఘకాలంగా సాగిన కాంగ్రెస్ పార్టీ సారథ్యం పుణ్యమా అని దేశంలో కొన్ని సమస్యలు అలానే సాగుతున్నాయి. అలాంటి సమస్యల్లో కాశ్మీర్ అంశం ఒకటి. దీని పరిష్కారం కోసం కాంగ్రెస్ పెద్దగా ప్రయత్నించలేదని.. మోడీ లాంటి నేత ప్రధానమంత్రి అయితే.. కాశ్మీర్ సమస్యను ఇట్టే పరిష్కరిస్తారన్న అభిప్రాయం వ్యక్తమయ్యేది. జనాల కోరికకు తగ్గట్లే మోడీ ప్రధాని అయ్యారు.

ఆయన అధికారం చేపట్టి దాదాపు 19 నెలలు గుడుస్తున్నాయి. మిగిలిన అంశాల సంగతి కాసేపు పక్కన పెడితే.. కాశ్మీర్ అంశంలో మాత్రం ఎలాంటి మార్పు లేదు. రోజురోజుకీ పరిస్థితి మరింత ముదురుతుందే తప్పించి.. పరిష్కారం దిశగా అడుగులు పడని దుస్థితి. ఇలాంటి పరిస్థితే మరో పదేళ్లు సాగితే.. కాశ్మీర్ ను వదులుకోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు ప్రముఖ మేధావి రాధాకుమార్.

కాశ్మీర్ ఇష్యూ మీద గతంలో ప్రభుత్వం తరఫున ప్రతినిధిగా వ్యవహరించిన ట్రాక్ రికార్డు ఉంది. అలాంటి ఆయన ఒక మీడియా సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో తాజాగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాశ్మీర్ పరిస్థితిలో గతానికి.. ప్రస్తుతానికి మధ్య ఎలాంటి వ్యత్యాసం లేదని తేల్చేశారు. నిజానికి మోడీ అధికారంలోకి వచ్చాక కాశ్మీర్ లో పరిస్థితి క్షీణ దశకు చేరుకుందని.. ఇప్పుడున్న పరిస్థితి మరో 10 ఏళ్లు సాగితే.. కాశ్మీర్ ను వదులుకోవాల్సి వస్తుందన్న విషయం మర్చిపోకూడదని హెచ్చరిస్తున్నారు. మరి.. కాశ్మీర్ ఇష్యూను మోడీ ఎలా టేకప్ చేస్తారో చూడాలి.