Begin typing your search above and press return to search.

మ‌న బ్యాంకుపై సైబ‌ర్ దాడి..రూ.94 కోట్లు స్వాహా

By:  Tupaki Desk   |   15 Aug 2018 6:39 AM GMT
మ‌న బ్యాంకుపై సైబ‌ర్ దాడి..రూ.94 కోట్లు స్వాహా
X
సైబ‌ర్ అటాక‌ర్లు మ‌రోమారు పంజా విసిరారు. మహారాష్ట్ర పుణె నగరంలోని అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకుల్లో ఒకటైన కాస్మోస్ సహకార బ్యాంకు సర్వర్‌ను సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేశారు. ఈ నెల 11వ తేదీ నుంచి 13వ తేదీ మధ్య మొత్తం రూ.94 కోట్లను చోరీచేసి.. బ్యాంకును కోలుకోలేని దెబ్బతీశారు.మోసం జరిగినట్టు సోమవారం రాత్రి గుర్తించిన కాస్మోస్ బ్యాంకు అధికారులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఏకంగా బ్యాంక్ సర్వర్‌ ను హ్యాకింగ్ చేసి రూ.94 కోట్లు తస్కరించిన ఘటన సంచలనం సృష్టిస్తోంది.

బ్యాంక్ అధికారులు పోలీసుల‌కు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం.. ఈ నెల 11న గుర్తుతెలియని హ్యాకర్లు ఏటీఎం సర్వర్‌ పై మాల్‌ వేర్ ద్వారా దాడిచేసి బ్యాంకుకు సంబంధించిన వీసా - రుపే కార్డు వినియోగదారుల సమాచారాన్ని తస్కరించారు. అదేరోజు 14,849 లావాదేవీల ద్వారా మొత్తం రూ.80 కోట్లను చోరీచేశారు. ఇందులో దేశం బయట నుంచి జరిపిన లావాదేవీలు 12 వేలు కాగా.. దేశం లోపలి నుంచి జరిపిన లావాదేవీలు 2,849. దేశం బయటి నుంచి నిర్వహించిన లావాదేవీల ద్వారా రూ.78 కోట్లు - దేశం లోపలి నుంచి చేసిన లావాదేవీల ద్వారా రూ.2 కోట్లను దుండగులు తస్కరించారు. అనంతరం ఈ నెల 13న బ్యాంకు స్విఫ్ట్ ట్రాన్సాక్షన్ సిస్టమ్ (వేగంతమైన చెల్లింపుల వ్యవస్థ)ను ఉపయోగించి రూ.13.94 కోట్లను హాంకాంగ్ కేంద్రంగా పనిచేసే ఓ బ్యాంకు ఖాతాకు మళ్లించారు. ఈ రెండు రోజుల్లో కాస్మోస్ బ్యాంకు మొత్తం రూ. 94 కోట్లను కోల్పోయింది. ఇదిలాఉండ‌గా...హ్యాకర్లు బ్యాంకుకు చెందిన వివిధ ఖాతాదారుల వీసా - రుపే కార్డులను క్లోనింగ్ చేసి ఈ చోరీకి పాల్పడినట్టు సమాచారం.

ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ చట్టం కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఘటనపై దర్యాప్తు చేపట్టారు. ప్రాథమిక దర్యాప్తు ప్రకారం.. ఈ మొత్తం చోరీ వ్యవహారం కెనడా నుంచి జరిగినట్టు అధికారులు భావిస్తున్నారు. ``సైబర్ నేరగాళ్ల దుశ్చర్యపై మేం పోలీసులకు ఫిర్యాదు చేశాం. దీంతోపాటు భారత జాతీయ చెల్లింపుల సహకార బ్యాంకు (ఎన్‌ పీసీఐ) - రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియాకు కూడా సమాచారం అందించాం`` అని కాస్మోస్ బ్యాంకు డైరెక్టర్ కృష్ణకుమార్ గోయల్ వెల్లడించారు. కాగా, ఈ ప‌రిణామం దేశీయ బ్యాంకుల సెక్యురిటీకి సంబంధించిన డొల్ల‌త‌నాన్ని బ‌య‌ట‌పెడుతోంద‌ని చ‌ర్చ జ‌రుగుతోంది.కాగా ఈ ఘటన ద్వారా ఏ ఒక్క వినియోగదారునిపై భారం పడబోదని - సైబర్ నేరగాళ్లు సొమ్మును పూల్ ఎకౌంట్ (ఉమ్మడి ఖాతా) నుంచి తస్కరించినందున బ్యాంకుకే నష్టం జరిగిందని ఆయన తెలిపారు. హ్యాకర్లు ఎన్‌ పీసీఐ వ్యవస్థకు సమాంతర వ్యవస్థను సృష్టించి.. సదరు లావాదేవీలను సెల్ఫ్ అప్రూవ్డ్ చేశారని చెప్పారు. చోరీ నేపథ్యంలో బ్యాంకు సర్వర్లను షట్‌ డౌన్ చేశామని, ఇంటర్నెట్ బ్యాంకింగ్ కార్యకలాపాలను స్తంభింపజేశామని గోయల్ వెల్లడించారు. వాస్తవానికి నగదు చోరీకి గురైన ఎక్కువశాతం వినియోగదారుల ఖాతాల్లో కనీస నగదు నిల్వలు కూడా లేవని పేర్కొన్నారు.