నో.. ప్రణయ్ విగ్రహాన్ని ఎలా పెడతారు?

Mon Sep 24 2018 10:52:58 GMT+0530 (IST)

సంచలనం సృష్టించిన మిర్యాలగూడ హత్య ఉదంతానికి సంబంధించి తాజాగా మరో వివాదం తెర మీదకు వచ్చింది. హత్యకు గురైన ప్రణయ్ విగ్రహాన్ని పట్టణంలోని సాగర్ రోడ్డుపై శకుంతల థియేటర్ ఎదురుగా ఏర్పాటు చేయాలని నిర్ణయించటం తెలిసిందే.విగ్రహం కోసం రోడ్డు మధ్యన ఉన్న ట్రాఫిక్ ఔట్ పోస్ట్ ను తొలగించి మరీ.. విగ్రహాన్ని ఏర్పాటు చేయాలన్న నిర్ణయాన్ని తీసుకున్నారు. తన కుమార్తె (అమృత)ను ప్రేమ వివాహం  చేసుకున్నాడన్న కోపంతో.. అమృత తండ్రి దారుణ హత్యకు ప్లాన్ చేసి చంపేయటం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇటీవల ప్రణయ్ సతీమణి అమృతను అమలాపురం మాజీ ఎంపీ హర్షకుమార్ పరామర్శించారు. అంతేకాదు.. పట్టణంలో ప్రణయ్ కాంస్య విగ్రహాన్ని తయారు ఏయించేందుకు ముందుకు వచ్చారు.

ఈ నేపథ్యంలో.. విగ్రహాన్ని ఏర్పాటు చేయటానికి ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్న వేళ.. పట్టణానికి చెందిన పలువురు పుర ప్రముఖులు.. స్వచ్చంద సంస్థల ప్రతినిధులు విగ్రహ ఏర్పాటును అడ్డుకున్నారు. గడిచిన మూడు రోజులుగా విగ్రహాన్ని ఏర్పాటు చేయటానికి అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

నగరం నడిబొడ్డున విగ్రహాన్ని ఏర్పాటు చేయటానికి అనుమతలు ఇవ్వొద్దంటూ అధికారుల్ని పలు ఎన్జీవోలు ప్రయత్నిస్తున్నాయి. సాగర్ రోడ్డులో పలువురు జాతీయ నేతల విగ్రహాలు ఉన్నాయని.. అలాంటి వాటి మధ్యలో ప్రణయ్ విగ్రహాన్ని ఏర్పాటు చేయటం ఎంత మాత్రం సరికాదంటున్నారు.

ఈ నేపథ్యంలో అధికారులు.. దళిత.. గిరిజన సంఘాల ప్రతినిధుల సమక్షంలో ఆర్డీవో సమక్షంలో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. జీవో నెంబరు 55 ప్రకారం పలువురు అధికారుల అనుమతితోనే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.