Begin typing your search above and press return to search.

మోడీ.. ఆనంది.. కాలేజ్ మేట్సు

By:  Tupaki Desk   |   1 May 2016 6:42 AM GMT
మోడీ.. ఆనంది.. కాలేజ్ మేట్సు
X
ప్రధాన నరేంద్ర మోడీ గురించి గుజరాత్ పత్రిక ఒకటి ఆసక్తికరమైన అంశాన్ని బయటపెట్టింది. మోడీ ప్రధాని పదవిని చేపట్టిన తరువాత తన స్థానంలో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఆనంది బెన్ పటేల్ నియమితులైన సంగతి తెలిసిందే. మోడీ గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు ఆయన కేబినెట్ లో మంత్రిగా పనిచేసిన ఆనందిని గుజరాత్ సీఎం చేయడంలో మోడీ సిఫార్సులే ఎక్కువగా పనిచేశాయని ఎవరిని అడిగినా చెబుతారు. అయితే... ఆనందిబెన్ కేవలం మోడీ మంత్రివర్గంలో మంత్రి మాత్రమే కాదట... మోడీ - ఆమె ఒకే కాలేజిలో, ఒకే సమయంలో చదువుకున్నారని అహ్మదాబాద్ మిర్రర్ పత్రిక ప్రచురించింది. మోడీ విద్యార్హతల వివరాల కోసం ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సమాచార హక్కు చట్టం ప్రకారం దరఖాస్తు చేసిన తరుణంలో అహ్మదాబాద్ మిర్రర్ కథనం ఆసక్తికలిగిస్తోంది.

ప్రధాని నరేంద్ర మోదీ ఎంతవరకూ చదువుకున్నారు? ఆయన విద్యార్హతలేంటి? ఈ ప్రశ్నలకు సమాధానాన్ని దేశ ప్రజలకు చెప్పేందుకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సహ చట్టాన్ని వినియోగించుకుంటూ దరఖాస్తు చేసిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో 'అహ్మదాబాద్ మిర్రర్' పత్రిక మోదీ విద్యార్హతలను వెల్లడించింది. ఆయన విస్ నగర్ లోని ఎంఎన్ సైన్సు కాలేజీలో ఎంఏ పాలిటిక్సు చదివి ఫస్టు క్లాసులో పాసయ్యారని తెలిపింది. 1983లో 62.3 శాతం మార్కులతో మోడీ పట్టాను పొందారని వివరించింది. ఎంఎన్ కాలేజిలో మోడీ చదువుకుంటున్న సమయంలోనే ఆనందీ బెన్ పటేల్ అదే కాలేజిలో ఇనార్గానిక్ కెమిస్ట్రీలో ఎంఎస్సీ చదివారని ప్రచురించింది. అంతేకాదు... ఇద్దరూ వేర్వేరు విభాగాల్లో పీజీ చేసి.. వేర్వేరు తరగతుల్లో ఉన్నా కాకతాళీయంగా ఇద్దరి రోల్ నంబర్ ఒక్కటేనని.. వీరి రోల్ నెంబర్ 71 అని పేర్కొంది.

కాగా ఢిల్లీ - గుజరాత్ యూనివర్సిటీల నుంచి మోడీ విద్యాభ్యాస వివరాలు కోరిన కేజ్రీవాల్ కు మాత్రం ఇంకా ఆ వివరాలు అందలేదు. కేజ్రీవాల్ కోరిన వివరాలు ఆయనకకు అందించాలంటూ ఆ రెండు యూనివర్సిటీలకు కేంద్ర సమాచార కమిషనర్ మాడభూషి శ్రీధర్ ఆదేశాలిచ్చారు. అయితే... తమ వద్ద వివరాలు వెతకడం కష్టమని ఆ వర్సిటీలు చెప్పడం మోడీకి సంబంధించిన విద్యార్హతల వివరాలు ఆ రెండు వర్సిటీలకు ఇవ్వాలని మాఢభూషి ప్రధాని మంత్రి కార్యాలయానికి సూచించారు. సమాచార చట్టం ప్రకారం వివరాలు పొందడానికి కేజ్రీవాల్ కుస్తీలు పడుతున్న తరుణంలో మోడీకి సంబంధించిన ఆసక్తికర సమాచారాన్ని గుజరాత్ పత్రిక బయటపెట్టడం చర్చనీయాంశమైంది.