Begin typing your search above and press return to search.

మ‌ళ్లీ ఆ మ‌హిళా నేత మోడీని కించ‌ప‌ర్చింది!

By:  Tupaki Desk   |   2 Nov 2018 5:05 AM GMT
మ‌ళ్లీ ఆ మ‌హిళా నేత మోడీని కించ‌ప‌ర్చింది!
X
కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడు రాహుల్‌ గాంధీ స‌న్నిహితురాలిగా పేరొందిన సోషల్ మీడియా విభాగం అధినేత్రి రమ్య(దివ్య స్పందన) తీరు మ‌రోమారు వివాదాస్ప‌దం అవుతోంది. ప్రధాని నరేంద్రమోదీని ఉద్దేశించి కాంగ్రెస్ సోషల్‌ మీడియా ఇన్‌ చార్జి దివ్య స్పందన చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. పిట్ట రెట్టలా ఉంది అని ప్రధానిపై దివ్య చేసిన కామెంట్లపై కమలనాథులు మండిపడుతున్నారు. 182 మీటర్ల పొడవైన భారీ సర్దార్ పటేల్ విగ్రహాన్ని బుధవారం ప్రధాని మోడీ ఆవిష్కరించాక దాని చుట్టూ కలియ తిరిగారు. ఈ సందర్భంగా పటేల్ విగ్రహం పాదాల చెంతన ప్రధాని గల ఫొటోను సోషల్ మీడియాల్లో దివ్య పోస్ట్ చేశారు. ఇది పిట్టరెట్టలా ఉందంటూ కామెంట్లు పెట్టారు.

కాగా, కాంగ్రెస్‌ పార్టీ సోషల్‌ మీడియా చీఫ్ దివ్య స్పందన అలియస్ రమ్య తీరుపై బీజేపీ భగ్గుమంది. దివ్య స్పందన భాష అహంకారపూరితమని విమర్శించింది. బీజేపీ అధికారప్రతినిధి సంబిత్ పాత్ర మాట్లాడుతూ.. ప్రధానిని విమర్శించేందుకు ఏ ఒక్క అవకాశాన్ని కూడా కాంగ్రెస్ వదులుకోవడం లేదు. దివ్య వాడిన భాష కాంగ్రెస్ నిజ సంస్కృతిని తేటతెల్లం చేస్తున్నది అంటూ ధ్వజమెత్తారు. సామాన్య భారతీయులు కాంగ్రెస్‌ కు పిట్ట రెట్టల్లాగే కనిపిస్తున్నారని ఎద్దేవా చేశారు. తన వ్యాఖ్యల్ని దివ్య సమర్థించుకున్నారు. నా వ్యాఖ్యలపై ఎవరికీ సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం లేదు అని అన్నారు.

కొద్దికాలం క్రితం సైతం ఇదే త‌ర‌హాలో ర‌మ్య స్పందించారు. రాఫెల్ డీల్ విషయంలో వచ్చిన ఆరోపణలపై ప్రధాని మోడీ స్పందించకపోవడంతో.. మోడీని దొంగగా అభివర్ణిస్తూ రమ్య ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌ పై లక్నోకి చెందిన న్యాయవాది సయ్యద్ రిజ్వాన్ అహ్మద్ కోర్టులో ఫిర్యాదు చేశారు. దేశపరువు దిగజార్చేలా రమ్య ట్వీట్ ఉందని - రమ్య ట్వీట్ దేశ ధిక్కారం కిందకు వస్తుందని లాయర్ పేర్కొన్నారు. కాగా, ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై దివ్య స్పందన వివాదాస్పద ట్వీట్లు చేయడంపై అధ్యక్షుడు రాహుల్ అసంతృప్తిగా ఉన్నట్టు తెలిసింది. ముఖ్యంగా ప్రధానిని ‘దొంగ‘ అనే ట్వీట్ తో యుపి పోలీసులు ఆమెపై రాజద్రోహం కేసు పెట్టారు. అలాగే ప్రధాని మోడీ విద్యార్హతలపై రమ్య ట్వీట్ వివాదాస్పదమైంది. సోషల్ మీడియా చీఫ్ గా ఆమె హద్దులు మీరి దుందుడుకు వ్యాఖ్యలు చేస్తున్నారని పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు.