Begin typing your search above and press return to search.

నాలుగేళ్ల చిన్నారికి అరుదైన శ‌స్త్ర‌చికిత్స‌!

By:  Tupaki Desk   |   21 Nov 2017 9:40 AM GMT
నాలుగేళ్ల చిన్నారికి అరుదైన శ‌స్త్ర‌చికిత్స‌!
X
నాలుగేళ్ల చిన్నారికి ప్రాణాలు తీసే ప్రాణాంత‌క వ్యాధి వ‌చ్చింది. చాలా అరుదుగా ఎదుర‌య్యే ఈ వ్యాధితో ఆ చిన్నారి న‌ర‌క‌యాత‌న అనుభ‌వించాడు. పిల్ల‌ల‌తో స‌ర‌దాగా ఆడుకోవాల్సిన వ‌య‌సులో మృత్యువుతో పోరాడాడు. ప్రాణాలు నిలుపుకునే క్ర‌మంలో ఆ చిన్నారికి ఎదురైన స‌వాళ్లు అన్నిఇన్ని కావు. దేశంలోనే తొలిసారిగా నిర్వ‌హించిన ఆప‌రేష‌న్లో హైద‌రాబాద్ వైద్యులు విజ‌యం సాధించారు.

యాభై శాతం మ్యాచ్ అయిన ర‌క్త మూల క‌ణాల‌తో నిర్వ‌హించిన శ‌స్త్ర‌చికిత్స స‌క్సెస్ కావ‌టం చూసిన‌ప్పుడు ప్ర‌పంచ స్థాయి వైద్యానికి హైద‌రాబాద్ కేరాఫ్ అడ్ర‌స్ గా మారింద‌ని చెప్పాలి. ఇదంతా ఒక ఎత్తు అయితే త‌న ర‌క్త‌మాంసాల్ని క‌రిగించి.. త‌న కొడుకు ప్రాణాల్ని కాపాడుకునేందుకు ఆ పిల్లాడి తండ్రి ప‌డిన త‌ప‌న అంతా ఇంతా కాద‌ని చెప్పాలి. మృత్యువు త‌ప్ప‌ద‌నుకున్న చిన్నారిని.. త‌మ నైపుణ్యంతో పున‌ర్జ‌న్మ‌ను అందించిన హైద‌రాబాద్ వైద్యుల్ని అంద‌రూ అభినందించాల్సింది.

ఇంత‌కీ చిన్నారికి వ‌చ్చిన ఆరోగ్య స‌మ‌స్య ఏమిటి? ప‌్ర‌స్తుతం అత‌ని ప‌రిస్థితి ఎలా ఉంది? చిన్నారికి వైద్యం చేసిన వైద్యులు ఎవ‌రు? ఎలాంటి వైద్యాన్ని అందించారు? ఇందుకు ఆ చిన్నారికి ఎదురైన స‌వాళ్లు ఏమిట‌న్న విష‌యాల్ని చూస్తే..

ఎవ‌రీ చిన్నారి? ఎక్క‌డి వాడు? అత‌నికొచ్చిన క‌ష్టం ఏమిటి?

లక్ష‌ల్లో వ‌చ్చే అరుదైన వ్యాధి ఫ్యాన్కోని ఎనీమియా. ఒంటి మీద ఎర్ర‌టి పొక్కుల‌తో ర‌క్త‌హీన‌త‌తో అంత‌కంత‌కూ కుచించుకుపోయే ఈ వ్యాధి నాలుగేళ్ల చిన్నారి హ‌నీశ్ వ‌ర్మ‌కు వ‌చ్చింది. ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాకు చెందిన విశ్వ‌నాథ రాజు సంగారెడ్డిలోని ఒక ప్రైవేటు కంపెనీలో ఉద్యోగి. రెండేళ్ల క్రితం హ‌నీశ్ ఒంటి మీద ఎర్ర‌టి మ‌చ్చ‌లు రావ‌టంతో చికెన్ ఫాక్స్ వ‌చ్చింద‌ని ట్రీట్ మెంట్ తీసుకున్నారు.

అయితే.. వారి అంచ‌నాలు త‌ప్ప‌న్న విష‌యం ఆల‌స్యంగా గుర్తించారు. రోజులు గ‌డుస్తున్నా త‌గ్గ‌క‌పోగా అంత‌కంత‌కూ ఎక్కువ అవుతోంది. ఆసుప‌త్రులు మారుతున్నారు.. చికిత్స‌లు చేస్తున్నా ఫ‌లితం ఉండ‌ని ప‌రిస్థితి. హైద‌రాబాద్ లోని ఒక ఆసుప‌త్రికి చేర్చే నాటికి హ‌నీశ్ ర‌క్త‌స్థాయి బాగా ప‌డిపోయింది. ఇక్క‌డ చేసిన ప‌రీక్ష‌ల్లో హ‌నీశ్‌కు అప్లాస్టిక్ ఎనీమియా వ‌చ్చిన‌ట్లుగా తేలింది.

ఏందీ వ్యాధి..?

జ‌న్యుప‌రంగా సోకే అత్యంత అరుదైన వ్యాధిగా దీన్ని చెప్పాలి. ఎనీమియా అంటే ఎముక‌లో ఉండే మూలుగులోని ర‌క్త‌క‌ణాలు క్ర‌మంగా చ‌నిపోవ‌టం.. క్ర‌మంగా చ‌నిపోవ‌టం మిన‌హా చికిత్స చేయ‌టం చాలా క‌ష్టం. దేశంలో ఇప్ప‌టివ‌ర‌కూ ఇలాంటివి మూడు కేసులు డీల్ చేశారు. అయితే.. అవ‌న్నీ ప‌దేళ్ల కంటే పెద్ద‌వాళ్ల‌కు చేసిన‌వి. నాలుగేళ్ల చిన్నారికి చికిత్స చేయ‌టం ఇదే తొలిసారి.

చికిత్స ఏంటి? అందుకు ఏం చేయాలి?

హ‌నీశ్‌కు వ‌చ్చిన వ్యాధికి చికిత్స అంటూ ఏమైనా ఉందంటే అది శ‌స్త్ర‌చికిత్సే. ఈ వ్యాధికి మూల‌క‌ణాల‌తోనే చెక్ చెప్పొచ్చు. డేటా బ్యాంకులో ఎవ‌రి మూల‌క‌ణాల‌తోనూ హ‌నీశ్‌కు సూట్ కాలేదు. చివ‌ర‌కు అత‌డి తండ్రి మూల‌క‌ణాల్ని టెస్ట్ చేసిన‌ప్పుడు యాభై శాతం వ‌ర‌కే మ్యాచ్ అయ్యాయి. హ‌నీశ్ బ్ల‌డ్ గ్రూప్ ఏ పాజిటివ్ కాగా.. హ‌నీశ్ తండ్రిది ఓ పాజిటివ్‌. అయిన‌ప్ప‌టికీ త‌మ ప్ర‌య‌త్నాల్ని ఆప‌లేదు వైద్యులు. రోగి ర‌క్త‌క‌ణాలు వంద‌శాతం మ్యాచ్ అయితేనే ఆప‌రేష‌న్ స‌క్సెస్ అయ్యే అవ‌కాశం ఉంది. అయినా త‌మ ప్ర‌య‌త్నాన్ని ఆపలేదు వైద్యులు.

ఆప‌రేష‌న్ ముందు న‌ర‌క‌మే..

కీల‌క‌మైన ఆప‌రేష‌న్‌కు ముందు నాలుగేళ్ల చిన్నారి న‌ర‌కం అంటే ఏమిటో చూశాడు. హ‌నీశ్ లో ఉన్న చెడు మూల‌క‌ణాన్ని చంపేందుకు నాలుగు రోజుల పాటు 400 రెట్లు కీమోథెర‌పీని ఇచ్చారు. ఆ స్థాయిలో కీమోథెర‌పీ ఇవ్వ‌టంతో ఆ చిన్నారి త‌ట్టుకోలేక‌పోయాడు. రెండు రోజుల పాటు రోజుకు 60 నుంచి 70 వ‌ర‌కు విరోచ‌నాలు అయ్యేవి. ర‌క్త‌పు వాంతుల‌తో పేగులు కూడా బ‌య‌ట‌కు వ‌చ్చాయి. శ‌రీర‌మంతా క్షీణించింది. చెడు మూల క‌ణాలు పూర్తిగా చ‌నిపోయాయ‌ని గుర్తించిన వైద్యులు అస‌లు ప‌రీక్షను మొద‌లు పెట్టారు. తండ్రి మూల క‌ణాల‌తో ఆప‌రేష‌న్ నిర్వ‌హించారు.

ఆప‌రేష‌న్ ఎలానంటే..

తండ్రి నుంచి సేక‌రించిన ర‌క్త‌మూల‌క‌ణాల్ని వేరుచేసి.. వివిద ప‌రీక్ష‌ల్ని మూడున్న‌ర గంట‌ల పాటు నిర్వ‌హించారు. అప్ప‌టివ‌ర‌కూ దాన్ని సంర‌క్షించ‌టం వైద్యుల‌కు చాలా కీల‌కం. త‌క్కువ స‌మ‌యం ఉండే ర‌క్త‌పు మూల‌క‌ణాల్ని అర‌గంట‌లో హ‌నీశ్‌కు ఎక్కించారు. శ‌స్త్ర‌చికిత్స త‌ర్వాత హ‌నీశ్ కోలుకోవ‌టానికి ప‌ద‌కొండు రోజులు ప‌డుతుంది. పిల్లాడిపై ప్ర‌త్యేక దృష్టిపెట్టిన వైద్యుల కేరింగ్ తో చిన్నారి కోలుకున్నట్లుగా చికిత్స చేసిన కాంటినెంట‌ల్ ఆసుప‌త్రి వైద్యులు. ఇప్ప‌టివ‌ర‌కూ దేశంలో ఈ త‌ర‌హా శ‌స్త్ర‌చికిత్స‌లు మూడంటే మూడు మాత్ర‌మే జ‌ర‌గ్గా.. నాలుగేళ్ల చిన్నారికి ఈ త‌ర‌హా ట్రీట్ మెంట్ మాత్రం దేశంలోనే తొలిసారి. అందుకు హైద‌రాబాద్ వేదిక కావ‌టం.. ఇక్క‌డి వైద్యులు త‌మ స‌త్తాను చాట‌టం గొప్ప‌గా చెప్ప‌క త‌ప్ప‌దు.