కాంగ్రెస్ రూ.35 అద్దె కూడా చెల్లించలేదా?

Fri Jul 20 2018 15:05:38 GMT+0530 (IST)

భారత దేశంలో 125 ఏళ్ల చరిత్ర గలిగిన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ (ఐఎన్ సీ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర లేదు. ప్రతిసారీ ఎన్నికల సమయంలో పార్టీ కార్యకలాపాలకు - ప్రచారం కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేయడం  ఆ పార్టీకి పరిపాటి. ఇంత ఘన చరిత్ర గలిగిన కాంగ్రెస్ పార్టీ....అద్దె చెల్లించలేక అలహాబాద్ లోని పార్టీ కార్యాలయాన్ని ఖాళీ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అంత పెద్ద పార్టీ....అంతమంది కార్యకర్తలు....అద్దె చెల్లించపోవడం ఒక వింత అయితే....ఆ అద్దె కేవలం 35 రూపాయలు కావడం....మరో విశేషం. అలహాబాద్ లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నిర్వహిస్తోన్న భవన యజమాని.....ఆ పార్టీ అద్దె చెల్లించడం లేదంటూ చేసిన ఆరోపణలు సంచలనం రేపాయి. అంతేకాకుండా ఈ నెల 30లోపు ఆ అద్దె చెల్లించకుంటే....భవనం ఖాళీ చేయాలని చెప్పినట్లు కూడా వార్తలు వస్తున్నాయి.అలహాబాద్ లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నిర్వహిస్తోన్న భవనానికి 8 దశాబ్దాల ఘన చరిత్ర ఉంది. ఆ భవనంలోనే భారత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ తో పాటు కమలా నెహ్రూ - పీడీ టాండన్ వంటి ఎందరో నేతలు అనేక సమావేశాలు నిర్వహించారు. స్వాతంత్ర్యానికి పూర్వం నుంచి ఉన్న ఆ భవనం...కాంగ్రెస్ కు సెంటిమెంట్ గా వస్తోంది. ఆ భవనం అద్దె కూడా కేవలం 35 రూపాయలే. అయితే కొంతకాలంగా ఆ అద్దె చెల్లించడం లేదనిఇపుడు ఆ అద్దె మొత్తం కలిపి 50 వేల రూపాయలైందని భవన యజమాని చెప్పారు. జులై 30లోగా అద్దె చెల్లించాలని లేకుంటే భవనం ఖాళీ చేయాలని కాంగ్రెస్ పెద్దలకు నోటీసులు ఇచ్చారు. ఆ భవన యజమానితో ఉన్న విభేదాల కారణంగా అద్దె చెల్లించడం లేదని కాంగ్రెస్ ప్రతినిధులు చెబుతున్నారు. ఈ విషయాన్ని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి తెలియజేశామని అన్నారు. 250మంది కార్యకర్తలంతా చందాలు వేసుకొని 50 వేలు పోగు చేస్తున్నామని  చెప్పారు. అయితే ఇంత పెద్ద పార్టీ 50 వేల కోసం చందాలేయడం....నెలకు 35 రూపాయల అద్దె చెల్లించలేకపోవడం....వంటి విషయాలు ఆశ్చర్యాన్ని కలిగించకమానవు.