Begin typing your search above and press return to search.

వాజుభాయి వాలా.. మరో వివాదం..

By:  Tupaki Desk   |   17 May 2018 4:42 PM GMT
వాజుభాయి వాలా.. మరో వివాదం..
X
కర్ణాటక గవర్నరు తీరుతో కాంగ్రెస్ పార్టీ రెండు రోజులుగా సుప్రీంకోర్టులో పిటిషన్ల మీద పిటిషన్లు వేస్తోంది. బీజేపీ శాసన సభా పక్ష నేత యడ్యూరప్పను ప్రభుత్వం ఏర్పాటుకి ఆహ్వానించి దేశ వ్యాప్తంగా నిరసన జ్వాలలు ఎగసిపడడానికి కారణమైన కర్ణాటక గవర్నర్‌ వజుభాయ్‌ వాలా తాజాగా మరో వివాదాస్పద నిర్ణయం తీసుకున్నారు. ఆ రాష్ట్ర కొత్త సీఎం యడ్యూరప్ప బలనిరూపణ తంతు ఇంకా పూర్తికాకముందే ఓ ఆంగ్లో ఇండియన్‌ను అసెంబ్లీకి నామినేట్‌ చేశారు. దీంతో బల నిరూపణకు ముందు ఇలా ఎలా నామినేట్ చేస్తారంటూ కాంగ్రెస్, జేడీఎస్ మండిపడుతున్నాయి.

మొన్నటి ఎన్నికలు 222 స్థానాలకు జరగగా మరో రెండు స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. ఇప్పుడు కొత్తగా నామినేట్ చేసిన ఆంగ్లో ఇండియన్‌ తో కలిపి కర్ణాటక అసెంబ్లీలో మొత్తం ఎమ్మెల్యేల సంఖ్య 225కి పెరగనుంది. ఈ విషయంలో గవర్నర్‌ తీరుపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ కాంగ్రెస్‌-జేడీఎస్‌లు సుప్రీంకోర్టును ఆ‍శ్రయించాయి. అసెంబ్లీకి వినీషా నెరో అనే ఆంగ్లో ఇండియన్‌ ను గవర్నర్‌ నామినేట్‌ చేశారని, ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని, బల పరీక్ష పూర్తయ్యేదాకా అది చెల్లకుండా ఆదేశాలివ్వాలని కోరాయి. దీనిపై రేపు విచారణ జరగనుంది.

కాగా యెడ్యూరప్ప బల నిరూపణలో ఉపయోగపడతారనే ఉద్దేశంతోనే ఇలా నామినేట్ చేశారని కాంగ్రెస్, జేడీఎస్‌లు ఆరోపిస్తున్నాయి. ఇంతకుముందు ఏ రాష్ట్రంలోనూ ఇలా ఫ్లోర్ టెస్టుకు ముందు సభ్యులను నామినేట్ చేసిన సందర్భాలు లేవని చెప్తున్నారు. దీనిపై కోర్టు ఎలా స్పందిస్తుందో చూడాలి.