Begin typing your search above and press return to search.

ఆ ఉప ఎన్నిక ఖర్చు మొత్తం పార్టీదేనంట

By:  Tupaki Desk   |   4 Aug 2015 4:43 AM GMT
ఆ ఉప ఎన్నిక ఖర్చు మొత్తం పార్టీదేనంట
X
తెలంగాణలో మరో ఉప ఎన్నికకు సంబంధించిన వేడి మొదలైంది. ఉప ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన వరంగల్ టీఆర్ ఎస్ ఎంపీ కడియం శ్రీహరి తన పదవికి రాజీనామా చేయటం తెలిసిందే. కడియం రాజీనామాను లోక్ సభ స్పీకర్ మీరాకుమార్ ఆమోదించిన నేపథ్యంలో.. ఉఫ ఎన్నికను త్వరలో నిర్వహించనున్నారు.

ఈ నేపథ్యంలో వరంగల్ ఉప ఎన్నిక బరిలో అభ్యర్థులుగా ఎవరు నిలుస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. తెలంగాణ అధికారపక్షం నుంచి ఉప ఎన్నిక గోదాలో ఎవరు దిగుతారన్న దానిపై సస్పెన్స్ నెలకొంది. గతంలో.. కడియం కుమార్తెను బరిలోకి దింపితే.. సెంటిమెంట్ వర్క్ వుట్ అవుతుందన్న వాదన వినిపించింది. దీనిపై కడియంతో సహా.. ఏ ఒక్కరూ పెదవి విప్పింది లేదు.

ఇక.. కాంగ్రెస్ పార్టీ నుంచి ఉప ఎన్నిక అభ్యర్థినిగా లోక్ సభ మాజీ స్పీకర్.. తెలంగాన రాష్ట్ర బిల్లు తీసుకురావటంతో కీలకభూమిక పోషించిన మీరాకుమార్ ను దించాలన్న వాదన జోరందుకోవటం తెలిసిందే. ఇది ఒట్టి ప్రచారం మాత్రమే తప్పించి.. ఆమె బరిలోకి దిగే అవకాశాలు తక్కువ అన్న మాట నుంచి.. వ్యూహాత్మకంగా మీరాకుమార్ కు మించిన అభ్యర్థి ఎవరుంటారన్న మాట ప్రస్తుతం కాంగ్రెస్ లో వినిపిస్తున్న పరిస్థితి.

ఇక.. తెలుగు దేశంలో పార్టీలో అయోమయం వ్యక్తమవుతోంది. అభ్యర్థి ఎంపికకు సరిపడా నేతల పేర్లు తెరపైకి రావటం లేదు. ఈ ఉప ఎన్నికకు తమకు అవకాశం ఇవ్వాలని బీజేపీ కోరుతుందని.. దీనికి మిత్ర పక్షంగా టీటీడీపీ ఓకే అంటుందని చెబుతున్నారు.

వరంగల్ ఉఫ ఎన్నికకు సంబంధించి అభ్యర్థుల ఎంపికతో పాటు.. మరో పెద్ద అంశం సవాలుగా మారింది. ఈ ఉప ఎన్నికకు భారీగా ఖర్చు పెట్టే అవకాశం ఉన్న నేపథ్యంలో.. ఉప ఎన్నిక బరిలో దిగే అభ్యర్థి అర్థికంగా కూడా బలమైన మూలాలు ఉన్న వ్యక్తి అయి ఉండాలన్న ప్రచారం జరుగుతోంది.

మిగిలిన పార్టీల సంగతి ఎలా ఉన్నా.. కాంగ్రెస్ పార్టీ మాత్రం ఉప ఎన్నికకు అభ్యర్థి ఖర్చు మొత్తం పెట్టుకుంటుందని చెబుతున్నారు. అందరూ భావిస్తున్నట్లుగా.. మీరా కుమార్ కానీ బరిలోకి దిగితే.. ఉప ఎన్నిక ఖర్చు మొత్తం పార్టీ అదినాయకత్వమే చూసుకుంటుందన్న భావన వ్యక్తమవుతోంది. ఖర్చుల దాకా మాటలు నడుస్తున్న నేపథ్యంలో.. వరంగల్ ఉప ఎన్నికకు కాంగ్రెస్ అభ్యర్థిగా మీరాకుమార్ ఓకే అయినట్లేనా అంటే మాత్రం.. కాస్త ఆగాలని చెబుతున్నారు.