Begin typing your search above and press return to search.

దానం ప్లేస్‌ లో వీరేనా?

By:  Tupaki Desk   |   12 Feb 2016 11:10 AM GMT
దానం ప్లేస్‌ లో వీరేనా?
X
గ్రేటర్‌ హైదరాబాద్ ఎన్నికల్లో ఓటమికి బాధ్యత వహిస్తూ నగర కాంగ్రెస్‌ అధ్యక్ష పదవికి మాజీ మంత్రి దానం నాగేందర్‌ రాజీనామా చేయడం, దాన్ని టీపీసీసీ ఆమోదించ‌డంతో ఏర్ప‌డిన ఖాళీని భ‌ర్తీ చేసేందుకు కాంగ్రెస్ పెద్ద‌లు కసరత్తు ప్రారంభించారు. గ్రేట‌ర్ కొత్త సారధిని నియమించేందుకు సీనియర్‌ నాయకులు సంప్రదింపులు జరుపుతున్నారు. ఈ క్ర‌మంలో ప‌లువురు సీనియర్ నేత‌లు, మాజీ మంత్రుల పేర్లు తెర‌మీదకు వ‌స్తున్నాయి.

నగర అధ్యక్ష పదవికి మాజీ మంత్రులు ముఖేష్‌ గౌడ్‌ - మర్రి శశిధర్‌ రెడ్డి పేర్లు ప్ర‌ముఖంగా వినిపిస్తున్నాయి. అయితే అధ్య‌క్ష‌ పదవిని చేపట్టేందుకు మర్రి విముఖంగా ఉన్నట్టు తెలుస్తోంది. దేశ, రాష్ట్ర స్థాయిలో పదవీబాధ్యతలు చేపట్టినందున న‌గర అధ్యక్ష పదవి పట్ల మ‌ర్రి ప్రతికూలంగా ఉన్నట్టు పార్టీ నేతలు చెబుతున్నారు. మాజీ మంత్రి, సీనియర్‌ నేత ముఖేష్‌ గౌడ్ పేరును కూడా టీపీసీసీ సీరియ‌స్‌ గానే పరిశీలిస్తోంది.ఈ ఇద్ద‌రు నేత‌లు కాకుండా మ‌రికొన్ని పేర్ల‌ను కూడా పార్టీ అగ్ర‌నేత‌లు ప‌రిశీలిస్తున్నారు. మాజీ ఎంపీ అంజన్‌ కుమార్ యాద‌వ్ పేరు కూడా హ‌స్తం శ్రేణుల నుంచి వినిపిస్తోంది. అంజ‌న్ కొడుకు అనిల్‌ కుమార్‌ యూత్‌ కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతున్న నేప‌థ్యంలో గ్రేట‌ర్‌ పార్టీ బాధ్యతను అంజన్‌ కుమార్‌ కు అప్పగించడం ద్వారా ఒకే కుటుంబంలో రెండు పార్టీ పదవులు ఇవ్వడం వల్ల నాయకుల్లో అసంతృప్తి పెరుగుతుందని పార్టీ నేతలు అంటున్నారు.

మరోవైపు ఎల్‌ బీనగర్‌ మాజీ ఎమ్మెల్యే సుధీర్‌ రెడ్డి, కుత్బుల్లాపూర్‌ మాజీ ఎమ్మెల్యే శ్రీశైలం గౌడ్‌ కూడా గ్రేట‌ర్ ప‌ద‌విని ఆశిస్తున్నట్టు తెలిసింది. ఇప్పటికే గ్రేటర్‌ పరిధిలో హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాలకు చెందిన కొన్ని నియోజకవర్గాలు కలిసి ఉన్నాయి. దానం నాగేందర్‌ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో దానం హైదరాబాద్‌ కే పరిమితం కావాలని రంగారెడ్డి జిల్లా పరిధిలో ఉన్న అర్బన్‌ నియోజకవర్గాలను జిల్లా కమిటి పరిధిలోకి తీసుకురావాలని సుధీర్‌ రెడ్డి కోరారు. గ్రేటర్‌ కాంగ్రెస్‌ కమిటీని విభజించి రంగారెడ్డి జిల్లా అర్బన్‌ వేరు చేయాలని కోరిన సుధీర్‌ రెడ్డి - శ్రీశైలం గౌడ్‌ ఇప్పుడు గ్రేట‌ర్‌ పదవి కావాలని కోర‌డంపై నగరానికి చెందిన సీనియర్‌ నేతలు, క్షేత్రస్థాయి కార్యకర్తలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ ప‌రిణామాల రీత్యా నగర అధ్యక్ష బాధ్యతలను ముఖేష్‌ గౌడ్‌ కు అప్పగిస్తారని ప్రచారం జరుగుతోంది. ఇటీవల ముఖేష్‌ గౌడ్‌ కొడుకు విక్రమ్‌ గౌడ్‌ ను మేయర్‌ అభ్యర్థిగా ప్రకటించగా ఆయ‌న ఓటమిపాలయిన సంగ‌తి తెలిసిందే.