Begin typing your search above and press return to search.

ముంబైలో హంగ్‌..చావు దెబ్బ‌తిన్న కాంగ్రెస్‌

By:  Tupaki Desk   |   23 Feb 2017 4:33 PM GMT
ముంబైలో హంగ్‌..చావు దెబ్బ‌తిన్న కాంగ్రెస్‌
X
ఐదు రాష్ర్టాల ఎన్నిక‌ల ఫ‌లితాలకు ముందే... బీజేపీకి తీపిక‌బురు ద‌క్కింది. మహారాష్ట్రలో జరిగిన మున్సిపల్ కార్పొరేషన్ల ఎన్నికల్లో అధికార బీజేపీకి ఎదురులేకుండా పోయింది. ముంబై కార్పొరేషన్‌ సహా 9 కార్పొరేషన్లకు జరిగిన ఎన్నికల్లో ఏడింటిలో గెలిచి సత్తా చాటింది. కీలకమైన ముంబై కార్పొరేషన్‌ లోనూ బీజేపీ భారీగా పుంజుకోవటం విశేషం. బీజేపీ - శివసేనలు వేర్వేరుగా పోటీ చేసినప్పటికీ ముంబై జనం ఈ రెండు పార్టీలకే పట్టం కట్టారు. రెండు పార్టీలు కలిసి ఏకంగా 166 సీట్లు గెలుచుకున్నాయి. బీజేపీని కాదని ఒంటరిగా పోటీ చేసిన శివసేన తానేంటో నిరూపించుకుంది. ముంబైలో తమకు ఎదురులేదని స్పష్టం చేసింది. ఏకంగా 84 సీట్లలో గెలిచి నంబర్‌ వన్‌ పార్టీగా నిలిచింది. కౌంటింగ్‌ ప్రారంభమైనప్పటి నుంచి శివసేన లీడ్‌ లో ఉండటం విశేషం. బీజేపీని కాదని ఈసారి శివసేన ఒంటరిగా బరిలోకి దిగి 227 స్థానాల్లో పోటీ చేయగా 84 సీట్లను కైవసం చేసుకుంది. దీంతో ఆ పార్టీ నేతలు ఫుల్‌ ఖుషీలో ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల నాటి నుంచి బీజేపీతో శివసేనకు పడటం లేదు. ప్రస్తుతం రాష్ట్రంలో బీజేపీ సర్కార్‌ కు మద్దతిస్తున్నప్పటికీ ఆ పార్టీలో తీవ్ర అసంతృప్తి ఉంది. ఈ నేపథ్యంలోనే లోకల్‌ బాడీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి సత్తా చాటింది.

మొత్తం 227 స్థానాలకు గానూ బీజేపీ 82 స్థానాల్లో గెలుపొందింది. గత ఎన్నికలతో పోలిస్తే ఆ పార్టీ ఈసారి ఏకంగా 50 సీట్లు అధికంగా గెలుచుకుంది. చిరకాల మిత్రపక్షం శివసేన... కాషాయ దళాన్ని కాదన్నప్పటికీ భారీ విజయాన్ని నమోదు చేయటం విశేషం. ఇక వరుస పరాభవాలతో కొట్టుమిట్టాడుతున్న కాంగ్రెస్ కు మరో షాక్‌ తగిలింది. బీఎంసీ ఎన్నికల్లో ఈ పార్టీ కేవలం 31 సీట్లు మాత్రమే గెలుచుకుంది. శరద్‌ పవార్ నేతృత్వంలోని నేష‌న‌లిస్ట్ కాంగ్రెస్ పార్టీకి 9 సీట్లే వచ్చాయి. మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎం.ఎన్‌.సి)కు సైతం ఓటర్లు షాక్‌ ఇచ్చారు. కేవలం 9 సీట్లలో మాత్రమే ఆ పార్టీని గెలిపించారు. ఇతరులు 14 స్థానాల్లో గెలిచారు. కాగా, బీఎంసీ ఎన్నికల్లో నంబర్‌ వన్‌ గా నిలవటంతో శివసేన ఫుల్ ఖుషీలో ఉంది. కౌంటింగ్‌ ప్రారంభమైనప్పటి నుంచే ఆ పార్టీ నేతలు సంబరాల్లో మునిగితేలారు. సీట్లు పంచుతూ…ట‌పాసులు కాల్చుతూ సందడి చేశారు. పార్టీ అధినేత ఉద్ధవ్‌ థాక్రే ఇళ్లు మాతోశ్రీ వద్ద భారీ ఎత్తున కార్యకర్తలు గుమిగుడారు. శివసేన జై అంటూ నినాదాలు చేశారు. ఈ విజయం తమకు ఎంతో బలాన్నిచ్చిందని, తమకు ఓటేసిన ప్రజలకు ఉద్ధవ్‌ థాక్రే కృతజ్ఞతలు తెలిపారు. ఇటు బీజేపీ నేతలు సైతం పెద్ద ఎత్తున జోష్‌ లో కనిపించారు. బీఎంసీలో లో సొంతంగా 82 సీట్లు రావటం ఆ పార్టీ నేతల్లో సంతోషాన్ని నింపింది. ఈ విజయాన్ని ముంబై ప్రజలకు సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ అంకితమిచ్చారు. మోడీ పాలనను ప్రజలు అంగీకరిస్తున్నారని అనటానికి ఇదే నిదర్శనమన్నారు. పారదర్శక పాలనకు జనం పట్టం కట్టారన్నారు.

ముంబైలో బీజేపీ, శివసేన సత్తా చాటినప్పటికీ ఏ పార్టీకి పూర్తి మెజారిటీ రాలేదు. బీఎంసీ పీఠం కైవసం చేసుకోవాలంటే 114 సీట్లు అవసరం. దీంతో ప్రస్తుతం హంగ్‌ ఏర్పడినట్లైంది. బీజేపీ-శివసేన మళ్లీ చేతులు కలుపుతాయా లేక ఇతర పార్టీల సహాయంతో బీఎంసీ గద్దనెక్కుతాయా అన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది. మ‌రోవైపు మహారాష్ట్రలోని పుణె, నాసిక్‌, సోలాపూర్‌, నాగపూర్‌, ఉల్లాస్‌ నగర్‌ మున్సిపల్ కార్పొరేషన్లను బీజేపీ గెలుచుకుంది. థానేలో శివసేన సత్తా చాటింది. అన్ని కార్పొరేషన్లలో కాంగ్రెస్, ఎన్సీపీ, ఎం.ఎన్‌.ఎస్‌ చావు దెబ్బ తిన్నాయి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/