Begin typing your search above and press return to search.

కాంగ్రెస్ కు అంతిమ ఘడియలు

By:  Tupaki Desk   |   26 Feb 2017 10:30 PM GMT
కాంగ్రెస్ కు అంతిమ ఘడియలు
X
కాంగ్రెస్ పార్టీ మరణ శయ్యపై ఉంది. 132 ఏళ్ల ఘన చరిత్ర... దశాబ్దాలపాటు భారత దేశాన్ని ఏలిన అనుభవం అన్నీ గతం కానున్నాయి. పార్టీ ఇమేజి దారుణంగా పడిపోవడం.. ప్రజల్లో ఆదరణ కోల్పోవడంతో కాంగ్రెస్ పార్టీ చావుకు దగ్గర్లో ఉంది. అయితే.. అంతోటి చరిత్ర... అనుభవం.. ఆదరణ, అభిమానం అన్నీ ఉన్నా ఇప్పుడెందుకు కాలగర్భంలోకి కలిసిపోతుంది అని ప్రశ్నించుకుంటే రాజకీయ పార్టీల గతే అంత అన్న సమాధానం వినిపిస్తోంది. ఏ పార్టీ కూడా శాశ్వతం కాదని... ఎన్నటికైనా కనుమరుగు కాక తప్పదని చరిత్ర సాక్ష్యాలు చూపిస్తోంది.

కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. ప్రస్తుతం జరుగుతున్న అయిదు రాష్ర్టాల ఎన్నికల్లో ఆ పార్టీ ఏదో సాధించేస్తుందన్న ఆశ ఎవరికీ లేదు. విధానపరమైన లోపాలే కాంగ్రెస్ ను ఖతం చేశాయి. రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్న సమయంలోనే పార్టీకి నిర్దిష్ట విధానం - ప్రత్యేక ముద్ర లేకుండా పోయింది.. ఆ తరువాత పీవీ - మన్మోహన్ వంటివారు ప్రధానులుగా ఉన్న సమయంలోనూ అదే ధోరణి కొనసాగింది. దీంతో ఓటు బ్యాంకులో స్థిరత్వం అన్నది లోపించింది. బలమైన ఓటు బ్యాంకు అనుకున్న వర్గాలను కూడా ప్రాంతీయ పార్టీలు - కుల - మత ఆధారంగా సాగుతున్న పార్టీలు ఆకట్టుకోగలిగాయి. ఇవన్నీ కాంగ్రెస్ ను దెబ్బతీశాయి. మరోవైపు బీజేపీ ఎన్ని వ్యతిరేకతలు వచ్చిన తన హిందూత్వ విధానాన్ని ఏదో రూపంలో కొనసాగిస్తూ స్పష్టమైన విధానంతో ఉంది.

కాంగ్రెస్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో పూర్తిగా చతికిలపడింది. గుజరాత్ లో మూడు దశాబ్దాలుగా అధికారంలోకి రాలేదు. ఒడిశాలోనూ అత్యంత దీన స్థితిలో ఉంది. తిరుగులేని స్థితిలో ఉన్న బీజేడీని ఎదుర్కోలేక కష్టాలు పడుతుంటే పులిమీద పుట్రలా ఉన్న కొద్దిపాటి ఓటు బ్యాంకును, నేతలను బీజేపీ తన్నుకుపోవడంతో కాంగ్రెస్ అక్కడ తిరిగి లేచే ఛాన్సే కనిపించడం లేదు. బెంగాల్ లోనూ అదే పరిస్థితి. తమిళనాడులో చెప్పనవసరం లేదు. ఈశాన్య రాష్ట్రాల్లో అంతోఇంతో పట్టుండేది.. కానీ, అస్సాం - అరుణాచల్ ప్రదేశ్ వంటి రాష్ర్టాలు కూడా బీజేపీ వశమయ్యాయి. మిగతా చిన్నచితకా రాష్ట్రాల నుంచీ కాంగ్రెస్ కనుమరుగవుతోంది. ఢిల్లీలో నో ఛాన్సు.. యూపీ - బీహార్ - జార్కండ్ - మధ్యప్రదేశ్ - ఛత్తీస్ గడ్ లలో ఎక్కడా అవకాశాలే కనిపించడం లేదు. ఉన్నదంతా కర్ణాటకలోనే బలంగా కనిపిస్తోంది. అక్కడా భవిష్యత్తులో ఏమవుతుందో చెప్పలేని పరిస్థితి.

పార్టీల కథ ముగిసిందిలా..

* ఆల్ ఇండియా ముస్లిం లీగ్... 20వ శతాబ్దపు తొలినాళ్లలో ఏర్పడిన ఈ పార్టీ ఉవ్వెత్తున లేచింది. ముస్లింల రాజకీయ హక్కులను పరిరక్షిస్తూ బ్రిటిష్ పాలకులతో కలిసి మెలసి సాగిన పార్టీ ఇది. కానీ... స్వాతంత్ర్యానంతరం కాంగ్రెస్ తో కలిసి అధికారం పంచుకునే విషయంలో సరైన ఒప్పందాలు చేసుకోలేకపోవడంతో ఉనికిలో లేకుండా పోయింది. దేశ విభజనను అడ్డుకోలేకపోవడం వంటి కారణాలు ఆ పార్టీని ఇండియాలో కనుమరుగు చేయడానికి కారణమయ్యాయి.

స్వాతంత్ర్యం తరువాత ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ యూనియన్ పేరుతో కొనసాగిన ఈ పార్టీకి చాలాకాలం పాటు ఒకే ఒక్క ఎంపీ ఉండేవారు. బనత్ వాలా అనే గుజరాతీ కేరళ నుంచి చాలాసార్లు ఈ పార్టీ నుంచి ఎంపీగా గెలిచారు. ఆయన తరువాత పార్టీ కథ ముగిసింది. కానీ.. పాక్ లో మాత్రం ముస్లిం లీగ్ మొదట ఆటుపోట్లు ఎదుర్కొన్నా... జిన్నా మరణించినా.. పార్టీ ముక్కలు చెక్కలుగా చీలినా కూడా దశాబ్దాల పాటు డామినెంట్ గా ఉంది.

* కాంగ్రెస్ నుంచి వేరు పడిన ఉదారవాదులు - సోషలిస్టులు - కాంగ్రెస్ వ్యతిరేకులతో కూడిన జనతా పార్టీ కూడా కొంత కాలం ప్రభావవంతంగా ఉన్నా బహు నాయకత్వం.. భిన్న భావజాలాలు - స్వతంత్ర భావజాలం గల వ్యక్తులు ఎక్కువగా ఉండడం వంటి కారణాలతో అనేక పార్టీలుగా, శాఖలుగా విడిపోయి కాలక్రమంలో అసలు పార్టీ మాయమైపోయింది. జనతా పార్టీ నుంచి ఉద్భవించిన జనతాదళ్ కాంగ్రెస్ వ్యతిరేక రాజకీయాలతో అనేక ఆశలు కల్పించినా అది అనధికారికంగా ఉత్తర - దక్షిణ భారత దేశ విభాగాలుగా విడిపోయింది. జనతాదళ్ యు - జనతాదళ్ ఎస్ వంటి పార్టీలుగా విడిపోయి రాష్ట్రాల్లో అధికారం సంపాదించుకుని అక్కడే సరిపెట్టుకున్నట్లయింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/