Begin typing your search above and press return to search.

క‌త్తి కిందేసిన కాంగ్రెస్ పార్టీ

By:  Tupaki Desk   |   28 May 2016 11:01 AM GMT
క‌త్తి కిందేసిన కాంగ్రెస్ పార్టీ
X
తెలంగాణ‌లో జ‌ర‌గ‌నున్న రెండు రాజ్య‌స‌భ స్థానాల ఎన్నిక‌ల్లో అధికార టీఆర్ ఎస్ పార్టీ రెండు స్థానాల‌కు అభ్య‌ర్థులుగా మాజీ మంత్రి - పార్టీ సీనియ‌ర్ నేత కెప్టెన్ ల‌క్ష్మీకాంత‌రావు - మాజీ మంత్రి - మాజీ పీసీసీ అధ్య‌క్షుడు డి.శ్రీ‌నివాస్ ల‌ను ఎంపిక చేసింది. తాజాగా పాలేరు గెలుపుతో టీఆర్ ఎస్ పార్టీకి స్వంతంగా 82 మంది స‌భ్యుల బ‌లంతో పాటు, ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేల మ‌ద్ద‌తు ఉంది. ఇద్ద‌రు ఎంపీ అభ్య‌ర్థుల‌ను గెలిపించుకునేందుకు స‌రిప‌డా ఎమ్మెల్యేలు టీఆర్ ఎస్ పార్టీకి ఉన్నారు.

అయితే కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌ - త్వ‌ర‌లో ప‌ద‌వీకాలం పూర్తి చేసుకోబోతున్న ఎంపీ వి.హ‌నుమంత‌రావు రాజ్య‌స‌భ ఎన్నిక‌ల్లో తెలంగాణ నుండి తాను బ‌రిలోకి దిగుతాన‌ని, టీఆర్ ఎస్ పార్టీ త‌న‌కు మ‌ద్ద‌తు తెల‌పాల‌ని ఆయ‌న కోరారు. తాను కేసీఆర్ ను కూడా ఈ విష‌యమై కలుస్తాన‌ని అన్నారు. ఈ మేర‌కు ఆయ‌న పార్టీ అధ్య‌క్షురాలు సోనియాగాంధీని క‌లిసి త‌న‌కు అవ‌కాశం ఇవ్వాల‌ని కోర‌డ‌మే కాకుండా, ఇక్క‌డ పీసీసీ అధ్య‌క్షుడు ఉత్త‌మ్ కుమార్ రెడ్డి - సీఎల్పీ నేత జానారెడ్డిల‌ను క‌లిసి కోరాడు.

అయితే అనూహ్యంగా ఈ రోజు స‌మావేశం అయిన సీఎల్పీ వీహెచ్ పోటీకి అనుమ‌తి ఇవ్వలేదు. త‌గినంత బ‌లం లేనందువ‌ల్ల పోటీ చేయ‌కూడ‌ద‌ని నిర్ణ‌యం తీసుకుంది. అయితే బ‌లంలేద‌న్న విష‌యం వీహెచ్ తో స‌హా అంద‌రికి తెలిసిందే. కాంగ్రెస్ నుండి టీఆర్ ఎస్ లో చేరిన వారిని ఇరుకున పెట్టే ఉద్దేశంతో పాటు, మ‌ద్ద‌తు కోరి టీఆర్ ఎస్ ను బ‌ద్ నాం చేయాల‌న్న ఎత్తుగ‌డ వీహెచ్ ది. కానీ కాంగ్రెస్ సీనియ‌ర్లు మాత్రం వీహెచ్ కు అవ‌కాశం ఇవ్వ‌కుండా అడ్డు త‌గిలార‌ని పార్టీ వ‌ర్గాలు అభిప్రాయ‌ప‌డుతున్నాయి. ఇప్ప‌టి వ‌ర‌కు ఎన్నో ఎన్నిక‌ల్లో పార్టీ ఓడిపోయింది. ఇప్పుడు పోటీకి అవ‌కాశం ఇస్తే టీఆర్ ఎస్ కొంత ఇరుకున ప‌డేద‌ని అంటున్నారు.