Begin typing your search above and press return to search.

కొత్త ఎమ్మెల్యేలు విధేయత ‘బాండ్’ రాసివ్వాలట

By:  Tupaki Desk   |   25 May 2016 9:07 AM GMT
కొత్త ఎమ్మెల్యేలు విధేయత ‘బాండ్’ రాసివ్వాలట
X
అధికారంలో ఉన్నప్పుడు కిందామీదా ఆలోచించకుండా చేసిన పనులకు కాంగ్రెస్ పార్టీకి ఎదురవుతున్న ఎదురుదెబ్బలు ఎన్నో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆపరేషన్ ఆకర్ష్ కు పుట్టిల్లు లాంటి కాంగ్రెస్ కే షాకిచ్చేలా మిగిలిన పార్టీలు ఆ అస్త్రాన్ని వినియోగిస్తున్న వేళ.. అలాంటి ఇబ్బంది నుంచి తప్పించుకునేందుకు కొత్తపద్ధతికి తెర తీసింది పశ్చిమ బెంగాల్ కాంగ్రెస్ పార్టీ. తాజాగా ముగిసిన ఆ రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికైన కాంగ్రెస్ ఎమ్మెల్యేల్ని విధేయత బాండ్ రాసివ్వాలని పార్టీ కోరటం ఇప్పుడు సంచలనంగా మారింది.

ప్రజాప్రతినిధులను కాంటాక్ట్ ఉద్యోగులుగా భావించారో ఏమో కానీ.. పశ్చిమ బెంగాల్ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు అధీర్ చౌదరి తాజా ఆదేశాలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. పార్టీ అధినేత్రి సోనియాగాంధీకి.. పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పేర్ల మీద వంద రూపాయిల స్టాంప్ పేపర్ మీద.. తాము పార్టీ నుంచి మారమని.. పార్టీలకు విధేయతగా ఉంటామంటూ స్టాంప్ పేపర్ మీద ప్రమాణ పత్రాన్ని రాసివ్వాలని కోరినట్లుగా తెలుస్తోంది.

అయితే.. ఈ వైఖరి పట్ల కొందరు ఎమ్మెల్యేలు అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. తాము ప్రజాప్రతినిధులమని.. కాంట్రాక్ట్ ఉద్యోగులం కాదన్న విషయాన్ని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి వద్ద ప్రస్తావించినట్లుగా తెలుస్తోంది. దీనిపై పలువురు విమర్శలు వ్యక్తం చేయటంపై అధీర్ చౌదరి విషయాన్ని కవర్ చేస్తూ.. పార్టీ పట్ల వారి బాధ్యతను గుర్తు చేసేందుకు మాత్రమే ఇలా వ్యవహరించినట్లుగా వ్యాఖ్యానించటం గమనార్హం. ఇంతకీ కొత్త ఎమ్మెల్యేల చేత విధేయతా బాండ్ రాయిస్తున్నట్లా? లేనట్లా?