Begin typing your search above and press return to search.

మ‌ళ్లీ కాంగ్రెస్ కు చాయ్ వాలా ఎఫెక్ట్

By:  Tupaki Desk   |   22 Nov 2017 5:15 AM GMT
మ‌ళ్లీ కాంగ్రెస్ కు చాయ్ వాలా ఎఫెక్ట్
X
హిస్ట‌రీ రిపైట్ అయ్యింది. త‌ప్పు చేయ‌టం త‌ప్పు కాదు. కానీ.. చేసిన త‌ప్పును మ‌రోసారి చేయ‌ట‌మే పే..ద్ద త‌ప్పు. అదే ప‌ని చేసింది కాంగ్రెస్ పార్టీ. సెంటిమెంట్ల‌ను ట‌చ్ చేసే వ్యాఖ్య‌ల‌కు భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుంద‌న్న విష‌యాన‌ని మ‌ర‌వ‌టమే దీనికి కార‌ణంగా చెప్పాలి. గ‌తంలో ఒక‌సారి తాము చేసిన వ్యాఖ్య త‌మ‌ను ఎంత‌గా దెబ్బ తీసింద‌న్న విష‌యం తెలిసిన త‌ర్వాత కూడా మ‌ళ్లీ అలాంటి ప్ర‌య‌త్న‌మే చేసి ఈసారి అడ్డంగా బుక్ అయ్యింది.

2014 ఎన్నిక‌ల‌కు ముందు మోడీని బీజేపీ ప్ర‌ధాన‌మంత్రి అభ్య‌ర్థిగా నిర్ణ‌యం తీసుకున్న వేళ‌.. ఆయ‌న‌పై విమ‌ర్శ‌ల్ని తీవ్ర‌త‌రం చేయ‌టం తెలిసిందే. ఈ స‌మయంలో త‌న ఇమేజ్ ను డ్యామేజ్ చేసే ప్ర‌య‌త్నం చేస్తున్న కాంగ్రెస్ కు రిటార్ట్ ఇచ్చేందుకు వీలుగా మోడీ త‌న గ‌తాన్ని ఆవిష్క‌రించారు. తాను రైల్వేస్టేష‌న్లో టీ అమ్ముకున్న వైనాన్ని వెల్ల‌డించారు. దేశ ప్ర‌ధాని కుర్చీలో కూర్చోవ‌టానికి ఒక కుటుంబానికి మాత్ర‌మే అర్హ‌త ఉందా? రైల్వేస్టేష‌న్లో టీ అమ్ముకున్న సామాన్యుడికి అవ‌కాశం ఉండ‌దా? అంటూ సెంటిమెంట్‌ను ర‌గిల్చే ప్ర‌య‌త్నం చేసి స‌క్సెస్ అయ్యారు.

మోడీ మాట‌లు సామాన్యులపై ఎంత‌టి ప్ర‌భావాన్ని చూపించింద‌న్న విష‌యాన్ని గుర్తించ‌ని కాంగ్రెస్ నాయ‌కుడు.. త‌మ పార్టీ ప్లీన‌రీ సంద‌ర్భంగా మోడీకి టీ అమ్ముకునే అవ‌కాశం క‌ల్పిస్తామంటూ ఎక్కెసం చేశారు. ఒక వ్య‌క్తి గ‌తాన్ని ఇంత చుల‌క‌న చేసి మాట్లాడ‌తారా? క‌ష్ట‌ప‌డి పైకి వ‌చ్చిన వ్య‌క్తిని అధికార అహంభావంతో తూల‌నాడ‌తారా? అన్న ఆగ్ర‌హం జ‌న‌సామ్యంలో వెల్లువెత్త‌ట‌మే కాదు.. సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో మోడీకి తిరుగులేని విజ‌యాస్ని క‌ట్ట‌బెట్టాయి.

ఇంత జ‌రిగిన త‌ర్వాత కూడా మోడీ చాయ్ వాలా ఎపిసోడ్‌ను ట‌చ్ చేసే విష‌యంలో ఆచితూచి వ్య‌వ‌హ‌రించాల్సిన అవ‌స‌రం ఉంది. కానీ.. ఆ విష‌యాన్ని మ‌ర్చిపోయిన కాంగ్రెస్ నేత‌లు తాజా గుజ‌రాత్ ఎన్నిక‌ల్లో మ‌రోసారి చాయ్ వాలా కామెంట్ల‌ను తెర మీద‌కు తెచ్చి అడ్డంగా బుక్ అయ్యారు.

గుజ‌రాత్ అసెంబ్లీ ఎన్నిక‌ల ప్ర‌చారం హోరాహోరీగా సాగుతోంది. ఈ నేప‌థ్యంలో ప్ర‌ధాని మోడీని చాయ్ వాలా నేప‌థ్యాన్ని ఎగ‌తాళి చేసేలా కాంగ్రెస్ పార్టీ యువ‌జ‌న విభాగం ఒక వ్యంగ్య చిత్రాన్ని రూపొందించి ట్విట్ట‌ర్ లో ట్వీట్ చేసింది. అదికాస్తా బూమెరాంగ్ అయి..వృద్ధ‌కాంగ్రెస్‌ను ఆత్మ‌ర‌క్ష‌ణ‌లో ప‌డేసింది.

ఇంత‌కీ ఏం జ‌రిగిందంటే.. కాంగ్రెస్ పార్టీ సోష‌ల్ మీడియాలో ఒక వ్యంగ్య చిత్రాన్ని రూపొందించారు. అందులో అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్‌.. బ్రిట‌న్ ప్ర‌ధాని థెరిసా మేల‌ను ఉద్దేశించి మోడీ.. త‌న‌పై ప్ర‌తిప‌క్షాలు ఎన్ని మేమేలు త‌యారు చేస్తున్నారో చూశారా.. అంటే దానికి ట్రంప్ బ‌దులిస్తూ మేమే కాదు మీమ్ అని ప‌ల‌కాలంటూ హిత‌వు ప‌ల‌క‌టం క‌నిపిస్తుంది. దీనికి బ్రిట‌న్ ప్ర‌ధాని థెరిసా నువ్వు చాయ్ అమ్ముకో అన్న‌ట్లు ఉంది.

మోడీని కించ‌ప‌రిచేలా ఉన్న ఈ వ్యంగ్య చిత్రంలో విదేశీయుల ముందు మోడీని చిన్న‌బుచ్చేలా ఉండ‌టంతో ప‌లువురు నెటిజ‌న్లు నెగిటివ్ గా రియాక్ట్ అయ్యారు. ఈ వ్యంగ్య చిత్రాన్ని త‌యారు చేసిన కాంగ్రెస్ పార్టీని తిట్టిపోశారు. ఊహించ‌ని రీతిలో మోడీకి ఆన్ లైన్ లో మ‌ద్ద‌తు రావ‌టంతో నాలుక్క‌ర్చుకున్న కాంగ్రెస్ తాము చేసిన పోస్ట్ ను డిలీట్ చేసింది. న‌ష్ట‌నివార‌ణ చ‌ర్య‌ల్ని చేప‌ట్టింది. 2014కుముందు ఇదే రీతిలో మోడీని చాయ్ వాలా అన్నందుకు ఎదురైన చేదు అనుభ‌వాన్ని ఎదుర్కొన్న కాంగ్రెస్‌కు ఇప్ప‌టికి బుద్ధి రాన‌ట్టుంది క‌దూ?