Begin typing your search above and press return to search.

ప్ర‌తిప‌క్షాన్ని ఆప‌డం ఇక ఎవ‌రితరం కాద‌ట‌

By:  Tupaki Desk   |   23 Feb 2018 6:18 AM GMT
ప్ర‌తిప‌క్షాన్ని ఆప‌డం ఇక ఎవ‌రితరం కాద‌ట‌
X
రాష్ట్రం ఏర్పాటు అనంత‌రం అనేక చేదు అనుభ‌వాల‌కు వేదిక‌గా మారిన తెలంగాణ‌లో ప్ర‌ధాన‌ప్ర‌తిప‌క్ష‌మైన కాంగ్రెస్ పార్టీ తాజాగా రెట్టించిన ఉత్సాహంతో ముందుకు సాగుతోంది. ఇటీవ‌లి కాలంలో ఒకింత బ‌ల‌ప‌డుతున్న ఆ పార్టీ 2019లో విజయమే లక్ష్యంగా పెట్టుకుంది. కేసీఆర్‌ అధికారంలోకి వచ్చిన నాలుగేళ్లు పూర్తికావొస్తున్నాయి. వచ్చే నెలలో బడ్జెట్‌ సమావేశాల్లో కేసీఆర్‌ సర్కార్‌ నాలుగవ బడ్జెట్‌ ను ప్రవేశపెట్టపోతోంది. అయితే ఈ నాలుగేళ్లలో బడ్జెట్‌ లో చెప్పినవి - కేటాయించినవి ఇక్కడి ఇప్పటికీ అమలుకాలేదని కాంగ్రెస్‌ చెబుతోంది. చెప్పినవి - ప్రకటించినవి - కేటాయించినవే ఇప్పటికి అమలుకాలేదని ప్రభుత్వం అంటోంది. కేసీఆర్‌ ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలు గత బడ్జెట్‌ లో చెప్పిన అంశాలను ఏమాత్రం పట్టించుకోలేదన్న ప్రచారం ప్రజల్లో చేయాలని కాంగ్రెస్‌ డిసైడ్‌ అయ్యింది.

టీఆర్‌ ఎస్‌ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు ఇదే రైట్‌ టైమ్‌ అని భావిస్తోంది. ఇందుకోసం బస్సుయాత్ర - పాదయాత్రకు శ్రీకారం చుట్టింది. ప్ర‌జ‌ల‌కు చేరువ అయ్యేందుకు బస్సుయాత్ర బాగా ఉపయోగపడుతుందని పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ భావిస్తున్నారు. తాను తలపెట్టిన బస్సుయాత్రతో గులాబీ ప్రభుత్వానికి దడ పుట్టించాలని టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ భావిస్తున్నారు. యాత్ర వందశాతం సక్సెస్‌ అయ్యేందుకు పక్కాప్లాన్‌ తో ముందుకెళ్తున్నారు.అందుకోసం పార్టీ సీనియర్ల‌తో ప్రత్యేక భేటీలు నిర్వ‌హిస్తున్నారు. ఈ క్ర‌మంలో యాత్రను బడ్జెట్‌ సమావేశాల తర్వాత ప్రారంభిస్తే బాగుంటుందన్న అభిప్రాయం కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. దీనిపై పీసీసీ చీఫ్‌ పార్టీలోని కొంతమంది సీనియర్స్‌ తో ప్రత్యేక భేటీలు అవుతున్నారు. జానారెడ్డి - షబ్బీర్‌ అలీ - దామోదర రాజ‌న‌ర్సింహా - డీకె అరుణలతో ఇప్పటికే ప్రత్యేకంగా సమావేశమైన ఉత్తమ్‌... యాత్రకు ఇదే రైట్‌ టైమ్‌ అని స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. చిన్నచిన్న అభిప్రాయ భేదాలు ఉన్న నేతలను సైతం కలుస్తూ... బస్సుయాత్రకు అందరినీ సిద్దం చేస్తున్నారు.

బస్సుయాత్ర - పాదయాత్రలతో జనంబాట పట్టేందుకు డిసైడ్ అయిన కాంగ్రెస్ పార్టీని పుంజుకోవ‌డం ఖాయ‌మ‌ని ఆ పార్టీ నేత‌లు ధీమా వ్య‌క్తం చేస్తున్నారు. ఈ సంద‌ర్భంగా కొంద‌రు నేత‌లే పార్టీలో చేర‌నున్నార‌ని జోస్యం చెప్తున్నారు. ఈ యాత్ర‌ల త‌ర్వాత పార్టీ ర‌థ‌సార‌థి రాహుల్‌ తో భారీ బ‌హిరంగస‌భ ఉంటుంద‌ని వివ‌రిస్తున్నారు.