Begin typing your search above and press return to search.

ఒక్కొక్క‌రు రావ‌ట్లేదు కేసీఆర్‌.....

By:  Tupaki Desk   |   28 Aug 2015 5:52 AM GMT
ఒక్కొక్క‌రు రావ‌ట్లేదు కేసీఆర్‌.....
X
రాజ‌కీయ‌పార్టీల క‌న్నుల‌న్నీ ఇపుడు వ‌రంగ‌ల్ పార్ల‌మెంటు స్థానంపై ప‌డ్డాయి. టీఆర్ ఎస్ నాయ‌కుడు కడియం శ్రీహరి వ‌రంగ‌ల్ ఎంపీగా ఉన్న స‌మ‌యంలోనే తెలంగాణ ఉప ముఖ్య‌మంత్రిగా బంప‌ర్ ఆఫ‌ర్ ద‌క్క‌డంతో ఆయ‌న రాజీనామా చేశారు. దీంతో వరంగల్‌ లోక్‌ సభ నియోజకవర్గం ఖాళీ అయింది. ఈ నియోజకవర్గానికి ఉప ఎన్నికల్లో టీఆర్ ఎస్‌ కు పోటీగా అన్ని పార్టీల తరఫున ఉమ్మడి అభ్యర్ధిని బరిలోకి దింపేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. మొదట వామపక్ష పార్టీల అభ్యర్ధిగా గద్దర్ పేరును పరిశీలించిన కామ్రేడ్లు... మిగిలిన పార్టీలను కూడా కలిసి రావాలని కోరుతున్నారు.

ఏ పార్టీకి ఆ పార్టీ అభ్యర్దిని పోటీకి పెట్టడం వల్ల ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలి అధికార పార్టీకే మేలు జరుగుతుందే తప్ప ప్రయోజనం ఉండదన్నది లెఫ్ట్ పార్టీల వాదన. గతంలోనూ ఇలాగే జరిగిందని... కేసీఆర్ ను గట్టిగా ఎదుర్కొవాలంటే ధీటైన ఉమ్మడి అభ్యర్ధిని బరిలోకి దింపడమే మంచిదన్నది ఆ పార్టీల మాట. దీంతో ఇదే విషయాన్ని రెండ్రోజుల కిందట టీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి వద్ద లెఫ్ట్ పార్టీలు ప్రస్తావించాయి. ప్రతిపాదన బాగుందన్న ఉత్తమ్ పార్టీలో చర్చించి నిర్ణయం చెబుతామన్నారు.

బీజేపీ, టీడీపీలకు కూడా ఇలాంటి ప్రతిపాదననే చేశాయి లెఫ్ట్ పార్టీలు. వాళ్లు పరిశీలిస్తామన్నట్టు సమాచారం. సాధారణంగా ఉపఎన్నికల్లో అధికార పార్టీలదే హవా ఉంటుంది. జోరు మీదున్న టీఆర్ ఎస్ సిట్టింగ్ సీటును దక్కించుకోడానికి అన్ని ప్రయత్నాలు చేస్తుంది. ఇలాంటప్పుడు ప్రతిపక్షాలన్నీ ఏకం అయితే తప్ప టీఆర్ ఎస్ దూకుడును అడ్డుకోలేమంటున్నాయి లెఫ్ట్ పార్టీలు. ఐతే ఈ సీటుకు ఎవరు పోటీ చేయాలన్న దానిపై బీజేపీ-టీడీపీ కూటమి ఇంకా నిర్ధారణకు రాలేదు. అలాగే కాంగ్రెస్ కూడా చాలా మంది ఆశావాహులు టిక్కెట్ కోసం క్యూకట్టారు. ఉమ్మడి అభ్యర్ధి ప్రతిపాదనకు ఈ ప్రధాన పార్టీలు ఎంత వరకు అంగీకరిస్తాయన్న దాన్నిబట్టి ఇది వర్క్ అవుట్ అయ్యే ఛాన్స్ ఉంది.