Begin typing your search above and press return to search.

క‌ర్ణాట‌క‌లో బీజేపీకి మ‌రో షాక్!

By:  Tupaki Desk   |   13 Jun 2018 11:31 AM GMT
క‌ర్ణాట‌క‌లో బీజేపీకి మ‌రో షాక్!
X

కొద్ది రోజుల క్రితం క‌ర్ణాట‌క‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బీజేపీకి మెజారిటీ సీట్లు వ‌చ్చిన‌ప్ప‌టికీ అధికారం ద‌క్క‌ని సంగ‌తి తెలిసిందే. జేడీఎస్, కాంగ్రెస్ లు బీజేపీకి షాకిచ్చి ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేశాయి. ఆ త‌ర్వాత దేశంలోని ప‌లుచోట్ల జ‌రిగిన ఉప ఎన్నిక‌ల్లో కూడా బీజేపీకి పరాభ‌వం త‌ప్ప‌లేదు. ఉత్త‌ర ప్ర‌దేశ్ లోని కైరానాతో పాటు మ‌రికొన్ని బీజేపీ కంచుకోట‌ల‌ను ప్ర‌త్య‌ర్థులు బ‌ద్దలు కొట్టారు. దేశవ్యాప్తంగా బీజేపీకి వ్య‌తిరేక ప‌వ‌నాలు వీస్తున్నాయ‌న్న ఊహాగానాల‌కు ఊత‌మిచ్చేలా ఆ ఫ‌లితాలుండ‌డంతో బీజేపీ పెద్ద‌లు త‌లలు ప‌ట్టుకున్నారు. ఈ నేప‌థ్యంలో తాజాగా, బీజేపీకి మ‌రో షాక్ త‌గిలింది. తాజాగా, క‌ర్ణాట‌క‌లోని జ‌య‌న‌గ‌ర్ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గానికి జ‌రిగిన ఉప ఎన్నిక‌లో కాంగ్రెస్ అభ్యర్థిని సౌమ్యా రెడ్డి ఘ‌న విజ‌యం సాధించారు. ఈ విజ‌యంతో క‌న్న‌డ‌నాట కాంగ్రెస్ కు సంఖ్యాబ‌లం పెరిగింది.

కొద్ది రోజుల క్రితం ముగిసిన క‌ర్ణాట‌క అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు ముందు బీజేపీ తరఫున పోటీ చేసిన అభ్య‌ర్థి బిఎన్‌ విజయ్‌ కుమార్ హ‌ఠాన్మ‌ర‌ణం చెందారు. దీంతో, ఆయ‌న పోటీ చేసిన జ‌య‌న‌గ‌ర్ నియోజ‌క‌వ‌ర్గానికి తాజాగా నిర్వ‌హించిన‌ ఉప ఎన్నిక బ‌రిలో ఆయ‌న సోద‌రుడు బిఎన్‌ ప్రహ్లాద్ పోటీకి దిగారు. ప్ర‌హ్లాద్ పై కాంగ్రెస్ అభ్యర్థిని, మాజీ హోమ్ మంత్రి రామలింగారెడ్డి కుమార్తె సౌమ్యా రెడ్డి పోటీ చేశారు. నేడు ఉద‌యం కౌంటింగ్ లో 8వ రౌండ్ లెక్కింపు పూర్త‌యేస‌రికి.... ప్రహ్లాద్‌ కన్నా సౌమ్య 10 వేల ఓట్లకు పైగా ఆధిక్యంలో ఉన్నారు. దీంతో, సౌమ్యా రెడ్డి గెలుపు ఖాయమ‌ని ఆమె అనుచరులు, కాంగ్రెస్ కార్యకర్తలు సంబరాలు కూడా చేసుకున్నారు. అయితే, ఆ త‌ర్వాతి రౌండ్లలో సౌమ్య‌కు మెజారిటీ తగ్గుతూ రావ‌డంతో ఫ‌లితంపై ఉత్కంఠ ఏర్ప‌డింది. దీంతో, త‌న ఓట‌మి ఖాయ‌మ‌ని ఇంటికి వెళ్లిపోయిన ప్రహ్లాద్ తిరిగి కౌంటింగ్ కేంద్రానికి వచ్చారు. ఎట్ట‌కేల‌కు సుమారు 4 వేల ఓట్ల మెజారిటీతో సౌమ్యా రెడ్డి విజయం సాధించడంతో కాంగ్రెస్ శ్రేణులు ఊపిరి పీల్చుకున్నాయి. సౌమ్యారెడ్డికి 54,045 ఓట్లు రాగా, ప్రహ్లాద్ కు 50,270 ఓట్లు వచ్చాయి. ఈ గెలుపుతో కర్ణాటకలో కాంగ్రెస్ ఖాతాలో మ‌రో విజ‌యం చేరింది.