Begin typing your search above and press return to search.

అనూహ్య ప‌రిణామం: సీఎంగా కుమార‌స్వామి!

By:  Tupaki Desk   |   15 May 2018 9:09 AM GMT
అనూహ్య ప‌రిణామం:  సీఎంగా కుమార‌స్వామి!
X
ఏమైనా స‌రే.. క‌ర్ణాట‌క పీఠం బీజేపీకి ద‌క్క‌కూడ‌ద‌న్న‌ట్లుగా కాంగ్రెస్ వ్య‌వ‌హ‌రిస్తోంది. క‌ర్ణాట‌క ఫ‌లితాలు వెలువ‌డుతున్న వేళ‌.. అనూహ్య ప‌రిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవ‌స‌ర‌మైన‌న్ని సీట్లు బీజేపీ ఖాతాలో ప‌డిన‌ట్లుగా క‌నిపించిన‌ప్ప‌టికీ.. అనూహ్యంగా కొన్ని సీట్లు.. ఓట్ల లెక్కింపు చివ‌రి రౌండ్ల‌కు వ‌చ్చేస‌రికి కాంగ్రెస్ ఖాతాలోకి వెళ్లిపోవ‌టంతో హంగ్ వాతావ‌ర‌ణం ఏర్ప‌డుతుంది.

మ‌ధ్యాహ్నం 2.30 గంట‌ల స‌మ‌యానికి బీజేపీ 80 స్థానాల్లో అధికారికంగా గెల‌వ‌గా.. మ‌రో 23 స్థానాల్లో అధిక్య‌త‌లో ఉన్న‌ట్లుగా ఉంది. తుది రౌండ్లు ఓట్ల లెక్కింపు ముగిసే స‌రికి.. ఏం జ‌రుగుతుంద‌న్న‌ది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. మ‌రోవైపు కాంగ్రెస్ ప‌రిస్థితి నెమ్మ‌దిగా పుంజుకుంటోంది. అధికారికంగా ఆ పార్టీ 50 స్థానాల్లో విజ‌యం సాధించిన‌ట్లుగా ప్ర‌క‌టించారు. మ‌రో 29 స్థానాల్లో ఆ పార్టీ అధిక్య‌త కొన‌సాగుతోంది.

మ‌ధ్యాహ్నం 12 గంట‌ల వ‌ర‌కూ 115 స్థానాల్లో బీజేపీ అధిక్య‌త‌లో ఉన్న‌ట్లు లెక్క‌లు తేల‌గా.. కేవ‌లం రెండున్న‌ర గంట‌ల వ్య‌వ‌ధిలో పార్టీ చేతి నుంచి 12 స్థానాలు చేజారిపోవ‌టంతో ఒక్క‌సారిగా స‌మీక‌ర‌ణాల్లో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఎన్నిక‌ల ఫ‌లితాలు వెలువ‌డుతున్న‌ప్ప‌టి నుంచి కింగ్ మేక‌ర్ గా భావించిన జేడీఎస్‌.. ఒక ద‌శ‌లో ఆ పార్టీ అవ‌స‌ర‌మే లేద‌న్న‌ట్లుగా మారిపోయింది. ఎవ‌రి సాయం మాకు అక్క‌ర్లేదు.. సొంతంగా మా పార్టీనే ప‌వ‌ర్లోకి వ‌స్తుందంటూ బీజేపీ నేత‌లు హ‌డావుడి ప్ర‌క‌ట‌లు వారికి చేటుగా మారిన‌ట్లుగా చెప్పాలి.

రెండున్న‌ర గంట‌ల వ్య‌వ‌ధిలోఫుల్ మెజార్టీ కాస్తా.. ప్ర‌భుత్వ ఏర్పాటుకు దాదాపు ఎనిమిది తొమ్మిది మంది అవ‌స‌ర‌మైన ప‌రిస్థితి ఏర్ప‌డింది. దీంతో.. జేడీఎస్ కు బ‌య‌ట నుంచి మ‌ద్ద‌తు ఇస్తూ ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సాయం చేసేందుకు కాంగ్రెస్ ఓకే చెప్పేసింది. క‌ర్ణాట‌క ఫ‌లితాలు ఎలా ఉన్నా.. త‌మ అవ‌స‌రం ఏమైనా ఉంటుంద‌న్న ఉద్దేశంతో ఒక పూట ముందే బెంగ‌ళూరుకు చేరుకున్న గులాం న‌బీ అజాద్ పావులు క‌ద‌ప‌టం మొద‌లెట్టారు. త‌మ‌కు అధికారం అక్క‌ర్లేద‌ని.. జేడీఎస్ ప్ర‌భుత్వానికి మ‌ద్ద‌తు ఇస్తామ‌ని.. కుమార‌స్వామిని సీఎంగా ప్రమాణ‌స్వీకారం చేసేందుకు త‌మ‌కు ఎలాంటి అభ్యంత‌రం లేద‌ని చెప్పిన ప్ర‌క‌ట‌న‌తో స‌మీక‌ర‌ణాలు వేగంగా మారుతున్నాయి.

త‌మ‌కు స్ప‌ష్ట‌మైన మెజార్టీ ఇచ్చార‌న్న ఉద్దేశంతో విజ‌యోత్స‌వాల్లో మునిగిపోయిన బీజేపీ నేత‌ల‌కు షాకిచ్చేలా ప‌రిణామాలు చోటు చేసుకున్నాయి. 115 స్థానాల్లో త‌మ అభ్య‌ర్థులు గెల‌వ‌టం ఖాయ‌మ‌న్న స్థానం నుంచి.. ఇప్పుడు వారు 103 స్థానాల‌కే ప‌రిమితం కావ‌టంతో సీన్ మారిపోయింది. మేజిక్ మార్క్‌కు కాస్త దూరంలో బీజేపీ జైత్ర‌యాత్ర ఆగిపోవ‌టంతో.. కాంగ్రెస్ ఒక్క‌సారిగా అలెర్ట్ అయ్యింది. బీజేపీకి అవ‌కాశం ఇవ్వ‌కుండా జేడీఎస్ కు సీఎం ప‌ద‌విని ఆఫ‌ర్ ఇచ్చింది. దీంతో.. కాంగ్రెస్ తో క‌లుద్దామా? వ‌ద్దా? అన్న ఆలోచ‌న‌లో ఉన్న కుమార‌స్వామి.. ఇప్పుడు కీల‌కంగా మారారు. వెతుక్కుంటూ వ‌చ్చిన సీఎం ప‌ద‌విని ఆయ‌న ఓకే చేసే అవకాశం ఉందంటున్నారు. వ‌రుస దెబ్బ‌ల‌తో ఉక్కిరిబిక్కిరి అవుతున్న జేడీఎస్‌.. తానే అధికార‌ప‌క్షంగా అవ‌త‌రించే ఛాన్స్ వ‌స్తే.. ఆ అద్భుత అవ‌కాశాన్ని వ‌దులుకునేది లేదు. దీంతో.. క‌ర్ణాట‌క రాజ‌కీయం ఒక్క‌సారిగా మారింది. ఏం జ‌రుగుతుంద‌న్న‌ది ఇప్పుడు ఉత్కంట స‌ర్వ‌త్రా వ్య‌క్త‌మ‌వుతోంది.