బీజేపీకి సోనియా భారీ బెబ్బ కొడుతున్నారుగా!

Sat Aug 12 2017 16:00:07 GMT+0530 (IST)

కేంద్రంలో తమకు తిరుగులేదని భావిస్తున్న బీజేపీకి సెగ తగలనుందా?  నియంతృత్వ ధోరణులతో విపక్షాలను ఏమాత్రమూ లెక్కచేయని ప్రధాని నరేంద్ర మోదీ బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాలకు గట్టి ఎదురు దెబ్బ తగలనుందా? ఆ మేరకు అన్ని విపక్షాలూ స్కెచ్‌కు సిద్ధమయ్యాయా?  దీనికి కాంగ్రెస్ అధినేత్రి సోనియా రంగం సిద్ధం చేస్తున్నారా? అంటే ఔననే సమాధానమే వస్తోంది. ఇటీవల కాలంలో కేంద్రంలో బీజేపీ సహా గుజరాత్ లో అధికార పక్షంగా ఉన్న బీజేపీ తమ ఇష్టానుసారంగా పాలన సాగిస్తున్నాయని మిగిలిన పక్షాలను లెక్క చేయడం లేదని విపక్షాలు గత కొన్నాళ్లుగా ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. దీనికితోడు విపక్షాలను పూచిక పుల్లలాగా ప్రధాని నరేంద్ర మోడీ తీసిపారేస్తున్న విషయమూ కొత్తకాదు.

అంది వచ్చిన ప్రతి సందర్భంలోనూ విపక్షాలపై మోదీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. ముఖ్యంగా గాంధీల కుటుంబాన్ని ఆయన టార్గెట్ చేసుకుంటూనే ఉన్నారు. ఇటీవల బిహార్ లో అధికారంలో ఉన్న మహాఘట బంధన్ ను మోడీ తోసిపుచ్చి తన కనుసన్నల్లో అడే సీఎం నితీశ్ తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. దీంతో ఇప్పుడు ఉత్తరాదిలోని అన్ని పక్షాలూ ప్రధాని మోదీ సహా బీజేపీపై కారాలు మిరియాలు నూరుతున్నాయి. మోదీ ఇష్టానుసారం సాగుతున్నపాలనకు చెక్ పెట్టాలని నిర్ణయించాయి. ముఖ్యంగా బిహార్ లో తన పార్టీకి 80 స్థానాలు ఉండి కూడా బీజేపీ నిర్వాకంతో విపక్షానికి పరిమితం అయిపోయిన లాలూ అయితే మరింతగా రగిలిపోతున్నారు.

ఈ క్రమంలోనే లాలూ  బీజేపీకి వ్యతిరేకంగా బిహార్ లో పెద్ద ఎత్తున సమరానికి సిద్ధమవుతున్నారు. ఈ నెల 27న బిహార్ రాజధాని పాట్నాలో బీజేపీకి వ్యతిరేకంగా ఆయన భారీ ర్యాలీకి తెరదీశారు. దీని ద్వారా బీజేపీని కడిగేయాలని లాలూ నిర్ణయించారు. ఇక ఇదే అదునుగా కాంగ్రెస్ కూడా బీజేపీపైకి ఎక్కేయాలని నిర్ణయించింది. ముఖ్యంగా గుజరాత్ లో గిరిజనులపై దాడులను నిరసిస్తూ భారీ ర్యాలీ చేపట్టాలని నిర్ణయించింది. దీనికి అన్ని విపక్షాలను కూడగట్టి బీజేపీపై పోరు చేయాలని డిసైడ్ అయింది. సెప్టెంబర్ 1న గుజరాత్ లో సత్యాగ్రహ ర్యాలీ పేరుతో భారీ ర్యాలీ నిర్వహించి బీజేపీ తమ సత్తా చాటాలని కాంగ్రెస్ డిసైడ్ అయింది.

దీనిని స్వయంగా కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ భుజాలకు ఎత్తుకోవడం గమనార్హం. ఈ ఏడాది చివర్లో గుజరాత్ లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలోఈ ర్యాలీ ద్వారా ప్రజల్లోకి వెళ్లేందుకు కాంగ్రెస్ యత్నిస్తోంది. ఈ నేపథ్యంలోనే గుజరాత్ లో బీజేపీకి గట్టి బుద్ధి చెప్పాలని తద్వారా అధికారం కైవసం చేసుకునే స్థాయికి ఎదగాలని కాంగ్రెస్ స్కెచ్ సిద్ధం చేసింది. ఇదే వర్కవుట్ అయితే.. బీజేపీకి ఇబ్బందేనని అంటున్నారు విశ్లేషకులు. మరి దీనిని ఎదుర్కొనేందుకు మోదీషాల ద్వయం ఎలా ముందుకు వెళ్తుందో చూడాలి.