Begin typing your search above and press return to search.

మోడీ పై సోనియ‌మ్మ డైరెక్ట్ ఎటాక్‌

By:  Tupaki Desk   |   3 Aug 2015 10:01 AM GMT
మోడీ పై సోనియ‌మ్మ డైరెక్ట్ ఎటాక్‌
X
మొహ‌మాటం ప‌క్క‌న ప‌డేశారు. ప్ర‌భుత్వ తీరును ప‌రోక్ష వ్యాఖ్య‌ల‌తో చురక‌లు అంటించే ధోర‌ణిని వ‌దిలేసిన కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ.. ప్ర‌ధాన‌మంత్రి మోడీపై డైరెక్ట్ అటాక్ కు దిగారు. మోడీ స‌ర్కారు తీరుపై తీవ్ర ఆగ్ర‌హాన్ని ప్ర‌ద‌ర్శించిన ఆమె.. మ‌న్ కీ బాత్ చాంఫియ‌న్ గా వ్య‌వ‌హ‌రిస్తున్న మోడీ.. త‌న మంత్రి వ‌ర్గంలోని మంత్రులు.. త‌మ పార్టీకి చెందిన ముఖ్య‌మంత్రుల విష‌యంలో మాత్రం స్పందించ‌కుండా మౌన వ‌త్రం వ‌హిస్తున్నారంటూ మండిప‌డ్డారు.

పార్ల‌మెంటు స‌జావుగా జ‌రిగేందుకు విప‌క్షాలు స‌హ‌క‌రించాల‌న్న ప్ర‌ధాని మోడీ మాట‌ను నిర్వ‌ర్ధంగా తోసిపుచ్చిన ఆమె.. దేశంలో పాల‌న స్తంభించిపోయింద‌ని.. అభివృద్ధి ఆగిపోయింద‌ని.. ఎన్నిక‌ల స‌మ‌యంలో ఇచ్చిన హామీల అమ‌లును పూర్తిగా విస్మ‌రిస్తున్నారంటూ విరుచుకుప‌డ్డారు.

పాత ప‌థ‌కాల‌కు కొత్త రంగులు అద్ద‌టంలో మోడీ ఘ‌న‌త వ‌హించార‌ని.. ఆ విష‌యంలో ఆయ‌న నిపుణుడైన సేల్స్ మెన్ గా.. తెలివైన న్యూస్ మేనేజ‌ర్ గా.. ప‌త్రిక‌ల్లో హెడ్ లైన్ల‌లో స్థానం సంపాదించే వ్య‌క్తిగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌న్నారు. పార్ల‌మెంటు స‌మావేశాల ప్ర‌తిష్టంభ‌న‌కు బీజేపీ మొండివైఖ‌రే కార‌ణ‌మ‌ని ఆరోపించిన సోనియా..విదేశాంగ మంత్రి సుష్మా స్వ‌రాజ్ అధికార దుర్వినియోగానికి పాల్ప‌డిన‌ట్లు ఆధారాలు ఉన్నాయ‌ని.. అయినా చ‌ర్య‌లు తీసుకోవ‌టంలో విఫ‌ల‌మ‌వుతున్నార‌న్నారు.

యూపీఏ హ‌యాంలో ఏదైనా మంత్రిపై ఆరోప‌ణ వ‌స్తే.. ముందు రాజీనామా త‌ర్వాతే చ‌ర్చ అన్న విధానాన్ని బీజేపీ అనుస‌రించింద‌ని.. తాము కూడా ఇప్పుడు అదే విధానాన్ని అనుస‌రిస్తామ‌ని సోనియా తేల్చి చెప్పారు. మొత్తంగా తాము డిమాండ్ చేసిన‌ట్లుగా ల‌లిత్‌మోడీ వ్య‌వ‌హారంలో ఆరోప‌ణ‌లు వ‌చ్చిన మంత్రుల రాజీనామాలు చేసే వ‌ర‌కు వెన‌క్కి త‌గ్గ‌మ‌న్న విష‌యాన్ని తేల్చి చెప్పారు.

పార్ల‌మెంటులో విప‌క్షాలు స్తంభింప‌చేయ‌టంతో మ‌ధ్యాహ్నం వ‌ర‌కూ స‌భ వాయిదా ప‌డిన విష‌యం తెలిసిందే. పార్ల‌మెంటు స‌జావుగా న‌డిచేందుకు వీలుగా.. కేంద్ర‌మంత్రి వెంక‌య్య‌నాయుడి నేతృత్వంలో అఖిల‌ప‌క్ష స‌మావేశాన్ని నిర్వ‌హిస్తున్నారు. మ‌రి.. విప‌క్షాల్ని వెంక‌య్య ఏ మేర‌కు బుజ్జ‌గిస్తారో చూడాలి.