Begin typing your search above and press return to search.

నంద్యాల‌లో ముక్కోణ‌పు పోటీనేన‌ట‌!

By:  Tupaki Desk   |   27 Jun 2017 10:51 AM GMT
నంద్యాల‌లో ముక్కోణ‌పు పోటీనేన‌ట‌!
X
తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు క‌ర్నూలు జిల్లా నంద్యాల అసెంబ్లీ స్థానానికి జ‌ర‌గ‌నున్న ఉప ఎన్నిక‌పైనే పెద్ద చ‌ర్చ జ‌రుగుతోంది. 2014 ఎన్నిక‌ల్లో వైసీపీ అభ్య‌ర్థిగా బ‌రిలోకి దిగిన భూమా నాగిరెడ్డి... త‌న స‌మీప ప్ర‌త్య‌ర్థి, టీడీపీ అభ్య‌ర్థి శిల్పా మోహ‌న్ రెడ్డిపై ఘ‌న విజ‌యం సాధించారు. అయితే వైసీపీ ప్ర‌తిప‌క్షంలో కూర్చోవ‌డం, ఏ ఒక్క‌రూ ఊహించ‌ని విధంగా టీడీపీకి అధికారం ద‌క్క‌డంతో... అధికార పార్టీ చేప‌ట్టిన ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్‌ కు భూమా లొంగిపోయారు. నంద్యాల ఎమ్మెల్యేగా ఉన్న తానే కాకుండా ఆళ్ల‌గ‌డ్డ ఎమ్మెల్యేగా ఉన్న త‌న కూతురు భూమా అఖిల‌ప్రియ‌ను తీసుకుని ఆయ‌న టీడీపీలో చేరిపోయారు.

అయితే అనుకోని ప‌రిణామాల‌తో భూమా గుండెపోటు కార‌ణంగా హ‌ఠాన్మ‌ర‌ణం చెందారు. దీంతో నంద్యాల స్థానానికి ఉప ఎన్నిక అనివార్య‌మైంది. మారిన రాజ‌కీయ ప‌రిణామాల నేప‌థ్యంలో టీడీపీలో త‌న‌కు ఏమాత్రం ప్రాధాన్యం ద‌క్క‌డం లేద‌న్న భావ‌న‌తో శిల్పా మోహ‌న్ రెడ్డి ఇటీవ‌లే వైసీపీలో చేరారు. అంటే 2014 ఎన్నిక‌ల స‌మ‌యంలో టీడీపీలో ఉన్న‌వారు వైసీపీలోకి - వైసీపీలో ఉన్న‌వారు టీడీపీలోకి చేరిపోయారన్న‌మాట‌. నంద్యాల అసెంబ్లీకి ఇంకా ఉప ఎన్నిక షెడ్యూల్ విడుద‌ల కాలేదు. అయితే ఏ క్ష‌ణాన్నైనా ఉప ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ వ‌స్తుంద‌న్న భావ‌న‌తో అటు టీడీపీతో పాటు ఇటు వైసీపీ కూడా త‌మ త‌మ అభ్య‌ర్థుల‌ను ఖరారు చేశాయి. టీడీపీ త‌ర‌ఫున భూమా నాగిరెడ్డి సోద‌రుడు శేఖర్ రెడ్డి కుమారుడు భూమా బ్ర‌హ్మానంద‌రెడ్డి - వైసీపీ త‌ర‌ఫున శిల్పా మోహ‌న్ రెడ్డి బ‌రిలోకి దిగేశారు.

ఈ ఉప ఎన్నిక‌లో ఈ రెండు పార్టీల మ‌ధ్యే ప్ర‌ధానంగా పోటీ నెల‌కొంది. గెలుపెవ‌రిదైనా ఇరు పార్టీల మ‌ధ్య హోరాహోరీ పోరు త‌ప్ప‌ద‌ని విశ్లేష‌ణ‌లు వెలువ‌డుతున్నాయి. అయితే నిన్న‌టిదాకా ఇరు పార్టీల మ‌ధ్య పోరుగా భావించిన ఈ ఎన్నిక‌... ఇప్పుడు ముక్కోణ‌పు పోటీగా మారిపోయింది. నంద్యాల ఉప ఎన్నిక‌లో ఈ రెండు పార్టీల‌తో పాటు మూడో పార్టీ కూడా బ‌రిలోకి దిగుతుంద‌ట‌. ఆ పార్టీ ఏదంటే... గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్సేన‌ట‌. కాసేప‌టి క్రితం హైద‌రాబాదులో మీడియాతో మాట్లాడిన ఏపీసీసీ చీఫ్ ర‌ఘువీరారెడ్డి ఈ మాట‌ను చెప్పేశారు. నంద్యాల ఉప ఎన్నిక‌లో త‌మ పార్టీ కూడా పోటీ చేస్తుంద‌ని ఆయ‌న సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. నంద్యాల బ‌రిలోకి దిగే కాంగ్రెస్ పార్టీని ఇంకా ఖ‌రారు చేయ‌లేద‌ని చెప్పిన ఆయ‌న‌... త‌మ పార్టీ త‌ర‌ఫున అభ్య‌ర్థి త‌ప్ప‌నిస‌రిగా పోటీ చేస్తార‌ని చెప్పారు. వెర‌సి నంద్యాల ఉప ఎన్నికలో ముక్కోణ పోటీ త‌ప్ప‌ద‌న్న మాట‌.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/