Begin typing your search above and press return to search.

కాంగ్రెస్ మాస్టర్ ప్లాన్.. టీఆర్ ఎస్ లో గుబులు

By:  Tupaki Desk   |   10 Sep 2018 6:53 AM GMT
కాంగ్రెస్ మాస్టర్ ప్లాన్.. టీఆర్ ఎస్ లో గుబులు
X
తెలంగాణలో రాజకీయ వేడి రాజుకుంది.. లోక్‌ సభకు జరిగే ఎన్నికల కంటే ముందుగానే ఎన్నికలు నిర్వహిస్తే ప్రయోజనాలు ఎక్కువ ఉంటాయని ఆశించిన అపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈనెల 6న అసెంబ్లీని రద్దు చేశారు. అసెంబ్లీ రద్దుకు తీర్మానం చేసి అదే రోజున తమ పార్టీ అభ్యర్థుల లిస్టును కూడా విడుదల చేశారు. దీంతో కాంగ్రెస్ లో ఒత్తిడి పెరిగిపోయింది. వచ్చే ఎన్నికల్లో టీఆర్ ఎస్ ను ఓడించేందుకు మహాకూటమికి కాంగ్రెస్ రంగం సిద్ధం చేస్తోంది. టీడీపీ - సీపీఐ - తెలంగాణ జనసమితితో పాటు తాజాగా సీపీఎంను కలిపి టీఆర్ ఎస్ ను ధీటుగా ఎదుర్కొనేందుకు ప్లాన్ చేస్తోంది. కాంగ్రెస్ సూచన మేరకు ఆదివారం టీడీపీ - సీపీఐ నేతలు కలిసి ఓ అవగాహనకు వచ్చారు. ఈ పార్టీలతో పొత్తుతో కాంగ్రెస్ పోటీచేసే స్థానాలు తగ్గే అవకాశాలున్నప్పటికీ టీఆర్ ఎస్ ను గద్దెదింపాలన్న ఏకైక లక్ష్యంతో కాంగ్రెస్ ముందుడుగు వేస్తుండడం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.

8 నెలల ముందు కేసీఆర్‌ అసెంబ్లీ రద్దు చేయడంపై రాష్ట్ర ప్రజలతో పాటు ప్రతిపక్షాలు షాక్‌ కు గురయ్యాయి. దీంతో అప్పటి వరకు సాదాసీదా ఉన్న ప్రతిపక్ష పార్టీలు దూకుడు పెంచాయి. ఇందులో ప్రధానంగా కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల కోసం కసరత్తు ప్రారంభించింది. అందరికంటే ముందుగానే టీఆర్‌ ఎస్‌ అభ్యర్థుల ప్రకటన చేయడంతో ఇప్పుడు కాంగ్రెస్‌ లో ఒత్తిడి పెరిగింది. ఆశావహులంతా రాష్ట్ర నేతలపై టికెట్‌ కోసం ఒత్తిడి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ మరింత ఆలస్యం చేయడంతో ఆందోళనలు పార్టీ నాయకుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. టీఆర్ఎస్ నుంచి డీఎస్ తిరిగి కాంగ్రెస్ లోకి రాబోతుండగా.. కాంగ్రెస్ నుంచి సురేష్ రెడ్డిని లాగేసుకొని టీఆర్ ఎస్ లెక్క సరిచేసింది. ఇక టీఆర్ ఎస్ పై తిరుగుబాటు చేసి కొండా దంపతులను ఈనెల 12న కాంగ్రెస్ లో చేర్చుకునేందుకు రంగం సిద్ధమైంది. వీరే కాదు.. టీఆర్ ఎస్ లో టికెట్లు దక్కని అసంతృప్తులతో పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ చర్చలు జరుపుతూ వారిని కాంగ్రెస్ లోకి తెచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ పరిణామాలు గులాబీ శిబిరంలో ఆందోళనకు కారణమవుతున్నాయి.

కేసీఆర్‌ ప్రవేశపెట్టిన కొన్ని పథకాల్లో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని భావిస్తున్న కాంగ్రెస్‌.. అదే అస్త్రంగా విమర్శలు చేస్తూ ప్రచారం చేయడానికి సిద్ధమవుతున్నారు. అలాగే టీఆర్‌ ఎస్‌ ప్రకటించిన అభ్యర్థుల్లో వ్యతిరేకత ఉన్న చోట ఎలాగైనా చేజిక్కించుకోవడానికే టీఆర్ ఎస్ రెబల్ అభ్యర్థులను చేర్చుకోవడంపై పరిశీలిస్తోంది. ముఖ్యంగా రాజ్యసభ సభ్యుడు డీఎస్ - ఎమ్మెల్సీ భూపతిరెడ్డి- మాజీ ఎమ్మెల్యేలు ఆకుల రాజేందర్ - నందీశ్వర్ గౌడ్ - మాజీ ఎంపీ రాథోడ్ రమేష్ లను ఈ వారంలోనే కాంగ్రెస్ లో చేర్చుకోవడానికి చర్చలు జరుపుతున్నారు.

రెండు స్థానాలు మినహా 105నియోజకవర్గాలకు టీఆర్‌ ఎస్‌ అభ్యర్థులను ప్రకటించింది. మిగతా స్థానాల్లో కొన్ని ఆరోపణలు రావడంతో వాటిని సస్పెన్స్‌ లో పెట్టింది. కొన్ని నియోజకవర్గాలలో టీఆర్ ఎస్ టికెట్‌ ఆశిస్తుందని భావించి భంగపడ్డవారు సైతం కాంగ్రెస్‌ వైపే చూస్తున్నారు. ఈ అవకాశాన్ని కాంగ్రెస్‌ ఎలాగైనా వదులుకోవద్దని చూస్తోంది. అయితే అంతర్గత కుమ్ములాటలు ఉన్న కాంగ్రెస్‌ లో అభ్యర్థులను ప్రకటించిన తరువాత జరిగే పరిణామాలతో ఆ పార్టీ పరిస్థితి తెలిసే అవకాశం ఉంది. ఐకమత్యంగా ఉంటేనే కాంగ్రెస్‌ ను నెగ్గుకురావచ్చని చెబుతున్న అధిష్టానం ఏమేరకు కలిసి వస్తారో చూడాలి.. ఇలా టీఆర్ ఎస్ అసంతృప్తులను చేరదీసి వారికి టిక్కెట్లు ఇవ్వడంపై కాంగ్రెస్ దృష్టిపెట్టింది. కాంగ్రెస్ వ్యూహాలు - కదలికపై టీఆర్ ఎస్ దృష్టి పెట్టి ప్రణాళికలు రచిస్తున్నట్టు సమాచారం.