ఎంఐఎం మద్దతు కోసం కాంగ్రెస్ తహతహ!

Mon Dec 10 2018 13:00:29 GMT+0530 (IST)

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల భవితవ్యం మంగళవారం తేలిపోనుంది. ఎవరెవరు అసెంబ్లీకి వెళ్తారు? ఏ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది? ప‌్రజాతీర్పుతో ఎవరెవరు ఖంగుతింటారు? అనే విషయాలపై దాదాపు మరో 24 గంటల్లో స్పష్టత రానుంది. మళ్లీ టీఆర్ ఎస్ ప్రభుత్వ ఏర్పాటు ఖాయమని పలు జాతీయ సంస్థల ఎగ్జిట్ పోల్స్ తేల్చినప్పటికీ.. కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రజా కూటమి మాత్రం తమ విజయావకాశాలపై ధీమాతోనే ఉంది.ఈ నేపథ్యంలోనే తెలంగాణలో సమీకరణాలపై కాంగ్రెస్ దృష్టిసారించింది. మ్యాజిక్ ఫిగర్ ను చేరుకుంటే సరేసరి. ఎంచక్కా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవచ్చు. సొంతంగా మెజారిటీ స్థానాలు దక్కించుకోకపోయినా.. టీడీపీ - సీపీఐ - టీజేఎస్ ల సహకారంతో ప్రభుత్వ ఏర్పాటు అవకాశం దక్కినా పర్లేదు. ఒకవేళ కూటమి సీట్లు అన్నీ కలిపినా మ్యాజిక్ ఫిగర్ కు చేరుకోకపోతే ఎలా? అనే దానిపై కాంగ్రెస్ పెద్దలు ఇప్పుడు సమాలోచనలు చేస్తున్నారు. ఇతరుల మద్దతు తీసుకొనైనా సరే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు.

ఈ ప్రయత్నాల్లో భాగంగానే కాంగ్రెస్ తన పాత మిత్రపక్షం ఎంఐఎంతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి ఈ ఎన్నికల్లో టీఆర్ ఎస్ కు ఎఐఎం మద్దతు ప్రకటించింది. ఆదివారం కూడా గులాబీ దళపతి కేసీఆర్ కు మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఫోన్ చేశారు. మళ్లీ మీరే సీఎం కాబోతున్నారంటూ ఆయన్ను అభినందించారు.

ఇంత జరుగుతున్నా కాంగ్రెస్ మాత్రం ఆశలు వదులుకోవట్లేదు. ఎలాగోలా ఎంఐఎంను బుజ్జగించి తమతో కలిసి నడిచేలా ఒప్పించాలని చూస్తోంది. ఈ దిశగా కాంగ్రెస్ పెద్ద ఒకరు అసదుద్దీన్ తో మాట్లాడినట్లు తెలిసింది. మరి ఫలితాలు వచ్చాక మజ్లిస్ ఎలా వ్యవహరిస్తుందో చూడాలి.

తమ పార్టీలో టికెట్ దక్కకపోవడంతో స్వతంత్రులుగా పోటీ చేసిన - ఇతర పార్టీల నుంచి బరిలో దిగిన రెబల్ అభ్యర్థులను కూడా తిరిగి తమతో చేర్చుకునేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. వారి అండ లభిస్తే ప్రభుత్వ ఏర్పాటు పెద్ద సమస్య కాబోదని ఆ పార్టీ భావిస్తోందట. అందుకే మల్ రెడ్డి రంగారెడ్డి(ఇబ్రహీంపట్నం) వంటి నేతలను బుజ్జగించే ప్రయత్నాలను ఇప్పటికే ప్రారంభించిందట. కాంగ్రెస్ ప్రయత్నాలు ఏమేరకు ఫలిస్తాయో చూడాలి మరి!