Begin typing your search above and press return to search.

ఉండవల్లి - కిరణ్ కోసం కాంగ్రెస్ స్కెచ్

By:  Tupaki Desk   |   22 Jun 2018 6:26 AM GMT
ఉండవల్లి - కిరణ్ కోసం కాంగ్రెస్ స్కెచ్
X
2019 ఎన్నికలకు ఇంకా కొన్ని నెలలు మాత్రమే ఉంది.ఈ నేపథ్యంలోనే అన్ని పార్టీలు కార్యాచరణ ప్రారంభించాయి. ఉమ్మడి రాష్ట్రాన్ని విభజించి కాంగ్రెస్ పార్టీ ఏపీలో నామరూపాలు లేకుండా పోయింది. ఐదేళ్లుగా అస్తిత్వం కోసం ఆరాటపడుతున్నా కూడా దక్కడం లేదు. ఈ నేపథ్యంలో మళ్లీ కాంగ్రెస్ పార్టీకి జవసత్వాలు అందించేందుకు హైకమాండ్ రంగంలోకి దిగింది.

టీడీపీ - వైసీపీ - బీజేపీతో పోల్చుకుంటే కాంగ్రెస్ పార్టీకి బలమైన నాయకులు ఉండేవారు. రాష్ట్ర విభజనతో వారంతా టీడీపీ - వైసీపీ - బీజేపీలో చేరిపోయారు. కానీ అక్కడా సరైన ప్రాధాన్యం దక్కకపోవడంతో అసంతృప్తిగా ఉన్నారు. ఆనం రామనారాయణ రెడ్డి - పురంధేశ్వరీ - కావూరి సాంబశివరావు తదితరులు ఇతర పార్టీల్లో ఇమడలేక.. బయటకు రాలేక సతమతమవుతున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ మళ్లీ ఈ పెద్దలను ఒక్కటి చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. అసంతృప్తులను ఆహ్వానించి కాంగ్రెస్ ను బలోపేతం చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం అగ్రనేతలను రంగంలోకి దించింది.

ఆంధ్రప్రదేశ్ ఏఐసీసీ ఇన్ చార్జి ఉమెన్ చాందీ ఈ మేరకు చొరవ తీసుకున్నారు. తాజాగా ఆయన కేంద్ర మాజీ మంత్రి ఎంఎం పల్లంరాజును రంగంలోకి దించారు. ఉమ్మడి ఏపీ విభజనను తీవ్రంగా వ్యతిరేకించి విడిపోవడంతో రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకున్న మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని ఎలాగైనా సరే మళ్లీ కాంగ్రెస్ పార్టీలోకి తీసుకువచ్చే బాధ్యతను పల్లంరాజుపై పెట్టాడు. ప్రజల్లో ఇప్పటికీ కిరణ్ కుమార్ రెడ్డి పై విశ్వసనీయత ఉందని.. దాన్ని కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మార్చేందుకు పార్టీలోకి రప్పించాలని ఆదేశించిందట..

ఇక అదే సమయంలో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ను కూడా కాంగ్రెస్ లోకి తిరిగి రప్పించే బాధ్యతను రాజ్యసభ ఎంపీ కేవీపీ రాంచంద్రరావు కు కాంగ్రెస్ అధిష్టానం అప్పజెప్పిందట.. ఉండవల్లి వస్తే కాంగ్రెస్ కు కొండంత బలం అని అధిష్టానం భావిస్తోంది.

ఇక వీరే కాక మరికొంత మంది అగ్రనేతల కోసం కూడా కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తోంది. కేంద్ర మాజీ మంత్రులు కే సాయిప్రతాప్ - కావూరి సాంబశివరావు లపై కూడా ప్రత్యేక దృష్టిసారించి ఆహ్వానిస్తే వారు కూడా తిరిగి కాంగ్రెస్ గూటికి రావచ్చని భావిస్తున్నారు.

కాంగ్రెస్ అధిష్టానం పెద్దలు సీరియస్ గా ప్రయత్నిస్తే ఖచ్చితంగా పార్టీని వీడిని నేతలంతా తిరిగి వస్తారని.. మళ్లీ కాంగ్రెస్ కు ఏపీ లో పూర్వవైభవం తీసుకురావచ్చని కాంగ్రెస్ అధిష్టానం ఆశాభావంతో ఉంది. దీనికి సదురు కాంగ్రెస్ సీనియర్లు స్పందిస్తారా లేదా అన్నది చూడాలి మరి.