Begin typing your search above and press return to search.

జ‌న‌సేన‌ లో చేరే కాంగ్రెస్ నేత‌ల‌కు చిరు రాయ‌భార‌మా?

By:  Tupaki Desk   |   6 Nov 2018 1:30 AM GMT
జ‌న‌సేన‌ లో చేరే కాంగ్రెస్ నేత‌ల‌కు చిరు రాయ‌భార‌మా?
X
సినీన‌టుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్రారంభించిన జ‌న‌సేన పార్టీలో కీల‌క మ‌లుపులు చోటుచేసుకోనున్నాయా? మెగాస్టార్‌ చిరంజీవి కాంగ్రెస్‌ పార్టీకి గుడ్‌ బై చెప్పనున్నారా? సోదరుడు పవన్‌ కళ్యాణ్‌ ఏర్పాటు చేసిన జనసేన పార్టీలో ఆయన చేరనున్నారా? అవుననే అంటున్నారు మెగా ఫ్యామిలీ అభిమానులు తాజాగా జ‌రుగుతున్న ప‌రిణామాల ప్రకారం మెగా ఫ్యామిలీ అంతా జ‌న‌సేన కోసం శ్ర‌మించే వాతావ‌ర‌ణం క‌నిపిస్తోంది. ఇంత‌క‌ముందుకు జ‌రిగిన ప‌రిణామాలు ఈ భావ‌న‌కు ఊతం ఇస్తుంటే... తాజాగా చిరంజీవి కేంద్రంగా కొంద‌రు సీనియర్ నేత‌లు త‌మ రాజ‌కీయ భ‌విష్య‌త్‌ ను వెతుక్కుంటుండ‌టం ఆస‌క్తిక‌రంగా మారింది.

ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీ సారథ్యంలోని బీజేపీని ఓడించడమే లక్ష్యం అంటూ టీడీపీ అధ్య‌క్షుడు నారా చంద్ర‌బాబు నాయుడు టీడీపీ వ్య‌వ‌స్థాప‌క విలువ‌ల‌ను తుంగ‌లో తొక్కి మ‌రీ కాంగ్రెస్ పార్టీతో దోస్తీ కట్టారు. దీనిపై రాజ‌కీయ వ‌ర్గాలు దుమ్మెత్తి పోశాయి. మ‌రోవైపు రాహుల్ గాంధీ - చంద్ర‌బాబు చర్చల తరువాత‌ కాంగ్రెస్ పార్టీలో ప్రకంపనలు మొదలయ్యాయి. వారి కలయికను నిరసిస్తూ.. కాంగ్రెస్ నేతలు ఒక్కొక్కరుగా ఆ పార్టీని వీడుతున్నారు. కాంగ్రెస్‌ ను భూస్టాపితం చెయ్యాల‌న్న చంద్ర‌బాబుతో చేయి కలపడాన్ని వారంతా తప్పుపడుతున్నారు. ఆపత్కాలంలో రాష్ట్రంలో పార్టీ వెన్నంటే ఉన్న తమను కనీసం సంప్రదించకుండా.. రాహుల్ చంద్రబాబుతో ఎలా చర్చలు జరుపుతారని వారు ప్రశ్నిస్తున్నారు. అంతేకాకుండా ఇక‌పై క‌లిసి ప‌నిచేస్తామ‌న్న చంద్రబాబు - రాహుల్ ప్రకటనపై వారు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీని వీడిన వారి సంఖ్య రెండు(వట్టి వసంత్ కుమార్ - సి.రామచంద్రయ్య) అయిన‌ప్ప‌టికీ ఈ సంఖ్య మ‌రింత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి.

ఇదిలాఉండ‌గా... టీడీపీ - కాంగ్రెస్ మైత్రి అవకాశంగా దొరికినట్లయింది. ప్ర‌స్తుతం జనసేన పార్టీలో.. సీనియ‌ర్ లీడ‌ర్స్ ఎవ్వ‌రూ లేక‌పోవ‌డంతో కాంగ్రెస్‌ను వీడుతున్న నేతల దృష్టంతా పవన్ పార్టీపైనే ఉన్నట్లు కనిపిస్తోంది. ఇటీవల కాంగ్రెస్‌‌ కు రాజీనామా చేసిన మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ అనూహ్యంగా జనసేనలో చేరారు. ప్రస్తుతం ఆయన ఆ పార్టీలో కీలక నేతగా వ్యవహరిస్తున్నారు. తాజాగా కాంగ్రెస్ పార్టీని వీడిన వట్టి వసంతకుమార్ - సి.రామచంద్రయ్యలు కూడా మనోహర్ బాటలోనే పయనిస్తారని తెలుస్తోంది. ఇక సి రామ‌చంద్ర‌య్య సైతం జ‌న‌సేనలోకి వ‌చ్చేందుకు సుముఖంగా ఉన్న‌ట్లు తెలుస్తోంది. ప్ర‌జారాజ్యం నుండి ప‌వ‌న్‌ తో స‌న్నిహిత సంబంధాలు ఉన్న నేప‌ద్యంలో రామచంద్రయ్య త్వరలోనే జనసేన పార్టీలో చేరుతారనే ప్రచారం జరుగుతోంది. ప్ర‌జారాజ్యం ర‌థ‌సార‌థి అయిన చిరంజీవి దోస్తీతో ఆయ‌న జ‌న‌సేన‌లో చేర‌వ‌చ్చంటున్నారు. స్థూలంగా కాంగ్రెస్ నుంచి సీనియ‌ర్లు ఖాళీ అయ్యేందుకు చిరు కార‌ణం కానున్నార‌ని ప‌లువురు వ్యాఖ్యానిస్తున్నారు.