వైఎస్ లాంటి మహానాయకుడే రావాలా?

Fri Apr 12 2019 11:44:08 GMT+0530 (IST)

దేశంలో అత్యంత సీనియర్ పార్టీ కాంగ్రెస్ కు తెలుగు రాష్ట్రాల్లో గడ్డుపరిస్థితి ఏర్పడింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో హవా సాగిన ఆ పార్టీకి ఇప్పుడు కార్యకర్తలు కూడా కరువయ్యారనేది వాస్తవం. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత జరిగిన ఎన్నికల్లో తెలంగాణను తామే ఇచ్చామని ప్రచారం చేసుకున్నా.. తెలంగాణలో ఆ పార్టీని ప్రజలు ఆదరించలేకపోయారు. ఇటు ఆంధ్రులు తమను అన్యాయంగా విడగొట్టారని చేతి గుర్తువైపు కన్నెత్తి కూడా చూడలేదు దీంతో రెండు రాష్ట్రాల్లోని చేతి పార్టీకి బీటలు వారాయి. అయితే ఈ ఐదేళ్లలో విభజన విషయం ప్రజలు మరిచిపోయి మళ్లీ పార్టీని ఆదరిస్తారని భావించారు స్థానిక నేతలు.కానీ పోలింగ్ తరువాత పరిస్థితి అలాగే ఉందని కొందరు నేతలు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా గురువారం ఏపీలో జరిగిన అసెంబ్లీ - పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ కంటితుడుపు చర్యగానే వ్యవహరించించింది.   ఏపీ ప్రజలు ఎక్కువగా టీడీపీ - వైసీపీ - జనసేనలను మాత్రమే చూశారు. అయితే ఏపీసీసీ నాయకులు ప్రజల్లో తమ పార్టీ చేసే విధానం - ఇచ్చే హామీలను ఏవీ చెప్పలేకపోయారు.

ఏపీ రాష్ట్ర కాంగ్రెస్ ఇన్‌చార్జిగా ఉన్న ఉమెన్‌చాందీ ఇక్కడి పరిస్థితిని ఏ మాత్రం పట్టించుకోలేకపోయారు. ఆయన సొంత రాష్ట్రంలోని పార్లమెంట్ ఎన్నికల బరిలో బిజీగా ఉన్నారు. దీంతో ఏపీసీసీ నాయకులు పంపిన అభ్యర్థుల జాబితాలో ఒక్క పేరు కూడా తీసేయకుండా ఓకే చేశారు. దీంతో దాదాపు అన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ కు సరైన నాయకుడు లేకపోవడంతో కనీస ఓట్లు కూడా పడే అవకాశం లేదనే తెలుస్తోంది.

పార్టీ పరిస్థితిని ముందుగానే గ్రహించిన సీనియర్ నేతలు పెట్టా బేడా సర్దేశారు. కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి - కిల్లి కృపారాణి వంటి వాళ్లు తమ దారి చూసుకొని ఇతర పార్టీల్లో చేశారు. దీంతో పార్టీలో సీనియర్ నాయకులు కరువయ్యారు. గత ఎన్నికల్లో పార్టీని వీడి మళ్లీ ఎన్నికల ముందు రీ ఎంట్రీ ఇచ్చిన మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో కొంత ఉత్సాహం కనిపించినా.. ఆయన సరైన సమయానికి యాక్టివ్ గా లేకపోయారు. అభ్యర్థుల తరుపున కనీసం ప్రచారం కూడా చేయలేకపోయారు. ఇక మెగాస్టార్ చిరంజీవి సినిమాలకే పరిమితమయ్యారు.

దీంతో ఈ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ కు డిపాజిట్లు దక్కేనా..? అనే అనుమానాలు సాగుతున్నాయి. ఒకవేళ అదే రిపీట్ అయితే మాత్రం ఇప్పట్లో పార్టీ కోలుకోవడం చాలా కష్టమేనంటున్నారు విశ్లేషకులు. వైఎస్ లాంటి మహానాయకుడు వస్తే తప్ప ఏపీలో కాంగ్రెస్ చరిత్రపుటల్లోకి ఎక్కే ప్రమాదముందంటున్నారు.