Begin typing your search above and press return to search.

పొన్నాల‌కు డిప్యూటీ సీఎం ప‌ద‌వి?

By:  Tupaki Desk   |   15 Nov 2018 5:53 AM GMT
పొన్నాల‌కు డిప్యూటీ సీఎం ప‌ద‌వి?
X
తెలంగాణ‌లో పీసీసీ మాజీ అధ్య‌క్షుడు - సీనియ‌ర్ నేత పొన్నాల ల‌క్ష్మ‌య్య ప‌రిస్థితి ప్ర‌స్తుతం అగ‌మ్య‌గోచ‌రంగా మారింది. జ‌న‌గామ నియోజ‌క‌వ‌ర్గం నుంచి తాను పోటీ చేయ‌డం ఖాయ‌మ‌ని ఇన్నాళ్లూ ఆయ‌న భావించారు. అయితే, కాంగ్రెస్ ప్ర‌క‌టించిన రెండు జాబితాల్లో ఆయ‌న పేరు లేదు. జ‌న‌గామ ప్ర‌స్తావ‌న కూడా లేదు. మ‌రోవైపు మ‌హాకూట‌మిలో భాగ‌స్వామ్య ప‌క్షంగా ఉన్న‌ కోదండ‌రాం నేతృత్వంలోని తెలంగాణ జ‌న స‌మితి తాము జ‌న‌గామ నుంచి పోటీ చేయ‌నున్న‌ట్లు ఇప్ప‌టికే ప్ర‌క‌టించింది.

దీంతో పొత్తుల్లో భాగంగా తెలంగాణ జ‌న స‌మితికి జ‌న‌గామ టికెట్ ఖాయ‌మైంద‌ని.. పొన్నాల పోటీకి దూరంగా ఉండాల్సిందేన‌ని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీంతో పార్టీపై పొన్నాల గుర్రుగా ఉన్నారు. టికెట్‌ పై హామీ ఆల‌స్య‌మ‌వుతుండ‌టంతో ఇప్ప‌టికే ఆయ‌న ఢిల్లీ వెళ్లి అధిష్ఠానం వ‌ద్ద వాపోయారు. త్వ‌ర‌గా టికెట్ ఖ‌రారు చేయాల‌ని కోరారు. అయిన‌ప్ప‌టికీ కాంగ్రెస్ క‌రుణించ‌లేదు.

పొన్నాల‌కు టికెట్ ద‌క్క‌క‌పోవ‌డంతో జ‌న‌గామ‌లు బుధ‌వారం 13 మంది కాంగ్రెస్ కౌన్సిల‌ర్లు త‌మ ప‌ద‌వుల‌కు రాజీనామా చేశారు. దాదాపు 20 వేల‌మంది కార్య‌క‌ర్త‌లు కాంగ్రెస్ ప్రాథ‌మిక స‌భ్య‌త్వానికి రాజీనామా చేశారు. ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో కాంగ్రెస్ అధిష్ఠానం కాస్త దిగొచ్చిన‌ట్లు తెలుస్తోంది.

మ‌హాకూట‌మి పొత్తుల్లో భాగంగా జ‌న‌గామ టికెట్‌ ను తెలంగాణ జ‌న‌స‌మితి బ‌లంగా కోరుకుంటోంది. కాబ‌ట్టి ఆ పార్టీకే టికెట్ ఇచ్చేలా పొన్నాల‌ను ఒప్పించేందుకు ప్ర‌య‌త్నిస్తోంది. ఎన్నిక‌ల అనంత‌రం ఎమ్మెల్సీని చేస్తామ‌ని ఆయ‌న్ను బుజ్జ‌గిస్తోంది. అంతేకాదు.. మ‌హాకూట‌మి అధికారంలోకి వ‌స్తే డిప్యూటీ సీఎం ప‌ద‌విని కూడా క‌ట్ట‌బెడ‌తామ‌ని హామీ ఇస్తున్న‌ట్లు కూడా స‌మాచారం. అయితే, మ‌హాకూట‌మి గెలిచేదెపుడు, ఆయ‌న సీఎం అయ్యేదెపుడు.. ద‌క్కే ఎమ్మెల్యే సీటు కూడా పాయె అని సోష‌ల్ మీడియా పేలుతున్న సెటైర్ల‌ను పొన్నాల చూశారో ఏమో గాని ప‌క్క పార్టీ వైపు చూస్తున్నారు.

మ‌రోవైపు - పొన్నాల టీఆర్ ఎస్‌ లో చేరుతార‌నే ప్ర‌చారం కూడా జోరుగా సాగుతోంది. ఇప్ప‌టికే హ‌రీశ్‌ రావు పొన్నాల‌తో ట‌చ్‌ లో ఉన్నార‌ని.. కాంగ్రెస్ తుది జాబితాలో టికెట్ ద‌క్క‌క‌పోతే ఆయ‌న కారెక్క‌డం ఖాయ‌మ‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. అయితే - టీఆర్ ఎస్‌ లోకి వెళ్లినా పొన్నాల‌కు జ‌న‌గామ టికెట్ ద‌క్క‌దు. తాజా మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డికి కేసీఆర్ ఇప్ప‌టికే అక్క‌డ టికెట్ ఖ‌రారు చేశారు. కాబట్టి పొన్నాల టీఆర్ ఎస్‌ లోకి వెళ్తార‌నే వార్త‌లు ఊహాగానాలేన‌ని విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.