Begin typing your search above and press return to search.

ఫ్లైట్ ల‌లో తిరుముఖం ప‌ట్టిన కాంగ్రెస్ నేత‌లు!

By:  Tupaki Desk   |   13 Nov 2018 5:04 AM GMT
ఫ్లైట్ ల‌లో తిరుముఖం ప‌ట్టిన కాంగ్రెస్ నేత‌లు!
X
ఊరించి.. ఊరించి.. ఊపిరి బిగ‌ప‌ట్టేలా చేసిన కాంగ్రెస్ పార్టీ ఎట్ట‌కేల‌కు త‌న తొలి అభ్య‌ర్థుల జాబితాను విడుద‌ల చేసింది. మంగ‌ళ‌వారం ఉద‌యం కానీ.. మ‌ధ్యాహ్నం వేళ‌లో గ్రాండ్ గా అభ్య‌ర్థుల ప్ర‌క‌ట‌న వెలువ‌రించాల‌ని భావించిన‌ప్ప‌టికి.. సోమ‌వారం చోటు చేసుకున్న నాట‌కీయ ప‌రిణామాల నేప‌థ్యంలో యుద్ధ ప్రాతిప‌దిక‌న అభ్య‌ర్థుల జాబితాను విడుద‌ల చేయ‌టం తెలిసిందే.

టికెట్ల‌ను ఆశిస్తున్న ప‌లువురు ఆశావాహులు ఢిల్లీలో త‌మ‌కు తోచిన రీతిలో లాబీయింగ్ చేస్తూ.. గ‌డిచిన కొద్ది రోజులుగా హైద‌రాబాద్ టు ఢిల్లీ ష‌టిల్ కొట్టేస్తున్న ప‌రిస్థితి. టికెట్ ప‌క్కా అని తేలిన‌ప్ప‌టికీ.. బీఫారం చేతిలోకి వ‌చ్చే వ‌ర‌కూ ఏమైనా మార్పులు చేర్పులు చోటు చేసుకుంటాయ‌న్న నానుడి కాంగ్రెస్‌ లో ఎక్కువ‌గా వినిపిస్తూ ఉంటుంది. ఈ నేప‌థ్యంలో ఎలాంటి ఛాన్సులు తీసుకోని సీనియ‌ర్లు ప‌లువురు టికెట్ అనౌన్స్ మెంట్ వెలువ‌డే వ‌ర‌కూ ఢిల్లీలోనే తిష్ట వేశారు.

అంద‌రూ ఊహించిన దానికి భిన్నంగా మంగ‌ళ‌వారం కాకుండా సోమ‌వారం రాత్రి వేళ రిలీజ్ చేయాల‌ని నిర్ణ‌యించ‌టంతో ప‌లువురి నిద్ర మ‌త్తు ఎగిరిపోయింది.టికెట్ వ‌చ్చిన వారంతా ఆనందంతో ఉక్కిరిబిక్కిరి కాగా.. టికెట్ల‌ను ఆశిస్తూ.ప్ర‌క‌ట‌న వెలువ‌డ‌ని అభ్య‌ర్థులంతా తీవ్ర నిరాశ‌కు గుర‌య్యారు. తొలి జాబితాలో పెద్ద ఎత్తున అభ్య‌ర్థుల జాబితాను ప్ర‌క‌టించిన నేప‌థ్యంలో.. మిత్ర‌ప‌క్షాలు పోటీ చేసే స్థానాల్ని మిన‌హాయిస్తే.. కాంగ్రెస్ కు చెందిన స్థానాలు త‌క్కువ‌గానే ఉంటాయ‌ని చెప్పాలి.

ఇదిలా ఉంటే.. తొలి జాబితా విడుద‌లైన వెంట‌నే.. ప‌లువురు నేత‌లు త‌మ త‌మ సొంత ప్రాంతాల‌కు వెళ్లేందుకు సిద్ధ‌మ‌య్యారు. టికెట్ల కోసం ప‌డికాపులు కాసిన వారిలో కొంద‌రికి టికెట్లు క‌న్ ఫ‌ర్మ్ కావ‌టంతో వారంతా ఇప్పుడు హుటాహుటిన తిరుగు ప్ర‌యాణానికి సిద్ధ‌మ‌వుతున్నారు. షెడ్యూల్ ప్ర‌కారం టికెట్ల పంపిణీ మంగ‌ళ‌వారం మ‌ధ్యాహ్నం అంచ‌నా వేసుకున్న వారంతా అందుకు త‌గ్గ‌ట్లుగా రిట‌ర్న్ జ‌ర్నీకి ప్లాన్ చేసుకున్నారు.

అనుకోని రీతిలో జాబితా విడుద‌ల కావ‌టంతో.. టికెట్లు పొందిన వారంతా హుటాహుటిన హైద‌రాబాద్‌కు చేరుకోవాల‌ని త‌హ‌త‌హ‌లాడుతున్నారు. ఇందులో భాగంగా విమానం టికెట్ల ధ‌ర‌ల్ని చూసుకోకుండా ఎవ‌రికి వారు బుక్ చేసుకుంటున్న ప‌రిస్థితి.. ఇప్ప‌టికే ప్ర‌చారంలో వెనుక‌బ‌డిపోయామ‌న్న భావ‌న‌లో ఉన్న వారంతా ఇప్పుడు హుటాహుటిన హైద‌రాబాద్ కు చేరుకొని.. అక్క‌డి నుంచి త‌మ నియోజ‌క‌వ‌ర్గాల‌కు వెళ్లాల‌న్న అతృత‌లో ఉండ‌టం క‌నిపిస్తోంది.