టీడీపీ - కాంగ్రెస్ బంధం బలపడుతోందే!

Tue Jun 12 2018 14:00:29 GMT+0530 (IST)

తనకు లాభం చేకూరే పని ఏదయినా ఉంటే దాని కోసం ఎంతవరకు దిగజారడానికయినా చంద్రబాబు నాయుడు రెఢీగా ఉంటాడు. దానికి నిదర్శనం నాలుగేళ్ల సంసారం అనంతరం బీజేపీతో సంబంధాలు తెంచుకోవడం తిరిగి బీజేపీ పార్టీ మీదకు తన పార్టీ నేతలను ఉసిగొల్పడం - జగన్ బీజేపీకి దగ్గరయ్యాడని దుష్ప్రచారం చేయడం. అంతే కాదు 2014 ఎన్నికల్లో అన్యాయంగా రాష్ట్రాన్ని విభజించిందని కాంగ్రెస్ మీద దుమ్మెత్తిపోసిన చంద్రబాబు కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి ప్రమాణ స్వీకారానికి వెళ్లి రాహుల్ గాంధీని ఆలింగనం చేసుకోవడం సోనియాగాంధీకి సలాములు చేయడం చూశాం.వాస్తవంగా ఆంధ్రప్రదేశ్ - తెలంగాణ విభజనలో పార్టీలుగా తెలుగుదేశం పార్టీకి ఎంత పాత్ర ఉందో కాంగ్రెస్ పార్టీకి కూడా అంతే ఉంది. 2008లో లేఖ ఇచ్చి 2009లో టీఆర్ ఎస్ తో జతకట్టిన చంద్రబాబు 2009 నవంబరులో జరిగిన అఖిలపక్ష సమావేశంలో కూడా తెలంగాణ ఇవ్వాలని పట్టుబట్టి డిసెంబరు 9న తెలంగాణ ప్రకటన రాగానే రాజకీయ ప్రయోజనాల కోసం పిల్లిమొగ్గలు వేశాడు. 2014లో అధికారం కోసం బీజేపీతో జతకట్టిన చంద్రబాబు ప్రత్యేకహోదా వద్దని మొదట చెప్పి తీరా ఎన్నికల సమయం రావడంతో ప్యాకేజీ వద్దు హోదా కావాలి అంటూ బీజేపీని దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నాడు.

ఈ నేపథ్యంలో మెల్లిగా చంద్రబాబు కాంగ్రెస్ కు దగ్గర అవుతున్నట్లు కనిపిస్తుంది. మొన్న కర్ణాటకలో రాహుల్ - సోనియాతో వేదిక పంచుకున్న చంద్రబాబుకు తాజాగా రేపు ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ ఇవ్వబోయే ఇఫ్తార్ విందుకు ఆహ్వానం అందింది. దేశంలో మోడీకి వ్యతిరేకంగా పావులు కదుపుతున్న రాహుల్ ములాయం సింగ్ యాదవ్ - శరద్ పవార్ - లాలు ప్రసాద్ యాదవ్ లతో పాటు చంద్రబాబు నాయుడుకు కూడా ఆహ్వానం పంపినట్లు తెలుస్తుంది.

బీజేపీతో తెగదెంపులు చేసుకున్న చంద్రబాబు ఇప్పుడు జాతీయ పార్టీ నీడ కోసం తహతహలాడుతున్నాడు. రేపు జాతీయ స్థాయిలో తనకు కాంగ్రెస్ అండ లేకుంటే ఇబ్బందులు తప్పవని భావించే దగ్గరవుతున్నట్లు తేటతెల్లమవుతుంది. కాంగ్రెస్ పార్టీ మార్కు రాజకీయాలకు నిరసనగా ఎన్టీఆర్ పెట్టిన పార్టీ తెలుగుదేశం. ఇప్పుడు అదే తెలుగుదేశం పార్టీని తన అవసరం కోసం కాంగ్రెస్ కు తాకట్టుపెట్టే దిశగా సాగుతుండడం తెలుగు తమ్ముళ్లకు ఏ మాత్రం రుచించడం లేదని సమాచారం.

రేపు ఢిల్లీకి బాబు వెళతాడా ?  లేదా ? అన్నది తేలితే 2019లో బాబు రాజకీయం మీద మరింత క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. 2004 ఎన్నికలకు ముందు నరేంద్రమోడీ హైదరాబాద్ వస్తే అరెస్టు అని రంకెలేసిన చంద్రబాబు 2014లో అదే మోడీ దయతో ముఖ్యమంత్రి పీఠం ఎక్కి ఇప్పుడు మరో సారి ప్రజా వ్యతిరేకతను తప్పించుకునేందుకు తగువుకు దిగాడు. బద్దశతృవు అయిన కాంగ్రెస్ తో వేదికలు ఎక్కుతున్నాడు తన అవసరం కోసం ఎంతకయినా చంద్రబాబు దిగజారుతాడని స్పష్టమవుతోంది.