Begin typing your search above and press return to search.

'సెటిలర్' తో కేసీఆర్ కు షాకిచ్చిన కాంగ్రెస్..

By:  Tupaki Desk   |   15 Aug 2018 2:30 PM GMT
సెటిలర్ తో కేసీఆర్ కు షాకిచ్చిన కాంగ్రెస్..
X
తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ కు అదో ఆయుధం.. కానీ గద్దెనెక్కాక మాత్రం ఓట్ల కోసం దాన్ని మడతెట్టేశారు.  తాను తిట్టిన వాళ్లనే తర్వాత అక్కున చేర్చుకొని అధికారం కొల్లగొట్టాడు. ఇప్పుడు కాంగ్రెస్ అదే పని చేస్తుండడంతో తూచ్ ఇది నేను ఒప్పుకోనంటున్నాడు కేసీఆర్.. ‘సెటిలర్’ విషయంలో కాంగ్రెస్ తీసుకున్న స్టాండ్ ఇప్పుడు టీఆర్ ఎస్ మైండ్ బ్లాంక్ అయ్యేలా చేస్తోంది.

తాజాగా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పర్యటన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఓ స్టాండ్ తీసుకుంది. సార్వత్రిక ఎన్నికలకు 8 నెలలు మాత్రమే సమయం ఉండడంతో హైదరాబాద్ సహా రంగారెడ్డి చుట్టుపక్కల జిల్లాల్లో విపరీతంగా ఉన్న ఆంధ్రా సెటిలర్లు - ఇతర రాష్ట్రాల ప్రజల ఓటు బ్యాంకు కోసం కాంగ్రెస్ పార్టీ పెద్ద స్కెచ్ వేసింది. రాబోయే ఎన్నికల్లో సెటిలర్లకు టిక్కెట్లు ఇవ్వడమే కాకుండా.. సెటిలర్లకు సంబంధించి కొన్ని కీలక అంశాల్ని మేనిఫెస్టోలో పెడతామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ఇది టీఆర్ ఎస్ కు దిమ్మదిరిగేలా ఉంది.

కేసీఆర్.. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ఆంధ్రోళ్ల ఊసే భరించలేకపోయారు. సెటిలర్లపై పోరాటానికి దిగారు.. ఆంధ్రా వాలా బాగో అని ప్రకటనలు కూడా ఇచ్చేశారు. తెలంగాణ రాష్ట్ర సీఎంగా అయ్యాక కూడా ఆంధ్రా నుంచి వచ్చిన విద్యార్థులకు మెలికలు పెట్టి స్కాలర్ షిప్ ఇవ్వనన్నాడు. కానీ హైకోర్టు మొట్టికాయలు వేయడంతో వెనక్కితగ్గారు. రిజర్వేషన్లు - జోన్ల విషయంలోనూ ఆంధ్రావారికి అవకాశాలు దక్కకుండా చేయాలని చూసినా కోర్టుల్లో చుక్కెదురైంది. దీంతో ఇక ఆ ప్లాన్లన్నీ పక్కనపెట్టేసి  హైదరాబాద్ జీహెచ్ ఎంసీ ఎన్నికల్లో సెటిలర్లు అనే మాటనే పాతరేసి.. ‘అంతా తెలంగాణ వారే’నని టీఆర్ ఎస్ పార్టీ ప్రకటించింది. కాంగ్రెస్ - ఇతర పక్షాలు ఎంత కొట్లాడినా అధికార పార్టీకే సెటిలర్ల మద్దతు లభించింది. దీంతో స్వతహాగానే టీఆర్ ఎస్ జీహెచ్ ఎంసీ పీఠం దక్కించుకుంది.

ఇప్పుడు తాజాగా కాంగ్రెస్ పార్టీ సెటిలర్ల జపం చేస్తోంది. వారికి సీట్లు - మేనిఫెస్టోలో హామీలు ఇస్తోంది. దీంతో టీఆర్ ఎస్ పార్టీకి ఈ పరిణామం ఆందోళనగా మారింది.. టీఆర్ ఎస్ పై ఆది నుంచి సెటిలర్లలో సదాభిప్రాయం లేదు. ఇప్పుడిప్పుడే పరిస్థితులు చక్కబడుతున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ తీసుకున్న ఈ స్టాండ్ తో సెటిలర్లు కాంగ్రెస్ వైపు మళ్లుతారన్న భయం టీఆర్ ఎస్ లో వ్యక్తమవుతోంది. చూడాలి మరి.. సెటిలర్లు మద్దతు  ఎవరికి దక్కుతుందనేది..?