మోడీషాల డౌన్ ఫాల్ స్టార్ట్ అయినట్లేనా?

Thu May 31 2018 15:17:13 GMT+0530 (IST)

అనుమానం నిజమైంది. అంచనాలు తప్పు కావటం లేదు. తన పాలనా తీరుతో ఇప్పటికే మెజార్టీ ప్రజల్ని అసంతృప్తికి గురి చేస్తున్న మోడీపై దేశ వ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమవుతుందన్నది ఎంత నిజమో తాజా ఉప ఎన్నికల ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి.మిత్రపక్షాల్ని పట్టించుకోకుండా.. తమకు మించిన పోటుగాళ్లు ఎవరూ లేరన్నట్లుగా.. రాష్ట్రం ఏదైనా సరే.. ఫలితం తమకు అనుకూలంగా తెచ్చేసుకునే టాలెంట్ తమకుందన్నట్లుగా మాట్లాడే కమలనాథులకు కరెంట్ షాక్ తగిలేలా తాజా ఉప ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలు.. 11 అసెంబ్లీ నియోజకవర్గాల్లో జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు చూసినప్పుడు దేశ వ్యాప్తంగా మోడీ ఎదురుగాలి స్టార్ట్ అయినట్లేనన్న భావన మరింత స్పష్టమవుతోంది.

అన్నింటికి మించి దేశ వ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన కైరానా ఫలితం బీజేపీ నేతల గొంతుల్లో తడి ఆరిపోయేలా చేసిందన్న మాట వినిపిస్తోంది. 2014 సార్వత్రిక ఎన్నికల్లో తిరుగులేని అధిక్యత బీజేపీ సొంతం కావటానికి కారణంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని రెండు లోక్ సభ నియోజకవర్గాలు మినహా మిగిలినవన్నీ కమలం ఖాతాలో పడటమే. అలాంటి.. ఆ మధ్యన జరిగిన గోరక్ పూర్ లోక్ సభ స్థానాన్ని చేజార్చుకున్న బీజేపీ.. తాజాగా బీజేపీ ప్రాతినిధ్యం వహిస్తున్న కైరానా సీటు కూడా విపక్షాల వశం కావటం మోడీషాలతో పాటు.. బీజేపీ అధినాయకత్వానికి ఏ మాత్రం మింగుడుపడనిదిగా మారుతుందని చెప్పక తప్పదు.

అత్యధిక లోక్ సభా స్థానాలు ఉన్న యూపీలో బీజేపీకి ఎదురుగాలి వీస్తే.. మొత్తం ఫలితాల మీద తీవ్ర ప్రభావం పడటం ఖాయం. యూపీలో బీజేపీకి ఎంత వ్యతిరేకత వ్యక్తమవుతుందన్న విషయం తాజాగా వెల్లడైన కైరానా లోక్ సభ ఫలితంతో పాటు.. నూర్ పూర్ అసెంబ్లీ నియోజకవర్గ ఫలితం స్పష్టం చేస్తుందని చెప్పాలి. నూర్ పూర్ నియోజకవర్గంలో బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యే లోకేంద్ర ప్రతాప్  సింగ్ రోడ్డు ప్రమాదంలో మరణించటంతో ఉప ఎన్నిక జరిగింది. అయినప్పటికీ సానుభూతి పని చేయకుండా.. బీజేపీకి ప్రత్యర్థి అయిన సమాజ్ వాదీ పార్టీ ఈ సీటును చేజిక్కించుకోవటం చూస్తే.. యోగి సర్కారు మీదా.. బీజేపీ మీద ఎంతటి ప్రతికూలత ఉందో అర్థమవుతుందని చెబుతున్నారు.

తాజాగా వెల్లడైన ఉప ఎన్నికల ఫలితాల తీరు చూస్తే.. 2019 సార్వత్రిక సమయానికి బీజేపీ గడ్డు పరిస్థితి ఎదుర్కోవటం ఖాయమంటున్నారు. బీజేపీ తన తీరుతో ఇప్పటికే పలువురు  మిత్రపక్షాల్ని దూరం చేసుకోవటం తెలిసిందే. మరోవైపు మోడీ పాలనా తీరుపై ప్రజల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది.

ఇవన్నీ రానున్న రోజుల్లో బీజేపీకి ఇబ్బందికర ఫలితం దిశగా అడుగులు పడే ప్రమాదం ఉందని చెబుతున్నారు. ఈ రోజు వెలువడిన ఫలితాల్ని చూస్తే.. నాలుగు లోక్ సభ స్థానాల్లో రెండింటిలో బీజేపీ గెలవగా.. రెండింటిలో ఓడిపోయింది. గెలిచిన రెండు స్థానాల్లో ఒకటి బీజేపీ మిత్రపక్షం ఖాతాలో పడుతుందన్నది మర్చిపోకూడదు. బీజేపీ గెలిచిన ఒక్క స్థానం కూడా దాని సొంత సీటే. అది కూడా మహారాష్ట్రలోనే కావటం గమనార్హం.

ఇదిలా ఉంటే.. 11 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కేవలం ఒక్క స్థానంలో మాత్రమే బీజేపీ గెలవటం.. ఐదు స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తే.. మిగిలిన పార్టీలు మరో 5 స్థానాల్లో విజయం సాధించటం చూస్తే.. దేశంలోని పలు రాష్ట్రాల్లో బీజేపీ ప్రభ మసకబారిందన్న అభిప్రాయం కలగటం ఖాయం. దిద్దుబాటు చర్యలు వెనువెంటనే తీసుకోని పక్షంలో 2019లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో మోడీకి భారీ ఎదురుదెబ్బ తగలటం ఖాయమని చెప్పక తప్పదు. ఒక్కమాటలో చెప్పాలంటే.. పోల్ మేనేజ్ మెంట్ లో తమకు తిరుగులేదని చెప్పుకునే మోడీషాల  డౌన్ ఫాల్ స్టార్ట్ అయ్యిందని చెప్పాలి. ఒకసారి పడిపోవటం మొదలైతే.. కోలుకోవటం కష్టం. ఆ విషయాన్ని మోడీషా ఎంత సీరియస్ గా తీసుకుంటారో రానున్న రోజులు చెప్పటం ఖాయం.