Begin typing your search above and press return to search.

కుమారస్వామికి ముందుంది ముసళ్ల పండగే

By:  Tupaki Desk   |   22 May 2018 4:17 PM GMT
కుమారస్వామికి ముందుంది ముసళ్ల పండగే
X
కర్ణాటకలో అవకాశాలను వినియోగించుకుని సీఎం కుర్చీని అందుకున్న జేడీఎస్ నేత కుమారస్వామికి ముందుముందు కాంగ్రెస్ పార్టీ చుక్కలు చూపించే పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. అందుకు కారణంగా కాంగ్రెస్ పార్టీకి అత్యధిక సంఖ్యలో మంత్రి పదవులు ఇవ్వాలని ఒప్పందం కుదరడమే. అవును.. రేపు కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న కుమారస్వామి కేబినెట్లో జేడీఎస్ కంటే కాంగ్రెస్ నేతలకే ఎక్కువ మంత్రి పదవులిస్తున్నారు. ఈ మేరకు ఈ రోజు కాంగ్రెస్‌-జేడీఎస్‌ మధ్య ఒప్పందం కుదిరింది.

మొత్తం 34 మంత్రి పదవుల్లో కాంగ్రెస్‌కు 22 మంత్రి పదవులు జేడీఎస్‌ కు ముఖ్యమంత్రి పదవితో కలిపి 12 పదవులు దక్కేలా ఒప్పందం కుదిరింది. అంతేకాదు... ఉపముఖ్యమంత్రిగా కేపీసీసీ అధ్యక్షుడు పరమేశ్వర ప్రమాణ స్వీకారం చేస్తారు. అంతేనా... స్పీకర్‌గా కూడా కాంగ్రెస్ నేతే ఉంటున్నారు. జేడీఎస్‌కు డిప్యూటీ స్పీకర్‌ పదవి ఇస్తున్నారు. స్పీకర్‌గా కాంగ్రెస్‌ నేత కేఆర్‌ రమేశ్‌ కుమార్‌ను ఈ నెల 25న ఎన్నుకోనున్నారు. ఇక మంత్రి పదవుల కేటాయింపుల్లోనూ కాంగ్రెస్ మాటే చెల్లుబాటు అవుతుందని.. బల నిరూపణ తరువాత ఈ మంత్రి పదవులు కేటాయింపులు ఉంటాయని తెలుస్తోంది. కీలకమైన హోం శాఖ వంటివి కాంగ్రెస్ కోరిందని సమాచారం.

సీఎంగా కుమారస్వామి ఉన్నా మంత్రివర్గంలో తన పార్టీ జేడీఎస్‌కు చెందినవారు కేవలం 12 మందే ఉండడం.. కాంగ్రెస్ మంత్రలు దాదాపు అంతకు రెట్టింపు సంఖ్యలో ఉండడం.. పైగా ఉపముఖ్యమంత్రిగా బలమైన నేత అయిన శివకుమార్(కాంగ్రెస్) ఉండడంతో మంత్రివర్గంలో ఏ నిర్ణయం తీసుకోవాలన్నా అది కాంగ్రెస్ దయాదాక్షిణ్యాలపైనే ఆధారపడి ఉంటుందని అర్థమవుతోంది. మరోవైపు స్పీకర్ కూడా కాంగ్రెస్ నేతే. స్పీకర్ పదవి పార్టీలకు అతీతమైనది అయినా కూడా అవసరమైన ప్రతి సందర్భంలోనూ స్పీకర్లు సొంత పార్టీకే పనిచేసిన సందర్భాలు ఎన్నో చోట్ల చూశాం. ఈ నేపథ్యంలో కుమారస్వామి పేరుకే ముఖ్యమంత్రిగా ఉండాలి తప్ప నిర్ణయాలన్నీ కాంగ్రెస్ దయాదాక్షిణ్యాలతోనే తీసుకోవాల్సిన పరిస్థితి రానుందని విశ్లేషకులు అంటున్నారు.

ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఎంతకాలం కొనసాగుతుందో చెప్పలేమన్న మాటా వినిపిస్తోంది. అంతేకాదు.. బీజేపీ నుంచి తమ ఎమ్మెల్యేలను కాపాడుకోవడంలో సఫలమైన కుమారస్వామి ముందుముందు కాంగ్రెస్ నుంచి అలాంటి పరిస్థితి వస్తే తన మంత్రులను, ఎమ్మెల్యేలను కాపాడుకోగలరా అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న.