Begin typing your search above and press return to search.

రీఎంట్రీ: ప్ర‌త్యేకంపై తిరుప‌తిలో భారీ స‌భ‌?

By:  Tupaki Desk   |   4 Aug 2015 9:13 AM GMT
రీఎంట్రీ: ప్ర‌త్యేకంపై తిరుప‌తిలో భారీ స‌భ‌?
X
రాష్ట్ర విభ‌జ‌న విష‌యంలో అత్యంత నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రించి.. ఏక‌ప‌క్షం వైఖ‌రితో ఏపీ గురించి ఏ మాత్రం ప‌ట్టించుకోకుండా అడ్డ‌దిడ్డంగా విభ‌జ‌న చేసేసి కాంగ్రెస్ పార్టీకి.. సార్వ‌త్రిక ఎన్నిక‌ల సంద‌ర్భంగా ఏపీ ప్ర‌జ‌లు చెప్పాల్సిన రీతిలో బుద్ధి చెప్ప‌టం తెలిసిందే.

ఒక్క‌టంటే.. ఒక్క ఎమ్మెల్యేను గెలిపించ‌కుండా.. కాంగ్రెస్ పార్టీని పాతాళంలో క‌ప్పేసిన ఏపీ ప్ర‌జ‌ల మ‌న‌సుల్ని దోచుకునేందుకు.. తిరిగి పార్టీ వైభ‌వాన్ని తెచ్చుకునేందుకు తాజాగా ఒక భారీ స‌భ‌ను ఏర్పాటు చేయాల‌ని భావిస్తోంది.

విభ‌జ‌న స‌మ‌యంలో ఏపీని ఆదుకునేందుకు అన్ని విధాలుగా క‌స‌ర‌త్తు చేశామ‌ని.. అందులో భాగంగానే ఐదేళ్లు ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇస్తూ నిర్ణ‌యం తీసుకున్నామ‌ని చెప్ప‌టంతోపాటు.. నాడు విప‌క్షంగా ఉన్న బీజేపీ.. నేడు ఏపీని ప‌ట్టించుకోవ‌టం లేద‌ని.. ఏపీ అధికార‌ప‌క్షం సైతం మోడీ స‌ర్కారుకు ద‌న్నుగా నిలుస్తుంద‌ని ఆరోపించాల‌ని కాంగ్రెస్ భావిస్తోంది.

ఏపీలో త‌మ ప‌ర‌ప‌తి మొత్తం పాతాళంలోకి ప‌డిపోయిన నేప‌థ్యంలో.. తిరుప‌తిలో భారీ స‌భ‌ను ఏర్పాటు చేయాల‌ని.. ఏపీకి ప్ర‌త్యేక హోదా గురించి భారీగా గ‌ళం విప్పాల‌ని.. ఆ స‌భ‌తో మొద‌లు పెట్టి.. ఏపీకి ప్ర‌త్యేక హోదా సాధించేంత వ‌ర‌కూ విశ్ర‌మించ‌కుండా ప‌ని చేయాల‌న్న ప్లాన్ లో కాంగ్రెస్ పార్టీ ఉన్న‌ట్లు చెబుతున్నారు.

ఈ మ‌ధ్య‌నే అనంత‌పురం జిల్లాలో ప‌ర్య‌టించిన పార్టీ ఉపాధ్య‌క్షుడు రాహుల్ గాంధీ ప్ర‌త్యేక హోదా గురించి మాట్లాడుతూ.. ఏపీ హ‌క్కుగా ప్ర‌స్తావించ‌ట‌మే కాదు.. ఆ విష‌యంపై ఏపీ త‌ర‌ఫున పోరాడ‌తామ‌ని చెప్ప‌టం తెలిసిందే.

తాజాగా.. ఏపీకి ప్ర‌త్యేక హోదా విష‌యాన్ని పార్ల‌మెంటులోప్ర‌స్తావించి.. వీలైతే స‌భ‌ను స్తంభింప చేయాల‌ని భావిస్తున్న‌ట్లు చెబుతున్నారు. మొత్తంగా.. ఏపీకి ప్ర‌త్యేక‌హోదా నినాదంతో ఏపీలో పార్టీని స‌రికొత్త‌గా ముందుకుతీసుకెళ్లాల‌న్న ఆలోచ‌న‌లో కాంగ్రెస్ అధినాయ‌క‌త్వం ఉంద‌న్న మాట వినిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ చెప్పే మాట‌ల్ని ఏపీలో న‌మ్మే ఆంధ్రుడు ఇంకా ఉన్నాడా..?