కేసీఆర్‌కు ఇంకో అవకాశం అందిస్తున్న కాంగ్రెస్

Fri Nov 09 2018 23:13:17 GMT+0530 (IST)

ఓ వైపు అధికార టీఆర్ఎస్ పార్టీ ప్రచారంలో దూసుకుపోతుండగా మరోవైపు ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ సారథ్యంలోని మహాకూటమి బాలారిష్టాలను ఎదుర్కుంటోంది. ఇప్పటికే ఆ పార్టీ సారథ్యంలోని కూటమిలో సీట్ల పంపకంపై చర్చలు కొలిక్కి రాకపోగా తాజాగా పార్టీలోని అసంతృప్తులు తారాస్థాయికి చేరాయి. ఏకంగా తమ వారికి టికెట్ ఇవ్వకపోతే పోటీ చేసేది లేదని  కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి హెచ్చరించారు. తద్వారా కాంగ్రెస్‌లోని అసంతృప్తిని చాటిచెప్తూ...టీఆర్ఎస్‌కు తమ బలహీనతలను అందిస్తున్నారు.మహాకూటమి పొత్తులో భాగంగా తెలంగాణ ఇంటిపార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్ కూడా నకిరేకల్‌ను తమను ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నకిరేకల్ స్థానంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. కాగా తాజాగా నకిరేకల్ నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తలు నల్గొండ జిల్లా నార్కట్‌పల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిని అడ్డుకున్నారు ... చిరుమర్తి లింగయ్యకే నకిరేకల్ టికెట్ ఇవ్వాలని డిమండ్ చేశారు. ఈ సందర్భంగా స్పందించిన కోమటిరెడ్డి సంచనల వ్యాఖ్యలు చేశారు. నకిరేకల్ లో చిరుమర్తికి టికెట్ ఇవ్వకుంటే తాను నల్గొండ నుంచి పోటీ చేసేది లేదని వెల్లడించారు. నకిరేకల్‌లో వీరేశం అరాచకాలకు చరమ గీతం పాడాలని కార్యకర్తలకు సూచించారు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి. ఇక చిరుమర్తికి టికెట్ రాకుంటే కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులను నా అభిమానులు ఓడిస్తారని కోమటిరెడ్డి వ్యాఖ్యలు కాకరేపుతున్నాయి. జిల్లాకు చెందిన ముఖ్య నేతలు  ఉత్తమ్ కుమార్ రెడ్డి - జానారెడ్డి తదితరులకు పరోక్షంగా హెచ్చరికలు పంపుతున్నాడని పార్టీలో పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

టికెట్ల పంపకం తుది దశకు చేరుకున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. మిత్రపక్షాలకు సీట్ల సర్దుబాటు తలనొప్పిగా మారిన కాంగ్రెస్‌కు.. సొంత పార్టీలో టికెట్ల లొల్లి కొత్త సమస్యలను తెచ్చిపెడుతోందని ఇదంతా గులాబీ పార్టీకి కలిసి వస్తుందని పలువురు పేర్కొంటున్నారు.