Begin typing your search above and press return to search.

కేసీఆర్‌ను ఆకాశానికి ఎత్తేసిన కాంగ్రెస్ ఎంపీ

By:  Tupaki Desk   |   21 Oct 2016 10:19 AM GMT
కేసీఆర్‌ను ఆకాశానికి ఎత్తేసిన కాంగ్రెస్ ఎంపీ
X
తెలంగాణ‌లో అధికార టీఆర్ఎస్‌ పార్టీ గూటికి మ‌రో కాంగ్రెస్ ఎంపీ చేరిపోనున్నారా? కాంగ్రెస్ పార్టీ ఎంపీ నంది ఎల్ల‌య్య‌ సాక్షాత్తు స‌భా వేదిక‌గా కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డిపై విమ‌ర్శ‌లు చేయ‌డం అదే స‌మ‌యంలో గులాబీ ద‌ళ‌ప‌తి కేసీఆర్‌ను పొగ‌డ‌టం వెనుక మర్మం ఏంటి? ఈ చ‌ర్చ ఇటు అధికార టీఆర్ఎస్‌తో పాటు ప్ర‌తిప‌క్ష కాంగ్రెస్‌లో కూడా జోరుగా సాగుతోంది. మహబూబాబాద్ జిల్లాలో కాంగ్రెస్ నిర్వహించిన రైతు గర్జనలో నాగర్‌కర్నూల్ ఎంపీ నంది ఎల్లయ్య ప్రసంగం కాంగ్రెస్ నాయకులను ఇరకాటంలో పెట్టింది. ప్రధానంగా సీనియర్ నేత జైపాల్‌రెడ్డి మీద ఆయన విసిరిన ఛలోక్తులు వారికి మింగుడు పడలేదు. సీఎం కేసీఆర్ మాట్లాడితే అందరికీ అర్థమవుతుంది కానీ కేంద్ర మంత్రి హోదాలో ప‌నిచేసిన జైపాల్‌రెడ్డి మాట్లాడితే చాలామందికి అర్థమేకాదంటూ ఎల్లయ్య తన ప్రసంగంలో వ్యాఖ్యానించారు.

ముఖ్య‌నేత‌లు ప్ర‌సంగిస్తున్న క్ర‌మంలో మాట్లాడిన నంది ఎల్ల‌య్య ప్ర‌సంగిస్తూ..."సీఎం కేసీఆర్ మాట్లాడితే సామాన్యుడికి సైతం అర్థమైతది.. జైపాల్‌రెడ్డి మాట్లాడితే యూనివర్సిటీ కన్వెన్షన్‌లో ఫిలాసఫర్ మాట్లాడినట్లు ఉంటుంది. అందరికీ అర్థం కాదు. దయచేసి కేసీఆర్‌లాగా మాట్లాడడం నేర్చుకోండి సార్"..అంటూ జైపాల్‌రెడ్డికి సూచించడంతో సభ ఒక్కసారిగా గొల్లుమంది. 'సీనియర్ పార్లమెంటేరియన్‌గా గుర్తింపు పొందిన జైపాల్‌రెడ్డి పెద్ద కుర్చీపై కూర్చోవాలని కలలు కన్నారు.. ముఖ్యమంత్రి కావాలని ఆశ పడ్డారు.. కేసీఆర్‌తో గుసగుసలు పెట్టేవారు' అని నందిఎల్ల‌య్య‌ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్‌కు మిగిలిన ఏకైక ఎంపీని తానొక్కడినే అని.. తనకు కూడా ఆశలు ఉన్నాయని నంది ఎల్ల‌య్య‌ పేర్కొన్నారు. ఇన్నాళ్లు ఎంపీగా గెలిచినా డబ్బులు సంపాదించుకోలేక పోయానని.. పదవులు మాత్రం సంపాదించానని అన్నారు. నంది ఎల్లయ్య విధానం చూసి ఆయన కాంగ్రెస్‌కు అనుకూలమా? ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అనుకూలమా?.. అనే సందేహం సభికుల్లో రేకెత్తింది. ఎంపీ స్థాయి నాయకుడే ఇలా మాట్లాడడం ముఖ్య నాయకులను మాత్రం బాగా ఇబ్బంది పెట్టింది.