Begin typing your search above and press return to search.

రాష్ట్రప‌తికి కేవీపీ లేఖ‌..బాబు మోడీపై ఫిర్యాదు

By:  Tupaki Desk   |   20 Jan 2018 4:33 PM GMT
రాష్ట్రప‌తికి కేవీపీ లేఖ‌..బాబు మోడీపై ఫిర్యాదు
X
ప్ర‌ధాన‌మంత్రి నరేంద్ర మోడీతో ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు స‌మావేశంపై కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత‌ - ఎంపీ కేవీపీ రామ‌చంద్ర‌రావు మండిప‌డ్డారు. గ‌త వారం జ‌రిగిన ఈ భేటీ ఏపీ ప్ర‌జ‌ల‌ను మ‌రోమారు మోసం చేసేందుకేన‌ని ఆరోపించారు. ఈ మేర‌కు రాష్ట్రప‌తికి ఫిర్యాదు చేశారు. రాష్ట్ర విభ‌జ‌న చ‌ట్టంలోని హామీలు అమ‌లు చేయ‌కుండా ప్ర‌జ‌ల‌ను మోసం చేసేందుకే ఈ ఇద్ద‌రు ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని ప్ర‌ధానికి రాసిన లేఖ‌లో ఎంపీ కేవీపీ పేర్కొన్నారు.

రాష్ట్ర విభ‌జ‌న చ‌ట్టం ప్ర‌కారం ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ కు ద‌క్కాల్సిన వాటిని పొంద‌డంలో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు వైఫ‌ల్యం చెందార‌ని ఎంపీ కేవీపీ రామ‌చంద్ర‌రావు మండిప‌డ్డారు. మూడున్న‌రేళ్ల పాటు కేంద్ర ప్ర‌భుత్వంపై ఎలాంటి ఒత్తిడి చేయ‌కుండా ఉండిపోయిన చంద్ర‌బాబు ఇటీవ‌ల ప్ర‌ధానమంత్రితో భేటీ వెనుక రాజ‌కీయాలు ఉన్నాయ‌ని లేఖ‌లో కేవీపీ పేర్కొన్నారు. కేంద్ర ప్ర‌భుత్వం ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు వెళుతుంద‌న్న వార్త‌లు వినిపిస్తున్న నేప‌థ్యంలోనే ఈ భేటీ జ‌రిగింద‌ని అన్నారు. మోడీతో జ‌రిగిన స‌మావేశంలో చంద్ర‌బాబు 17 పేజీల లేఖ స‌మ‌ర్పించ‌డం నాట‌క‌మ‌ని ధ్వ‌జ‌మెత్తారు. ఈ లేఖ సంద‌ర్భంగా రాష్ట్ర ప్ర‌యోజ‌నాల‌ను త‌ను ప‌రిర‌క్షిస్తాన‌ని ప్ర‌ధాని మోడీ తెలుప‌డం కూడా ఏపీ ప్ర‌జ‌ల‌ను మోసం చేయ‌డంలో భాగ‌మ‌ని దుయ్య‌బ‌ట్టారు.

విభ‌జ‌న స‌మ‌యంలో ఇచ్చిన హామీల అమ‌లు విష‌యంలో స్టేట‌స్ రిపోర్ట్ కోరాల‌ని రాష్ట్రప‌తిని ఈ లేఖ‌లో ఎంపీ కేవీపీ అభ్య‌ర్థించారు. రాష్ట్ర విభ‌జ‌న సంద‌ర్భంగా ప్ర‌ధాన‌మంత్రి మ‌న్మోహ‌న్‌ సింగ్ ఇచ్చిన హామీల‌ను నెర‌వేర్చిన వాటి గురించి బ‌హిర్గ‌తం చేయాల‌ని ఆయ‌న పేర్కొన్నారు.