Begin typing your search above and press return to search.

టీ అసెంబ్లీలో కులాల గోల‌

By:  Tupaki Desk   |   25 March 2017 9:36 AM GMT
టీ అసెంబ్లీలో కులాల గోల‌
X
తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్ ఎమ్మెల్యే సంప‌త్ కుమార్ చేసిన వ్యాఖ్య‌లు సంచ‌ల‌నం రేపాయి. మొన్న‌టి బ‌డ్జెట్లో కుల‌వృత్తుల‌కు భారీగా నిధుల కేటాయించ‌డంపై ఆయ‌న అభ్యంత‌రం వ్య‌క్తంచేశారు. కుటుంబ పాల‌న‌కు అడ్డులేకుండా చేసుకోవడానికి సీఎం కేసీఆర్ ఎస్సీ -ఎస్టీల‌కు అన్యాయం చేస్తూ ఇలాంటి ఎత్తుగ‌డ‌లు వేస్తున్నార‌న్న‌ట్లుగా ఆయ‌న మాట్లాడారు. ఈ క్ర‌మంలో ఆయ‌న గొల్లోడు గొర్రెలు కాయాలి.. చాకలోడు బట్టలు ఉతకాలి. మంగలోడు గుండ్లు కొట్టాలి.. కేసీఆర్‌ ఇంటిల్లిపాదికీ అధికారం కావాలి. ప్రతిపక్షాలకు మాత్రం బిస్కెట్లు వేస్తారు అంటూ తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు. ఎస్సీ - ఎస్టీ - బీసీ - మైనారిటీలను ప్రభుత్వం మోసం చేస్తోందని ఆరోపించారు. కులవృత్తులను ప్రోత్స హించేందుకు బడ్జెట్లో భారీ కేటాయింపులు జరపడం వెనక ప్రభుత్వ ఉద్దేశాలను ప్రశ్నిం చారు.

తెలంగాణ జనాభాలో 80 శాతం ఉన్న ఎస్సీ - ఎస్టీ - బీసీ - మైనారిటీ వర్గాలకు ఇచ్చే నిధుల‌ను దారి మ‌ళ్లిస్తూ వారి ఆక్రందన - ఆర్తనాదాలు - కడుపు మంటను ప్రభుత్వం పట్టించు కోవడం లేద‌న్నారు. దళితుడిని సీఎం చేస్తానన్న మాట‌ల‌ను మ‌ర్చిపోయార‌న్నారు. దళిత పారిశ్రామికవేత్తలకు రూ.400 కోట్లు ఇచ్చామని మంత్రి కేటీఆర్‌ సభలో చెప్పినా ఒక్క రూపాయీ ఇవ్వ లేద‌ని.. టీఎస్‌ ఐపాస్ - టీప్రై డ్‌ అంటూ కేటీఆర్‌ పదేపదే చెప్పే మాటలతో చెవులు మార్మోగ‌డ‌మే త‌ప్ప ఫ‌లితం లేద‌న్నారు. గిరిజన - ఆదివాసీ - అంబేడ్కర్ - పూలే భవనాలకు శిలాఫలకాలు వేసి మరిచిపోయారని, ఆ స్థలాల్లో పిచ్చి మొక్కలు మొలిచాయన్నారు. రుణమాఫీ కింద చెల్లించిన సొమ్ములో 26 శాతాన్ని ఎస్సీ - ఎస్టీ సబ్‌ ప్లాన్‌ నిధుల నుంచే మళ్లించార‌ని.. 30 లక్షల మంది భూమి లేని ఎస్సీ కుటుంబాలకు మూడెకరాల చొప్పున భూములు పంపిణీ చేస్తామని చెప్పి కేవలం 3,671 మందికి 9,663 ఎకరాలు మాత్రమే పంపిణీ చేశారన్నారు.

ఎస్సీ - ఎస్టీ - మైనారిటీల కోసం సంప‌త్ గొంతెత్త‌డం వ‌ర‌కు బాగానే ఉన్నా కులవృత్తుల‌వారికి నిధులు కేటాయించ‌డాన్ని బాహాటంగా వ్య‌తిరేకించ‌డంపై కాంగ్రెస్ నేత‌లూ అసంతృప్తి వ్య‌క్తంచేస్తున్నారు. ఇలాంటి వ్యాఖ్య‌ల‌తో వారిని దూరం చేసుకోవాల్సి వ‌స్తుంద‌ని అంటున్నారు. సంప‌త్ మాట‌లు ఇబ్బందిక‌రంగా ఉన్నాయ‌ని ప‌లువురు కాంగ్రెస్ నేత‌లు అంటున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/