Begin typing your search above and press return to search.

‘కరుణ’ కోసం తపిస్తున్న కాంగ్రెస్

By:  Tupaki Desk   |   14 Feb 2016 4:06 AM GMT
‘కరుణ’ కోసం తపిస్తున్న కాంగ్రెస్
X
సార్వత్రిక ఎన్నికల్లో అధికారానికి దూరమై.. విలవిలాడుతున్న కాంగ్రెస్ పార్టీ.. తాను మళ్లీ బలపడేందుకు ఉన్న ఏ చిన్న అవకాశాన్ని వదిలిపెట్టటం లేదు. కేంద్రంలో పదేళ్లు తిరుగులేని అధికారాన్ని అనుభవించిన సమయంలో భాగస్వామ్య పక్షాల విషయంలోఒక తీరులో.. సొంతపార్టీ నేతల విషయంలో మరోలా వ్యవహరించిన కాంగ్రెస్ పాత సంగతుల్ని వదిలేసి.. భాగస్వామ్య పక్షాలతో సరికొత్త జర్నీ చేయాలని భావిస్తోంది.

2004 నుంచి 2013 వరకు సాగిన వీరి దోస్తీ.. 2014 సార్వత్రిక ఎన్నికల్లో మాత్రం ఎవరికి వారుగా ఎన్నికల బరిలోకి దిగారు. ఈ రెండు పార్టీలు విడివిడిగా పోటీ చేయటం ద్వారా.. ఘోర పరాజయానికి పాలయ్యారు. ఈ నేపథ్యంలో త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకేతో జత కట్టాలని కాంగ్రెస్ ఊవ్విళ్లూరుతోంది.

మేలో జరిగే తమిళనాడు సార్వత్రిక ఎన్నికల్లో విపక్ష డీఎంకేతో జత కట్టాలని భావిస్తోంది. యూపీఏ హయాంలో కాంగ్రెస్ మిత్రపక్షంగా వ్యవహరించిన డీఎంకేతో మళ్లీ దోస్తీ పెంచుకోవాలని భావిస్తోంది. ఇందులో భాగంగా కాంగ్రెస్ సీనియర్ నేత.. పార్టీ ట్రబుల్ షూటర్ గా పేరొందిన గులాంనబీ అజాద్.. ముకుల్ వాస్నిక్.. తమిళనాడు కాంగ్రెస్ అధ్యక్షుడు ఈవీకే ఇళంగోవన్ తదితరులు కలిసి డీఎంకే చీఫ్ కరుణ ఇంటికి వెళ్లారు. పొత్తులకు సంబంధించి వీరి మధ్య చర్చలు జరిగాయి.

తాజా అసెంబ్లీ ఎన్నికల్లో వీలైనన్ని ఎక్కువ పార్టీలు కలిసి కూటమిగా ఏర్పడి ఎన్నికల్లో పోటీ చేయాలని డీఎంకే భావిస్తోంది. అలా జరిగితే తప్ప అధికార అన్నాడీఎంకేకు చెక్ చెప్పొచ్చని భావన ఆ పార్టీ నేతల్లో ఉంది. కరుణ ఆలోచనల్ని గమనించిన కాంగ్రెస్.. టైం చూసుకొని ఆయనకు స్నేహ హస్తాన్ని జాచినట్లు చెబుతున్నారు. మరి.. దోస్తీకి సంబంధించి కరుణ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.