Begin typing your search above and press return to search.

ప్ర‌తిప‌క్ష పార్టీకి కొత్త టెన్ష‌న్‌

By:  Tupaki Desk   |   26 May 2016 11:57 AM GMT
ప్ర‌తిప‌క్ష పార్టీకి కొత్త టెన్ష‌న్‌
X
జంపింగ్ రాజ‌కీయాలు దేశ‌వ్యాప్తంగా కొన‌సాగుతున్న ట్రెండ్ అనేది తెలిసిన విష‌య‌మే. ఐదు రాష్ట్రాల ఎన్నిక‌ల సంద‌ర్భంగా ఈ భ‌యంతో కాంగ్రెస్ ప‌శ్చిమ‌బెంగాల్ రాష్ట్రంలో ఏకంగా బాండ్ రాయించుకొని మ‌రీ పార్టీకే క‌ట్టుబ‌డ‌తామ‌ని భ‌రోసా తీసుకొంది. అయితే ఇపుడు త‌మిళ‌నాడు రాష్ట్రంలోనూ ఆ పార్టీకి అదే టెన్ష‌న్ ప‌ట్టుకుంద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి.

ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో డీఎంకే కూటమిలోని కాంగ్రెస్‌ 8 స్థానాల్లో గెలిచి రెండో పెద్ద ప్రతిపక్షంగా అవతరించింది. గెలిచిన వారిలో మహిళా కాంగ్రెస్‌ జాతీయ కార్యదర్శి - విళవంగోడు ఎమ్మెల్యే విజయధారణి కూడా ఉన్నారు. తమిళనాడు శాసనసభ కాంగ్రెస్‌ పక్ష నేత పదవిని కైవసం చేసుకోవడానికి ఆమె ప్ర‌య‌త్నం చేస్తున్నార‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. డిల్లీకి వెళ్లి పార్టీ జాతీయ అధ్యక్షురాలు సోనియాగాంధీ - ఉపాధ్య‌క్షుడు రాహుల్‌ గాంధీని కలిశారు. అయితే ఈ మీటింగ్ స‌మ‌యంలోనే ఆమె పార్టీని వీడుతార‌నే ప్ర‌చారం జ‌ర‌గ‌డం ఆస‌క్తిక‌రం.

శాసనసభ పార్టీ పక్షనేతగా మ‌రో ఇద్ద‌రు ఎమ్మెల్యేల పేర్ల‌ను కాంగ్రెస్‌ అధిష్ఠానం పరిశీలిస్తోందని స‌మాచారం. ఒక‌వేళ వారికి ప‌ద‌వి ద‌క్కితే ఈ మ‌హిళా ఎమ్మెల్యే అధికార పార్టీ అయిన అన్నాడీఎంకేలో చేర‌నున్నార‌ని ప్ర‌చారం ప్రారంభ‌మైంది. పార్టీ ఎమ్మెల్యేల్లో ఇద్దరు మినహా అయిదుగురితోపాటు అన్నాడీఎంకేలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారని ఆ ప్రచారం సారాంశం. అయితే వీటిని విజయధారణి ఖండించారు. శాసనసభ పార్టీ పక్షనేతగా తనకు రానున్న అవకాశాన్ని అడ్డుకోవాలనే ఉద్దేశంతోనే కొందరు ఇలాంటి చౌకబారు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు.

మొత్తంగా కాంగ్రెస్ త‌ర‌ఫున గెలిచిన ఎమ్మెల్యేలే త‌క్కువ‌గా ఉన్నారంటే వారిలో మెజార్టీ స‌భ్యులు ఆయా రాష్ట్రాల‌కు చెందిన అధికార పార్టీ వైపు మొగ్గుచూప‌డం ఆ పార్టీకి క‌ల‌వ‌ర‌పాటు ప‌రిణామం అని రాజ‌కీయ‌వ‌ర్గాలు విశ్లేషిస్తున్నాయి. ప్ర‌తిపక్ష పార్టీగా కాంగ్రెస్ కొత్త టెన్ష‌న్ ఎదుర‌వుతోంద‌ని చెప్తున్నారు.