Begin typing your search above and press return to search.

నాతోనే అంతా సెల్ఫీలు దిగుతారు..పవన్‌ తో నాకు సెల్ఫీ అక్కర్లేదు

By:  Tupaki Desk   |   20 Sep 2019 4:12 PM GMT
నాతోనే అంతా సెల్ఫీలు దిగుతారు..పవన్‌ తో నాకు సెల్ఫీ అక్కర్లేదు
X
కాంగ్రెస్ పార్టీలో పవన్ కల్యాన్ చిచ్చు ఇంకా చల్లారలేదు. పవన్ నిర్వహించిన అఖిల పక్ష సమావేశానికి రేవంత్ రెడ్డి - ఇతర కాంగ్రెస్ నాయకులు హాజరుకావడాన్ని కాంగ్రెస్‌లోనే కొందరు నాయకులు తప్పుపట్టారు. ముఖ్యంగా ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ పార్టీ పెద్దలకు కంప్లయింట్ చేయడంతో పాటు విమర్శలు చేశారు. దీంతో రేవంత్ కూడా ప్రతి విమర్శలు చేయడంతో ఇద్దరు నేతల మధ్యా మాటల యుద్ధం సాగుతోంది.

పవన్ కల్యాణ్ తో సెల్ఫీ దిగేందుకు కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ కు అవకాశం దొరక్కపోవడంతోనే ఆ కోపం తనపై చూపిస్తున్నారంటూ టీ-కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి విమర్శలు చేయగా... ఈ రోజు సంపత్ కుమార్ స్పందిస్తూ, ‘నాకు సెల్ఫీ పిచ్చి లేదు. నాతో సెల్ఫీ దిగేవారు చాలా మంది ఉన్నారు’ అని బదులిచ్చారు. సెల్ఫీ రాజకీయాలు ఎవరు చేస్తారో రాష్ట్ర ప్రజలను అడిగితే చెబుతారని విమర్శించారు.

యురేనియం తవ్వకాలపై కాంగ్రెస్ పార్టీ ఎంతో కాలంగా పోరాటం చేస్తోందని అన్నారు. ‘జనసేన’ తరఫున కనీసం ఒక్క సర్పంచ్ కూడా లేరని - అటువంటి పార్టీ ఈ అంశంపై అఖిలపక్ష సమావేశం నిర్వహించడం.. దానికి టీ-కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ వెళ్లడం సరికాదన్నారు. యురేనియం విషయంలో సంపత్ కు ఏబీసీడీలు కూడా తెలియవని రేవంత్ చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. హైదరాబాద్ లో ఈ రోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ - రెండు రోజులుగా తాను ఢిల్లీలో ఉన్నానని - అందుకే - వెంటనే స్పందించలేకపోయానని చెప్పారు. తాను పీహెచ్ డీ చేశానని - ఆ విషయం ప్రజలకు తెలుసని అన్నారు. రేవంత్ లా ఏది పడితే అది మాట్లాడనని - ఏ విషయంపైన అయినా పూర్తి సమాచారం తోనే మాట్లాడతానని చెప్పిన సంపత్ - రేవంత్ తనకు ముద్దుల అన్నయ్య అని - ఆయన అలా ఎందుకు మాట్లాడారో అర్థం కావట్లేదని వ్యాఖ్యానించడం గమనార్హం.

యురేనియం తవ్వకాలపై ఇటీవల నిర్వహించిన అఖిలపక్ష సమావేశానికి టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి - వంశీ చందర్ - తనకు మాత్రమే ఆహ్వానం ఉందని - రేవంత్ కు లేదని చెప్పారు.