Begin typing your search above and press return to search.

ఆ కాంగ్రెస్ నేత కౌర్యం తెలిస్తే వ‌ణుకు ఖాయం

By:  Tupaki Desk   |   18 Dec 2018 7:22 AM GMT
ఆ కాంగ్రెస్ నేత కౌర్యం తెలిస్తే వ‌ణుకు ఖాయం
X
కొన్ని గాయాలు అంత తేలిగ్గా పోవు. మానిన త‌ర్వాత కూడా వెంటాడుతూనే ఉంటాయి. గాయాల మాదిరే అక్ష‌రాలు కూడా. కొన్ని మాట‌లు జీవితాంతం వెంటాడుతూనే ఉంటాయి. అందుకు నిద‌ర్శ‌నంగా తాజా ఉదంతాన్ని చెప్పాలి. స్వ‌ర్గీయ ఇందిరాగాంధీ హ‌త్య అనంత‌రం ఢిల్లీ ప‌రిస‌ర ప్రాంతాల్లో జ‌రిగిన హింస తీవ్ర‌త ఎంత ఎక్కువ‌న్న మాట‌ను చెప్ప‌టానికి మాట‌లు స‌రిపోవు.

ఇందిర‌మ్మ హ‌త్య జ‌రిగి ద‌శాబ్దాలు దాటిన‌ప్ప‌టికీ.. బాధితుల నోటి నుంచి వారి అనుభ‌వాలు వింటే అవి ప‌చ్చిగా ఉండ‌ట‌మే కాదు.. గుండెలు అదిరిపోయేలా ఉంటాయి. ఇంత దారుణం అప్ప‌ట్లో జ‌రిగిందా? అనిపించ‌క త‌ప్ప‌దు. సినిమాల్లో సైతం చూడ‌లేనంత హింస‌.. ఏ ద‌ర్శ‌కుడు తీయ‌నంత దారుణ‌మైన కౌర్యం బాధితులు చెప్పుకొస్తారు.

ఇందిర‌మ్మ‌ను హ‌త‌మార్చింది సిక్కు కావ‌టంతో.. సిక్కులు ఎక్క‌డ క‌నిపిస్తే.. అక్క‌డ వారిని వ‌ధించేందుకు కాంగ్రెస్ నేత‌లు ప్ర‌ద‌ర్శించిన కౌర్యం బాధితుల మాట‌ల్లో వింటే.. ఈ జ‌న్మ‌లో ఆ పార్టీని క్ష‌మించే అవ‌కాశ‌మే ఉండ‌దు.
మ‌ధ్య‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రిగా క‌మ‌ల్ నాథ్ ప్ర‌మాణ‌స్వీకారం చేసిన కాసేప‌టికే ఇందిర‌మ్మ హ‌త్య అనంత‌రం చోటు చేసుకున్న హింస‌.. అల్ల‌ర్ల‌లో ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న కాంగ్రెస్ నేత‌ల్లో స‌జ్జ‌న్ కుమార్‌ను దోషిగా కోర్టు తేల్చింది.
ఈ దారుణ హింసాకాండ‌కు ప్ర‌త్య‌క్ష‌సాక్షి అయిన నీర్ ప్రీత్ కౌర్ క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్లు చెప్పారు.

మ‌ధ్య‌ప్ర‌దేశ్ సీఎంగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన క‌మ‌ల్ నాథ్ కూడా ఈ హింసాకాండ‌లో హ‌స్త‌ముంద‌న్న ఆరోప‌ణ‌లు ఉన్నాయి. త‌న తండ్రిని కాంగ్రెస్ నేత‌లు ఎంత దారుణంగా హ‌త‌మార్చారో.. ప్ర‌త్య‌క్ష సాక్షి మాట‌ల్లో వింటే.. ‘‘మేమున్న రాజ్‌నగర్ ప్రాంతంపై కాంగ్రెస్ పార్టీకి చెందిన హంతక మూక దాడిచేసింది. మా నాన్ననిర్మల్‌ సింగ్ ఒంటిపైన కిరోసిన్‌ పోసి నిప్పుపెట్టింది. అక్కడే ఉన్న ఓ పోలీసు, వారికి అగ్గిపెట్టె అందించాడు. అగ్గిపుల్ల పడగానే మా నాన్న ఒళ్లంతా మంటలు అంటుకొన్నాయి. వెంటనే ఓ మురుకు కాలువ‌లోకి ఆయన దూకాడు. ఆ మూక మా నాన్నను పైకి లాక్కొచ్చి మరోసారి కిరోసిన్‌ పోసి తగలబెట్టింది. మళ్లీ ఆయన మురుగునీళ్లలోకి దూకడానికి ప్రయత్నించాడు. ఇంతలో ఒకడు ఆయనను రాడ్‌తో చావగొట్టాడు.

‘మండే గాయాలపై తెల్ల పొడి (ఫాస్పరస్‌) చల్లండిరా. ఆ మంటకు చస్తాడు’ అంటూ వారంతా పెద్దగా అరిచారు. ఆ కొద్దిసేపటికే మా నాన్న చనిపోయాడు. కాంగ్రెస్‌ నాయకుడు సజ్జన్‌కుమార్‌ ఈ మూకలకు నాయకత్వం వహించాడు. ‘ఇందిరాగాంధీని చంపిన ఏ ఒక్క సర్దార్జీనీ చంపకుండా వదిలిపెట్టొద్దు’ అని మైకులో ఆయన అరవడం వినిపించింది. ఆ విషయం పోలీసులకు చెప్పానని కక్షకట్టి, నా జీవితాన్ని నరకం చేశారు. అక్రమంగా టాడా కేసు మోపి, నన్ను, మా అమ్మను జైలుకు పంపించారు. 34 ఏళ్ల తరువాత నాకు న్యాయం దొరికింది. సజ్జన్‌ జైలుకు పోయాడు’’ అని ఆయ‌న తాను చూసిన దారుణ వైనాన్ని చెప్పుకొచ్చారు. హింస ఎంత భ‌యాన‌కంగా ఉంటుందో ఈ ఉదంతం వింటే అర్థం కాక మాన‌దు.