Begin typing your search above and press return to search.

కాంగ్రెస్ షాకిస్తే...రేవంత్ త‌ల‌ప‌ట్టుకుంటున్నాడు

By:  Tupaki Desk   |   25 April 2018 7:17 AM GMT
కాంగ్రెస్ షాకిస్తే...రేవంత్ త‌ల‌ప‌ట్టుకుంటున్నాడు
X
కాంగ్రెస్ మార్క్ రాజ‌కీయాలు ఎలా ఉంటాయో కొడంగ‌ల్ ఎమ్మెల్యే - టీడీపీకి గుడ్ బై చెప్పిన యువ‌నేత రేవంత్ రెడ్డికి ఒక‌దాని వెంట ఒక‌టి అన్న‌ట్లుగా అనుభ‌వంలోకి వ‌స్తున్నట్లుంది. పార్టీలో చేరే స‌మ‌యంలో ఎన్నో హామీలు ఇచ్చిన‌ట్లుగా రేవంత్ టీం ప్ర‌చారం చేసిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌చార క‌మిటీ చైర్మ‌న్ లేదా వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ వంటి ప‌ద‌వులు ఇస్తార‌ని హామీ ఉంద‌ని వారు ప్ర‌క‌టించ‌డం...కాంగ్రెస్‌ ఊరించ‌డం...అనంత‌రం దాన్ని తుంగ‌లో తొక్కేయ‌డం తెలిసిన సంగ‌తే. అయితే తాజాగా మ‌రోషాక్ ఇచ్చారు. వ్యక్తిగత పాదయాత్రలు వద్దని అధినేత రాహుల్‌ గాంధీ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఇది నేరుగా రేవంత్‌కు ఇచ్చిన తాజా షాక్ అని అంటున్నారు.

టీడీపీలో వ‌లే కాంగ్రెస్‌లో కూడా ప‌ట్టుసాధించుకోవాల‌ని ప్లాన్ వేసిన రేవంత్ రెడ్డి ఇందుకోసం పాద‌యాత్ర‌కు సిద్ధ‌మ‌య్యారు. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాలను చుట్టి వచ్చేలా కొడంగల్‌ ఎమ్మెల్యే రేవంత్‌ రెడ్డి ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. దీంతో తాను సైతం పాద‌యాత్ర‌కు సిద్ధ‌మంటూ రేవంత్ రాక‌ను వ్య‌తిరేకించిన సీనియ‌ర్ ఎమ్మెల్యే డీకే అరుణ వెల్ల‌డించారు. జూన్‌ 8 తర్వాత జోగులాంబ గద్వాల జిల్లా నుంచి ఆదిలాబాద్‌ వరకు మొత్తం 119 నియోజకవర్గాల్లో పాదయాత్ర చేస్తానని బహిరంగంగానే ప్రకటించారు. దీంతో నల్గొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా అధిష్ఠానం అనుమతిస్తే పాదయాత్రకు సిద్ధమని చాలాసార్లు ప్రకటించారు. ఇలా రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్రలు చేపట్టాలని తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు పలువురు కొద్ది రోజులుగా ప్రణాళికలు రచించుకుంటున్న స‌మ‌యంలో అధిష్టానం బాంబు పేల్చింది. వ్య‌క్తిగ‌త పాద‌యాత్ర‌లు వ‌ద్దే వ‌ద్ద‌ని తేల్చిచెప్పింది. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ప్రజాచైతన్య బస్సు యాత్ర జరుగుతుండగా పాదయాత్రలు చేయ‌వ‌ద్ద‌ని కుండ‌బ‌ద్దుల కొట్టేసింది. దీంతో ఈ నేత‌ల‌కు షాక్ త‌గిలిన‌ట్ల‌యింది.

అయితే ఈ షాక్‌ ను ఊహించ‌ని రేవంత్ ఈ విష‌యాన్ని వెలుగులోకి తెచ్చిన మీడియాపై అస‌హనం వ్య‌క్తం చేశారు. టీడీపీలో ఉన్నప్పుడు పాదయాత్ర చేయాలనుకున్నాన‌ని పేర్కొంటూ కాంగ్రెస్ లోకి వచ్చాక పాదయాత్ర చేస్తానని ఎప్పుడు చెప్పలేదని అన్నారు. తాను పాదయాత్ర చేస్తానని ఎప్పుడు కాంగ్రెస్ హైకమాండ్‌ను అడగలేదు...అడగని దాన్ని అధిష్టానం అనుమతి ఇవ్వలేదని వార్తలు రాయడం సరికాదు అంటూ క‌స్సుమ‌న్నారు. ఇలా ప్ర‌చారం చేయ‌వ‌ద్ద‌ని మీడియాను రేవంత్ కోరుకున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన షాక్‌ ను త‌మ‌కు ఆప‌దించ‌డం ఏంట‌ని మీడియా మిత్రులు స‌ణుక్కుంటున్నారు.