Begin typing your search above and press return to search.

చేరికలతో హ్యాపీ.. టికెట్లేవీ మరి..?

By:  Tupaki Desk   |   16 Oct 2018 12:26 PM GMT
చేరికలతో హ్యాపీ.. టికెట్లేవీ మరి..?
X
తెలంగాణాలో ఎన్నికల పోరు రసవత్తరంగా మారింది. అభ్యర్థులను ప్రకటించేశాం.. గెలుపు మాదే.. సీట్లు మావే అని జోరు మీదున్న టీఆర్ఎస్ కు కాంగ్రెస్ కళ్లెం వేస్తోంది. కూటమిలో లుకలుకలు కలిసి వస్తాయని గులాబీ టీం భావిస్తుండగా, అసంతృప్తులను చేరదీసి విజయాన్ని కూడగట్టుకునే పనిలో పడ్డారు కాంగ్రెస్ శ్రేణులు.

ఈ నెల రాహుల్ పర్యటన సందర్భంగా పెద్ద సంఖ్యలో టీఆర్ఎస్ శ్రేణులను కాంగ్రెస్ లో చేర్చుకునేందుకు వ్యూహం రచిస్తున్నారు. అందరికీ టిక్కెట్లు లేదా పార్టీ పదవులు కట్టబెడుతామని అంటుండటంతో, కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధపడుతున్నారట. బలమైన అభ్యర్థులు లేని ప్రాంతాల్లో టీఆర్ఎస్ ను దీటుగా ఎదుర్కోవచ్చని భావిస్తున్నారట.

కాంగ్రెస్ లో చేరే వాళ్లలో పలువురు కీలక నేతలు కూడా ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఓ మాజీ మంత్రి - నిజామాబాద్ జిల్లా నుంచి మాజీ పీసీసీ కాంగ్రెస్ లో చేరుతున్నట్లు సమాచారం. మరోవైపు టీఆర్ఎస్ నుంచి సస్పెన్షన్ కు గురైన ఎమ్మెల్సీ రాముల నాయక్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కనీసం షోకాజ్ నోటీసు ఇవ్వకుండా వెలి వేశారని కన్నీటి పర్యంతమయ్యారు.ఆయన కూడా కాంగ్రెస్ లో చేరేందుకు నిర్ణయించుకున్నట్టు సమాచారం.

రాహుల్ గాంధీ సమక్షంలో చేరికలు ఉండటంతో కాంగ్రెస్ శ్రేణుల్లో ఒకవైపు ఉత్సాహం నింపుతుండగా, మరోవైపు కలవర పాటుకు గురవుతున్నారు. ఇప్పటికీ సీట్ల సర్దుబాటు వ్యవహారం కొలిక్కి రాలేదు. చాలా చోట్ల నువ్వా నేనా అని పార్టీ నేతలు కాలుదువ్వుతున్నారు. ఇప్పడు కొత్తగా పార్టీలో చేరే వారి రాకతో పరిస్థితి ఎలా ఉంటుందోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.